Amaravati Farmers : ఢిల్లీలో అమ‌రావ‌తి రైతుల ఫైట్

ఏపీ సీఎం జ‌గ‌న్ ఢిల్లీ వెళ్లిన రోజే అమ‌రావ‌తి రాజ‌ధాని రైతులు కేంద్ర మంత్రుల‌ను క‌లిశారు. రాజ‌ధాని ప్రాంతంలో కేంద్ర త‌ర‌పును కేటాయించిన సంస్థ‌ల నిర్మాణం త్వ‌రిత‌గ‌తిన చేప‌ట్టాల‌ని కేంద్ర మంత్రులుకు విజ్ఞ‌ప్తి చేశారు.

  • Written By:
  • Publish Date - April 5, 2022 / 05:54 PM IST

ఏపీ సీఎం జ‌గ‌న్ ఢిల్లీ వెళ్లిన రోజే అమ‌రావ‌తి రాజ‌ధాని రైతులు కేంద్ర మంత్రుల‌ను క‌లిశారు. రాజ‌ధాని ప్రాంతంలో కేంద్ర త‌ర‌పును కేటాయించిన సంస్థ‌ల నిర్మాణం త్వ‌రిత‌గ‌తిన చేప‌ట్టాల‌ని కేంద్ర మంత్రులుకు విజ్ఞ‌ప్తి చేశారు. ఇప్ప‌టికే కేంద్రం దృష్టికి అమ‌రావ‌తి రాజ‌ధాని నిర్మాణం గురించి తీసుకెళ్లారు. ఇప్పుడు మరోసారి రైతులు హ‌స్తిన‌లో రాజ‌ధాని కోసం పోరాటం చేస్తున్నారు. కేంద్ర మంత్రుల‌ను క‌లిసే జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కంటే ముందుగా ఆయా మంత్రుల‌ను రైతులు క‌ల‌వ‌డం గ‌మ‌నార్హం. ఢిల్లీ వెళ్లిన ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి రైతులు ముగ్గురు కేంద్ర మంత్రుల‌తో మంగ‌ళ‌వారం భేటీ అయ్యారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌తో పాటు నారాయ‌ణ్ రాణే, న‌రేంద్ర సింగ్ తోమ‌ర్‌ల‌తో రైతులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాజ‌ధానిలో కేంద్రం త‌ర‌ఫున చేప‌ట్టాల్సిన నిర్మాణాల‌ను త్వ‌రిత‌గ‌తిన పూర్తి చేయాల‌ని కేంద్ర మంత్రుల‌ను కోరారు.

అమ‌రావ‌తిలో ఏర్పాటు చేయాల్సిన సెంట్ర‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ అంశాన్ని ఎంఎస్ఎంఈ శాఖా మంత్రి నారాయ‌ణ్ రాణేతో భేటీ సంద‌ర్భంగా ప్ర‌స్తావించారు. ఆ సంస్థ కోసం రాజ‌ధాని ప‌రిధిలోని శాఖ‌మూరులో 5 ఎక‌రాలు కేటాయించిన‌ట్లు రైతులు గుర్తు చేశారు. ఇక ఆ స్థ‌లం కోసం కేంద్ర ప్ర‌భుత్వం రూ.20.45 ల‌క్ష‌లు చెల్లించిన‌ట్టు కూడా మంత్రికి వివ‌రించారు. రాజ‌ధాని నిర్మాణాన్ని త్వ‌రిత‌గతిన పూర్తి చేయాలంటూ ఇటీవ‌ల హైకోర్టు ఇచ్చిన తీర్పును కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రాజ‌ధాని రైతులు చెప్పిన అంశాల‌న్నింటినీ సావ‌ధానంగా విన్న కేంద్ర మంత్రి వ‌చ్చే నెల‌లోనే టూల్ డిజైన్‌కు శంకుస్థాప‌న చేస్తామ‌ని రైతుల‌కు హామీ ఇచ్చారు. అనంతరం రాజ‌ధాని రైతులు కేంద్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి న‌రేంద్ర సింగ్ తోమ‌ర్‌తో భేటీ అయ్యారు. వ్య‌వ‌సాయ రంగానికి చెందిన ప‌లు అంశాల‌ను ఆయ‌న‌తో చ‌ర్చించారు. ఆ త‌ర్వాత కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామ‌న్ వ‌ద్ద‌కు వెళ్లారు. రాజ‌ధాని నిర్మాణంలో జ‌రుగుతున్న జాప్యం, కేంద్రం చొర‌వ చూపాల్సిన ఆవ‌శ్య‌క‌త గురించి. ఆమెకు వివ‌రించారు. కేంద్రం నుంచి విడుద‌ల కావాల్సిన నిధులు, రాజధానిలో ఏర్పాటు కావాల్సిన ప‌లు కేంద్ర సంస్థ‌ల‌పై నిర్మాల‌సీతారామ‌న్ దృష్టికి రైతులు తీసుకెళ్లారు.
మొత్తం మీద ఏపీ ప్ర‌భుత్వం అధికారికంగా చేయాల్సిన రాజ‌ధాని ప‌నుల గురించి రైతులు కేంద్రంతో సంప్ర‌దింపులకు దిగారు. హైకోర్టు తీర్పుతో పాటు రాష్ట్ర ప్ర‌భుత్వం వైఖ‌రిని ఢిల్లీ వేదిక‌గా ఎండ‌గ‌ట్టే ప్ర‌య‌త్నం చేశారు. ఢిల్లీలో సీఎం జ‌గ‌న్ ఉండ‌గానే అమ‌రావ‌తి రైతులు ఆయ‌న పాల‌న‌పై ఫిర్యాదు చేయ‌డం గ‌మ‌నార్హం.