Ambati Rambabu : రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు సహజమే అయినప్పటికీ, గౌరవప్రదమైన పదవుల్లో ఉన్న వ్యక్తులు వాడే భాషా పరిమితులు దాటినప్పుడు అది ప్రజాస్వామ్యానికే అవమానంగా మారుతుంది. తాజాగా మాజీ మంత్రి అంబటి రాంబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మరియు నారా లోకేష్‌లను లక్ష్యంగా చేసుకుని చేసిన అత్యంత జుగుప్సాకరమైన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. గుంటూరు గోరంట్ల వద్ద టీడీపీ ఏర్పాటు చేసిన లడ్డూ కల్తీ వ్యహారపు ఫ్లెక్సీని తొలగించే క్రమంలో ఆయన ప్రదర్శించిన తీరు, పోలీసులు అడ్డుకుంటున్నా కారులో నుంచి తల బయటపెట్టి మరీ బూతులు మాట్లాడటం రాజకీయ విశ్లేషకులను సైతం విస్మయానికి గురిచేస్తోంది. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిపై ఇలాంటి అభ్యంతరకర భాషను వాడటం ఆయన సంస్కారానికే ప్రశ్నార్థకంగా మారింది.
గోరంట్లలోని ఒక ఆలయం వద్ద ఉద్రిక్తత నెలకొన్న సమయంలో, అంబటి రాంబాబు తన రాజకీయ ఉనికిని చాటుకోవడానికి ఈ ఘటనను ఒక వేదికగా మలుచుకున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన తెలపడంతో పోలీసులు ఆయనను అక్కడ నుంచి పంపించే ప్రయత్నం చేశారు. అయితే, ఆ సమయంలో మీడియా ముందు ముఖ్యమంత్రి కుటుంబంపై బండబూతులు అనడం చర్చనీయాంశమైంది. గత ఎన్నికల్లో ప్రజలు వైసీపీ నేతల భాషను, ప్రవర్తనను గమనించి తగిన బుద్ధి చెప్పినప్పటికీ, ఇంకా అదే ధోరణిని కొనసాగించడం వారి పతనావస్థకు నిదర్శనమని సామాన్య ప్రజలు మండిపడుతున్నారు.
అంబటి రాంబాబు చేసిన ఈ ఘోరమైన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది. ఐదేళ్ల పాలనలో బూతుల రాజకీయాలకే పరిమితమైన నేతలు, అధికారం కోల్పోయిన తర్వాత కూడా అదే పంథాను అనుసరించడం వల్ల వారికి ప్రజల్లో మరింత వ్యతిరేకత పెరుగుతుందని రాజకీయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేవలం రాజకీయ ఉనికి కోసం వ్యక్తిత్వ హననానికి పాల్పడటం సరైన పద్ధతి కాదని, ఇలాంటి భాషను వాడే నేతలకు చట్టపరమైన శిక్షలతో పాటు ప్రజలు కూడా తగిన రీతిలో ‘ట్రీట్మెంట్’ ఇవ్వాలనే అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి.
