Site icon HashtagU Telugu

Ambati Rambabu Tweet: అంబ‌టి రాంబాబు ట్వీట్‌.. ఇంత మీనింగ్ ఉందా?

Ambati Rambabu Tweet

Ambati Rambabu Tweet

Ambati Rambabu Tweet: ఏపీలో గ‌త జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో మంత్రిగా చేసి ప్ర‌స్తుతం మాజీ మంత్రిగా ఉన్న వ్య‌క్తి అంబ‌టి రాంబాబు. ఈ ఏడాది జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో టీడీపీ కూట‌మి ఘ‌న విజ‌యం సాధించ‌డంతో వైసీపీ కేవ‌లం 11 స్థానాలు సాధించి ప్ర‌తిప‌క్షానికి ప‌రిమిత‌మై ఉంది. అయితే అధికార ప‌క్షంలో ఉన్న స‌మ‌యంలో ఎక్స్‌లో యాక్టివ్‌గా ఉన్న అంబ‌టి (Ambati Rambabu Tweet) ప్ర‌తిప‌క్షంలో ఉన్న స‌మ‌యంలో కూడా అంతే యాక్టివ్‌గా ఉంటున్నారు. అధికార ప‌క్షం ఏదైనా త‌ప్పు చేస్తే దాన్ని సైటెరిక‌ల్‌గా చెప్ప‌టంలో నేర్ప‌రి అంబ‌టి రాంబాబు..

తాజాగా తెలుగు రాష్ట్రాల్లో సంధ్య థియేట‌ర్ ఘ‌ట‌న ఎంత హాట్ టాపిక్‌గా మారిందో మ‌న‌కు తెలిసిందే. సంధ్య థియేట‌ర్ తొక్కిస‌లాట ఘ‌ట‌న‌లో ఒక మ‌హిళ మృతిచెందగా.. ఆమె కొడుకు శ్రీతేజ్ ప్ర‌స్తుతం కిమ్స్ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే ఈ ఘ‌ట‌న‌లో ఏ11గా ఉన్న టాలీవుడ్ హీరో అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్ట్ చేసి చిక్క‌డ‌ప‌ల్లి పోలీస్ స్టేష‌న్‌కు తీసుకెళ్లిన విష‌యం తెలిసిందే. అక్క‌డ్నుంచి నాంప‌ల్లి కోర్టులో హాజ‌రుప‌ర‌చ‌గా కోర్టు 14 రోజుల‌పాటు రిమాండ్ విధించింది. అయితే తెలంగాణ హైకోర్టు మ‌ధ్యంత‌ర బెయిల్ ప్ర‌క‌టించ‌డంతో అల్లు అర్జున్ చంచ‌ల్‌గూడ జైలులో ఒక రాత్రి ఉండాల్సి వ‌చ్చింది. అయితే ఈ ఘ‌ట‌న‌పై తెలుగు రాష్ట్రాల్లోని రాజ‌కీయ ప్ర‌ముఖులు స్పందించారు. ఈ విష‌య‌మై స్పందించిన అంబటి అల్లు అర్జున్ అరెస్ట్ అన్యాయ‌మ‌ని ట్వీట్ చేశారు.

Also Read: AAP Vs Congress : మాకెన్‌పై చర్యలు తీసుకోకపోతే.. ‘ఇండియా’ నుంచి కాంగ్రెస్‌ను తీసేయాలి : ఆప్

అయితే ఇటీవ‌ల సంధ్య థియేట‌ర్ ఘ‌ట‌న‌పై తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. అదేవిధంగా ఇక‌పై తెలంగాణ‌లో బెనిఫిట్ షోలు, టికెట్ల రేట్ల పెంపు ఉండ‌ద‌ని స్ప‌ష్టం చేశారు. ఆ త‌ర్వాత అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ ప్ర‌భుత్వంపై ప‌రోక్షంగా విమ‌ర్శ‌లు చేశారు. ఆ త‌ర్వాత జ‌రిగిన ఘ‌ట‌న‌లు మ‌న‌కు తెలిసిందే. అయితే తాజాగా సీఎం రేవంత్‌కు టాలీవుడ్ పెద్ద‌ల‌కు మ‌ధ్య స‌మావేశం జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ భేటీలో ప‌లు విష‌యాల‌పై సీఎం రేవంత్ స్ప‌ష్టం చేయ‌గా.. టాలీవుడ్ పెద్ద‌లు త‌మ‌కు కావాల్సిన అంశాల‌ను సీఎం ముందు ఉంచారు.

అయితే సీఎం రేవంత్‌- టాలీవుడ్ పెద్ద‌ల మ‌ధ్య జ‌రిగిన భేటీ త‌ర్వాత ఏపీ నుంచి మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు ఆస‌క్తికర ట్వీట్ చేశారు. పూర్తి పరిష్కారానికి .. “Sofa” చేరాల్సిందే! అని ట్వీట్ చేశారు. అయితే ఈ ట్వీట్ కు చాలా పెద్ద అర్థ‌మే ఉంద‌ని నెటిజ‌న్లు ట్వీట్ చేస్తున్నారు. పుష్ప‌2 మూవీలో పుష్ప‌రాజ్ ఏ విధంగా అయితే రాజ‌కీయ నాయ‌కుల‌కు సోఫా పంపిస్తున్నాను అని చెప్పి డ‌బ్బు పంపిణీ చేస్తాడో అదే విధంగా తెలంగాణ సీఎం రేవంత్‌, అత‌ని మంత్రుల‌కు కూడా సోఫా పంపితేనే టాలీవుడ్ స‌మ‌స్య‌లు ప‌రిష్కార‌మ‌వుతాయ‌నే ఉద్దేశంతో అంబ‌టి ట్వీట్ చేశాడ‌ని నెటిజ‌న్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఈ ట్వీట్‌పై ప‌లు ర‌కాల కామెంట్లు పెడుతున్నారు. మ‌రీ అంబ‌టి ఏ ఉద్దేశంతో పెట్టాడో అత‌నికే తెలియాలి.