Amaravati Farmers: భూములివ్వ‌డానికి అమ‌రావ‌తి రైతుల నిరాక‌ర‌ణ‌

అమరావతికి వెళ్లే రహదారి విస్తరణకు భూములు ఇవ్వడానికి రైతులు స‌సేమిరా అంటున్నారు.

Published By: HashtagU Telugu Desk
Road Tax

Road Tax

అమరావతికి వెళ్లే రహదారి విస్తరణకు భూములు ఇవ్వడానికి రైతులు స‌సేమిరా అంటున్నారు. ఫ‌లితంగా కృష్ణా ఒడ్డున ఉండవల్లిలోని కరకట్ట రోడ్డు విస్తరణ పనులు చేయ‌లేని ప‌రిస్థితికి జ‌గ‌న్ స‌ర్కార్ వెళ్లిపోయింది. గ‌తానుభ‌వాల‌ను దృష్టిలో ఉంచుకున్న రైతులు చ‌ద‌ర‌పు గ‌జానికి రూ. 10వేల చొప్పున ముందుగా చెల్లిస్తేనే భూములు ఇస్తామ‌ని భీష్మించారు. అధికారుల మాత్రం చదరపు గజానికి రూ.5వేలు పరిహారంగా అందించారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం చదరపు గజానికి రూ.10 వేలు చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. పరిహారంపై ఉత్కంఠభరితమైన చర్చ జరగడంతోంది. తుది నిర్ణయం తీసుకోకుండానే అర్థాంత‌రంగా స‌మావేశం ముగియ‌డంతో క‌ర‌క‌ట్ట రోడ్డు విస్త‌ర‌ణ ప‌నులు ఇప్ప‌ట్లో వేగం పుంజుకునేలా క‌నిపించ‌డంలేదు.

ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, శాసనసభ్యులు, హైకోర్టు న్యాయమూర్తులు మరియు ఇతర ఉన్నతాధికారులు తరచూ వచ్చే వీఐపీ రహదారి గా క‌ర‌క‌ట్ట రోడ్డు ఉంది. దీంతో ఈ రహదారిని నాలుగు లేన్లుగా విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎపిసిఆర్‌డిఎ విస్తరణ పనులు ప్రారంభించినా భూములు ఇస్తే న్యాయమైన పరిహారం ఇవ్వాలని రైతులు డిమాండ్‌ చేశారు. ప్రకాశం బ్యారేజీ నుంచి రాయపూడి వరకు 16 కిలోమీటర్ల మేర రూ.150 కోట్లతో కరకట్ట రోడ్డును 33 అడుగుల వెడల్పుతో విస్తరించనున్నారు.

మొదటి దశలో ప్రకాశం బ్యారేజీ నుంచి ప్రకృతి ఆశ్రమం వరకు రూ.70 కోట్లతో 5 కిలోమీటర్ల మేర రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించారు. విస్తరణకు 31 మంది రైతుల భూమి అవసరం కాగా న్యాయమైన పరిహారం అందజేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. కానీ, రైతులు మాత్రం హామీ ఇచ్చిన పరిహారం ఇవ్వకుండానే అధికారులు పనులు ప్రారంభించారని ఆరోపించారు. తమకు చెల్లింపులు జరిగే వరకు ఏపీసీఆర్‌డీఏ భూ సేక‌ర‌ణ నిలిపివేయాలని డిమాండ్‌ చేస్తూ నిరసనలు, ర్యాలీలు నిర్వహించారు. సమస్యల పరిష్కారానికి ఏపీసీఆర్డీఏ ఆధ్వర్యంలో రైతులతో జ‌రిగిన సమావేశం అనుకూల ఫ‌లితాల‌ను ఇవ్వ‌లేదు.

  Last Updated: 16 Jun 2022, 01:15 PM IST