Amaravati Farmers : అమ‌రావ‌తి టూ అర‌స‌వ‌ల్లి.. ప్రారంభ‌మైన అమ‌రావ‌తి రైతుల మ‌హాపాద‌యాత్ర 2.0

అమరావతిని రాజధానిగా కొనసాగించాలనే డిమాండ్‌తో అమరావతి రైతుల రెండో విడత పాదయాత్ర..

  • Written By:
  • Publish Date - September 12, 2022 / 09:10 AM IST

అమరావతిని రాజధానిగా కొనసాగించాలనే డిమాండ్‌తో అమరావతి రైతుల రెండో విడత పాదయాత్ర నేడు (సోమవారం) ప్రారంభ‌మైంది. అమరావతి నుంచి అరసవల్లి వరకు కొనసాగనున్న ఈ యాత్రకు రాష్ట్ర పోలీసులు అనుమతి నిరాకరించగా, ఏపీ హైకోర్టు అనుమతి ఇచ్చింది. అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల రైతులు ఇందులో దశల వారీగా పాల్గొంటారు. ఈ రోజు (సోమవారం) వెంకటపాలెం నుంచి బయలుదేరి ఈనెల 11న శ్రీకాకుళం జిల్లా అరసవల్లి చేరుకుంటుంది.

వెంకటపాలెంలో టీటీడీ నిర్మించిన శ్రీవారి ఆలయంలో పూజలు చేసి రైతులు.. ధ్వజారోహణం చేసి యాత్రను లాంఛనంగా ప్రారంభించారు. తొలిరోజు 15 కిలోమీటర్ల మేర యాత్ర సాగనుంది. ఈ కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, సీపీఎం, జనసేన నాయకులు పాల్గొంటారు. అమరావతి రైతుల మహా పాదయాత్రతో ఉత్తర కోస్తాంధ్రలో ఉద్రిక్తత నెలకొంది. ఈ యాత్ర అమరావతి నుంచి ప్రారంభమై గోదావరి జిల్లాల మీదుగా విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం వరకు కొనసాగనుంది. ఇప్పటికే విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా జగన్ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు ఈ నెల 15 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లోనే మూడు రాజధానుల బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ సమయంలో మూడు రాజధానులకు వ్యతిరేకంగా అమరావతిని మాత్రమే రాజధానిగా ప్రకటించాలని చేస్తున్న‌ మహాపాదయాత్ర ఆసక్తికరంగా మారనుంది.