Amaravati : నేడు పార్లమెంట్ లో అమరావతి చట్టబద్ధత బిల్లు ..అసలు ‘అమరావతికి చట్టబద్ధత’ అంటే ఏం చేస్తారు?

రాజధాని విషయంలో ఉన్న న్యాయపరమైన చిక్కులు తొలగిపోవడంతో ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ADB) వంటి అంతర్జాతీయ సంస్థల నుంచి నిధుల సేకరణ మరింత సులభతరం అవుతుంది

Published By: HashtagU Telugu Desk
Amaravati

Amaravati

2014 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో రాజధాని అంశంపై ఉన్న అస్పష్టతను తొలగించడమే ఈ ‘చట్టబద్ధత’ ప్రధాన ఉద్దేశం. విభజన చట్టంలోని సెక్షన్ 5, సబ్ సెక్షన్ 2 ప్రకారం.. పదేళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుందని, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు ‘ఒక కొత్త రాజధాని’ (A New Capital) ఉంటుందని మాత్రమే పేర్కొన్నారు. అయితే ఆ కొత్త రాజధాని ఏది అనే పేరు చట్టంలో స్పష్టంగా లేదు. నేడు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టబోయే సవరణ బిల్లులో ఆ ఖాళీని భర్తీ చేస్తూ.. “ఆంధ్రప్రదేశ్‌కు అమరావతి నూతన రాజధానిగా ఉంటుంది” అని అధికారికంగా పేరును పొందుపరుస్తారు. దీనివల్ల అమరావతి అనేది కేవలం ఒక రాష్ట్ర నోటిఫికేషన్ ద్వారా ఏర్పడిన నగరం మాత్రమే కాకుండా, పార్లమెంట్ ఆమోదించిన దేశ చట్టంలో భాగమవుతుంది.

CRDA పరిధికి రాజ్యాంగ రక్షణ

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ప్రవేశపెట్టనున్న ఈ బిల్లులో రాజధాని విస్తీర్ణంపై కూడా స్పష్టతనిచ్చారు. రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (CRDA) నోటిఫై చేసిన మొత్తం భూభాగం ఇకపై అధికారికంగా రాజధాని పరిధిలోకి వస్తుంది. 2024 జూన్ 2 నుంచి అమరావతిని శాశ్వత రాజధానిగా గుర్తించేలా ఈ సవరణలు ఉంటాయి. ఈ చట్టబద్ధత లభించడం వల్ల భవిష్యత్తులో రాజకీయ మార్పులు జరిగినప్పటికీ, రాజధానిని మార్చడం లేదా మూడు రాజధానుల వంటి ప్రతిపాదనలు తీసుకురావడం అంత సులభం కాదు. కేంద్ర చట్టం ద్వారా రాజధాని ఖరారు కావడంతో అమరావతికి ఒక రకమైన ‘రాజ్యాంగ రక్షణ’ లభిస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ఏపీ ఆర్థిక భవిష్యత్తుకు భరోసా

శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించడం వల్ల కేవలం రాజకీయ ప్రయోజనాలే కాకుండా, భారీ ఆర్థిక ప్రయోజనాలు కూడా చేకూరనున్నాయి. రాజధాని విషయంలో ఉన్న న్యాయపరమైన చిక్కులు తొలగిపోవడంతో ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ADB) వంటి అంతర్జాతీయ సంస్థల నుంచి నిధుల సేకరణ మరింత సులభతరం అవుతుంది. అలాగే, రాజధాని శాశ్వతమని నమ్మకం కలగడంతో భారీ పరిశ్రమలు, ఐటీ సంస్థలు అమరావతి వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. విభజన సమయంలో జరిగిన అన్యాయాన్ని సవరిస్తూ, ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పార్లమెంట్ వేదికగా అమరావతికి పట్టాభిషేకం జరగడం రాష్ట్ర చరిత్రలో ఒక కీలక మైలురాయిగా నిలిచిపోనుంది.

  Last Updated: 01 Apr 2026, 10:36 AM IST