AP Amaravati Politics: ఔను! వాళ్లిద్ద‌రి ఆత్మ జూనియ‌ర్!

ఎంకి పెళ్లి సుబ్బిచావుకు వ‌చ్చింద‌ని సామెత‌. అమ‌రావ‌తి రైతుల ఇష్యూ జూనియ‌ర్ ఎన్టీఆర్ మెడ‌కు చుట్టుకుంది.

  • Written By:
  • Updated On - October 14, 2022 / 11:07 AM IST

ఎంకి పెళ్లి సుబ్బిచావుకు వ‌చ్చింద‌ని సామెత‌. అమ‌రావ‌తి రైతుల ఇష్యూ జూనియ‌ర్ ఎన్టీఆర్ మెడ‌కు చుట్టుకుంది. `నంద‌మూరి వంశ‌స్తుడివే అయితే అమ‌రావ‌తి రైతుల‌కు అండ‌గా ఉండాలి. ఎన్టీఆర్ మ‌న‌వ‌డిగా ధైర్యం ఉంటే అమ‌రాతి రాజ‌ధాని కోసం స్పందించాలి` అంటూ ఒక వీడియోను కొంద‌రు రైతులు రెండు రోజుల క్రితం విడుద‌ల చేశారు. సోష‌ల్ మీడియాలో ఆ వీడియో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. జూనియ‌ర్ అభిమానులు, అమ‌రావ‌తి రైతుల మ‌ధ్య సోష‌ల్ మీడియా వేదిక‌గా వార్ జ‌రుగుతోంది.

ఆ వీడియో వార్ లోకి టీడీపీ రెబ‌ల్ ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ, మాజీ మంత్రి కొడాలి వెంక‌టేశ్వ‌ర‌రావు అలియాస్ నాని దిగారు. జూనియ‌ర్ కు మ‌ద్ధ‌తు ప‌లుకుతూ మీడియా స‌మావేశాల‌ను పెట్టారు. అమ‌రావ‌తి రాజ‌ధాని ఇష్యూతో జూనియ‌ర్ కు ఏం సంబంధం అంటూ నిల‌దీస్తున్నారు. స‌రిగ్గా ఇక్క‌డే ఆ ఇద్ద‌రు నేత‌ల్ని టీడీపీ కార్న‌ర్ చేయ‌డానికి సిద్ధం అయింది. ఇటీవ‌ల దాకా జూనియ‌ర్ తో ఎలాంటి సంబంధంలేద‌ని ఆ ఇద్ద‌రు చెప్పుకొచ్చారు. ఇప్పుడు మ‌ద్ధ‌తు ప‌లుకుతూ జూనియ‌ర్ పై విడుద‌ల చేసిన వీడియోను త‌ప్పుబ‌డుతున్నారు. అంటే జూనియ‌ర్ తో వంశీ, నానికి ఇప్ప‌టికీ సంబంధాలు ఉన్నాయ‌ని నిరూపించే ప్ర‌య‌త్నం టీడీపీ చేస్తోంది.

ఏపీలో జ‌రిగే ప్ర‌తి వివాద‌స్ప‌ద అంశం జూనియ‌ర్ ను టచ్ చేస్తోంది. అసెంబ్లీ వేదిక‌గా చంద్ర‌బాబు స‌తీమ‌ణి భువ‌నేశ్వ‌రిపై జ‌రిగిన వ్య‌క్తిత్వ హ‌న‌నం జూనియ‌ర్ వాల‌కాన్ని ప్ర‌శ్నించేలా చేసింది. హెల్త్ యూనివ‌ర్సిటీకి ఎన్టీఆర్ పేరు మార్పు పై ఆయ‌న నుంచి వచ్చిన రియాక్ష‌న్‌ చ‌ర్చ‌కు దారితీసింది. తాజాగా అమ‌రావ‌తి రైతులు విడుద‌ల చేసిన వీడియో జూనియ‌ర్ ను వివాదంలోకి లాక్కెళ్లింది. ఇవ‌న్నీ ఆయ‌న‌కు ఏ మాత్రం ప్ర‌మేయం లేకుండా జ‌రిగిన అంశాలే. కానీ, అనివార్యంగా జూనియ‌ర్ ఇమేజ్ ను నిల‌దీసేలా ఉన్నాయ‌న‌డంలో సందేహం లేదు.

ఇలాంటి ప‌రిస్థితుల్లో వ‌ల్ల‌భ‌నేని, కొడాలి ఎంట్రీ ఇస్తూ జూనియ‌ర్ కు అండ‌గా నిలిచే ప్ర‌య‌త్నం చేయ‌డం మ‌రింత రాద్దాంతంగా మారింది. జూనియ‌ర్ క‌ష్ట‌ప‌డి ఇమేజ్ ను సంపాదించుకున్నార‌ని వాళ్లిద్ద‌రు చెబుతున్నారు. కుటుంబంలో జ‌రిగిన కొన్ని సంఘ‌ట‌న‌లు చెబితే కొంద‌రికి నిద్ర‌కూడా ప‌ట్ట‌దంటూ ప‌రోక్షంగా చంద్ర‌బాబుకు వార్నింగ్ ఇచ్చారు. సినిమా కెరీర్ నుంచి పెళ్లి వ‌ర‌కు అన్నీ జూనియ‌ర్ స్వ‌యంకృషి మాత్ర‌మేనంటూ చెబుతూ 2009లో ఆయ‌న్ను రాజ‌కీయంగా వాడుకున్నార‌ని గుర్తు చేశారు. వార్ జోన్ లోకి కొడాలి, వ‌ల్ల‌భ‌నేని ఎంట్రీ ఇవ్వ‌డంతో ప్ర‌తిగా వ‌ర్ల అండ్ టీమ్ రెడీ అయింద‌ట‌. ఇప్ప‌టి వ‌ర‌కు రైతులు, ఫ్యాన్స్ మ‌ధ్య మాత్ర‌మే జ‌రిగిన వార్ కొడాలి, వ‌ల్ల‌భ‌నేని ఎంట్రీతో రాజ‌కీయాన్ని సంత‌రించుకుంది.