Site icon HashtagU Telugu

Pegasus Spyware: పెగాసస్ స్పై వేర్‌ను.. చంద్ర‌బాబు కొనే ఉంటారు..?

Ambati Rambabu Tdp Pegasus Spyware

Ambati Rambabu Tdp Pegasus Spyware

పెగాసస్ స్పై వేర్ వివాదం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌కంప‌నలు రేపుతుంది. ఏపీలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పెగాసస్ సాఫ్ట్ వేర్ ను కొనుగోలు చేశారని ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మమత బెనర్జీ ఆరోపించిన సంగ‌తి తెలిసిందే. పెగాసస్ సాఫ్ట్ వేర్ ను 25 కోట్ల రూపాయలకు విక్రయిస్తామంటూ కొంద‌రు త‌న‌ని సంప్రదించారని, అయితే తాను తిరస్కరిచాన‌ని తెలిపింది.

అయితే ఆ సాఫ్ట్ వేర్‌ను ఏపీలోని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు కొనుగోలు చేశారని మమత బెనర్జీ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. మ‌మ‌తా బెన‌ర్జీ వ్యాఖ్య‌ల పై చంద్ర‌బాబు అండ్ టీడీపీ త‌మ్ముళ్ళు ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డ్డారు. దీంతో పెగాస‌స్ వివాదంపై అధికారం వైసీపీ, ప్ర‌తిప‌క్ష టీడీపీ నేత‌ల మ‌ధ్య మాట‌ల యుద్ధం సాగుతోంది. ఈ క్ర‌మంలో తాజాగా వైసీపీ ఎమ్మెల్యే అంబ‌టి రాంబాబు త‌న‌దైన శైలిలో స్పందించారు.

పెగాసస్ స్పైవేర్‌కు సంబంధించి చంద్రబాబు ఎందుకు ఆందోళన చెందుతున్నారో అర్థం కావడం లేదని అంబటి రాంబాబు అన్నారు. మమత బెనర్జీ అసెంబ్లీలో ప్రకటించారంటే ఏదో జ‌రిగే ఉంటుందని అంబ‌టి రాంబాబు అన్నారు. ఇక‌పోతే మమత బెనర్జీతో తమ పార్టీకి ఎలాంటి స్నేహపూర్వకమైన సంబంధాలు లేవని చెప్పారు. ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోదీకి వ్యతిరేకంగా చంద్రబాబు, మమత కలసి పనిచేసిన విషయం వాస్తవం కాదా అని అంబటి రాంబాబు ప్రశ్నించారు.

ప్ర‌పంచ టెక్నాలజీకి తానే ఆద్యుడనని చెప్పుకునే చంద్రబాబు అధికారికంగా కాకుండా వ్యక్తిగతంగా కొనుగోలు చేసి ఉండవచ్చని అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. ఇక సాక్షి దినపత్రికపై పరువు నష్టం దావా వేసిన నారా లోకేష్ మమతపై కూడా వేస్తారా అని ప్రశ్నించారు. పెగాసస్ స్పై వేర్ కొనుగోలుపై పూర్తి స్థాయి విచారణ జరపాలని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీపై నిఘా పెట్టిందని, అప్పటి ఇంటలిజెన్స్ ఐజీ ఏబీ వెంకటేశ్వరరావు ద్వారా తమ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన విషయాన్ని అంబటి గుర్తు చేశారు. పెగాసస్ స్పై వేర్‌ను నాటి అధికార‌ తెలుదేశంపార్టీ ప్రయోగించే ఉంటుందని అంబ‌టి రాంబాబు అభిప్రాయ‌ప‌డ్డారు.