వెన్నుపోటు (Vennupotu) దినోత్సవం సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YCP) రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టిన వేళ, పార్టీ నేతల వ్యవహార శైలి ఒక్కసారిగా హీటెక్కింది. గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. పర్మిషన్ లేకుండా ర్యాలీకి ప్రయత్నించిన ఆయనను పోలీసులు అడ్డుకోవడంతో నడిరోడ్డుపైనే “నువ్వెంత?” అనే స్థాయిలో ఘర్షణ చోటుచేసుకుంది. మాటల తూటాలు పేలాయి. అధికారి నరహరి కూడా వెనుకాడకుండా ఎదురుతిరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
ఇక తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని కూడా పోలీసులు అడ్డుకోవడం వల్ల అక్కడా ఉద్రిక్తత నెలకొంది. హైకోర్టు అనుమతి ఉన్నా తన ప్రయాణాన్ని అడ్డుకోవడమేంటని పెద్దారెడ్డి ప్రశ్నించగా, పోలీసులతో తీవ్ర వాగ్వాదం జరిగింది. మరోవైపు చీపురుపల్లిలో ఎండవేడిని తట్టుకోలేక బొత్స సత్యనారాయణ ప్రసంగం మధ్యలోనే కుప్పకూలిపోయారు. తక్షణమే ఆసుపత్రికి తరలించగా, ఆయన ప్రస్తుతం సురక్షితంగా కోలుకుంటున్నారు. జగన్ స్వయంగా ఫోన్ చేసి బొత్సను పరామర్శించడం గమనార్హం.
ఇక రాష్ట్రవ్యాప్తంగా నాయకులు రోడ్లపై పోరాటానికి దిగితే, జగన్ మాత్రం బెంగళూరులో రెస్ట్ తీసుకుంటుండడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కార్యకర్తలు పోరాటానికి బలిగా మారితే, నేతలు గాయపడితే, జగన్ మాత్రం హాయిగా ఇంట్లో ఉండడం ఏంటి అని సోషల్ మీడియాలో విస్తృతంగా ట్రోలింగ్ జరుగుతోంది. ఇదంతా చూసిన జనాలు మాత్రం వైసీపీ లీడర్స్ కు ఉచిత సలహాలు ఇస్తున్నారు. అసలే మీ టైమ్ బాలేదు. పవర్ కూడా లేదు. రెడ్ బుక్ వేట కొనసాగుతోంది. సహచరులంతా వరుసగా అరెస్ట్ అవుతూ జైలు ఊచలు లెక్కపెడుతున్నారు. ఇలాంటి సమయంలో మీరు రోడ్లపైకి వచ్చి పోలీసులతోనే గొడవలకు దిగితే ఎలా..? కాస్త మీ వయసు ..భవిష్యత్ కూడా చూసుకోవాలి కదా..? అని ప్రశ్నిస్తున్నారు.