Ambati Rambabu : మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సత్తెనపల్లి పర్యటన సందర్భంగా, YSRCP నేతలు, కార్యకర్తల తాకిడితో స్థానికంగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన తీరుపై పోలీసుల అభ్యంతరం వ్యక్తమవడంతో, ఆయనపై కేసు నమోదు చేసినట్టు అధికారులు తెలిపారు.
పల్నాడు జిల్లా సరిహద్దుల్లో ముందస్తు జాగ్రత్త చర్యలుగా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ముఖ్యంగా కంటేపూడి వద్ద వైసీపీ నేతలు, కార్యకర్తల వాహనాలను పోలీసులు అడ్డుకుంటున్నారు. ఈ సమయంలో అదే దారి గుండా వస్తున్న మాజీ మంత్రి అంబటి రాంబాబు, బారికేడ్లను తొలగించాలంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తమ వాహనం ఆపిన తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ, కార్యకర్తల సహాయంతో బారికేడ్లను నెట్టేయించారు.
ఈ ఘటనతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. అంబటి అనుచరులు, పోలీసులు ఒకరినొకరు తోసుకునే స్థితి ఏర్పడింది. పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసులు గట్టి ప్రయత్నాలు చేయాల్సి వచ్చింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో విధుల్లో ఉన్న పోలీసులకు అడ్డంకులు కలిగించడంతో పాటు, బారికేడ్లు ధ్వంసం చేసినందుకు ఐపీసీ సెక్షన్లు 188 (ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించడం), 332 (పోలీసులకు గాయాలు కలిగించడం), 353 (విధి నిర్వర్తనలో అధికారికి అడ్డుపడడం), 427 (ఆస్తి నష్టం) కింద అంబటి రాంబాబుపై కేసు నమోదు చేసినట్లు సత్తెనపల్లి పోలీసులు స్పష్టం చేశారు.
Illegal Affair: అక్రమ సంబంధం.. అడ్డంగా దొరికిన భార్య.. కోపంతో భార్య ముక్కు కొరికేసిన భర్త