Site icon HashtagU Telugu

Amaravati Farmers : అమ‌రావ‌తి రైతుల‌పై దాడి, `రాజ‌ధానుల‌` ఫైట్‌!

Amaravati Farmers Mp Bharat

Amaravati Farmers Mp Bharat

అమ‌రావ‌తి రైతుల‌కు అస‌లు సిస‌లైన స‌వాల్ ఎదురైయింది. ఉత్త‌రాంధ్ర బోర్డ‌ర్ కు ఎంట‌ర్ కాక‌ముందే రాజమండ్రి వ‌ద్ద వాళ్ల మీద దాడి జ‌రిగింది. ఏకైక రాజ‌ధాని అమ‌రావ‌తికి వ్య‌తిరేకంగా మూడు రాజ‌ధానుల ముఠా రోడ్ల‌పైకి వ‌చ్చింది. వైజాగ్ కేంద్రంగా ఏర్ప‌డిన మూడు రాజ‌ధానుల జేఏసీకి వైసీపీ మ‌ద్ధ‌తు ఉంది. అమ‌రావ‌తికి మ‌ద్ధతుగా టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ, క‌మ్యూనిస్ట్ లు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మూడు రాజ‌ధానులు వ‌ర్సెస్ అమ‌రావ‌తి యుద్ధం ప్ర‌త్య‌క్షంగా రాజ‌మండ్రి వ‌ద్ద క‌నిపించింది.

రాజ‌మండ్రి ఎంపీ మార్గాని భ‌ర‌త్ అనుచ‌రుల‌తో కలిసి అమ‌రావ‌తి రైతుల‌పై దాడికి దిగారు. కుర్చీలు, క‌ర్ర‌లు, ఖాళీ బాటిళ్లు, రాళ్ల‌తో దాడికి పాల్ప‌డిన‌ట్టు తెలుస్తోంది. ఆ సంద‌ర్భంగా పోలీసులు సైతం నిమ్మ‌కుండి పోయారు. పెట్రోలు పోశార‌ని అమ‌రావ‌తి రైతులు ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. రాజ‌మండ్రిలోని ఆజాద్ చౌక్ వ‌ద్ద పాద‌యాత్ర చేస్తోన్న రైతుల‌ను వైసీపీ క్యాడ‌ర్ అడ్డుకుంది. ఇరువ‌ర్గాల మ‌ధ్య తోపులాట జ‌రిగింది. ఆ స‌మ‌యంలో ఎంపీ భ‌ర‌త్ పోలీసుల‌ను నెట్టుకుంటూ అమ‌రావ‌తి రైతుల మీద‌కు దూసుకొచ్చారు. ఆయ‌న‌తో పాటు వైసీపీ క్యాడ‌ర్ దూసుకురావ‌డంతో ప‌రిస్థితి అదుపు త‌ప్పింది.

అమ‌రావ‌తి రైతులు యాత్ర ఉత్త‌రాంధ్ర‌కు వ‌ద్ద‌ని ఆ ప్రాంత వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు చెబుతున్నారు. ఒక‌వేళ యాత్ర వ‌స్తే, లా అండ్ ఆర్డ‌ర్ అదుపు త‌ప్పుతుంద‌ని చెబుతున్నారు. వైజాగ్ కేంద్రంగా వైసీపీ గ‌ర్జ‌న నిర్వ‌హించిన విష‌యం విదిత‌మే. ఆ సంద‌ర్భంగా ఉత్త‌రాంధ్ర జిల్లాల్లోని ప‌లు చోట్ల గ‌ర్జ‌న‌కు స‌మాంత‌రంగా ర్యాలీల‌ను వైసీపీ నిర్వ‌హించింది. అమ‌రావ‌తి ప‌రిర‌క్ష‌ణ క‌మిటీ త‌ర‌హాలోనే మూడు రాజ‌ధానుల జేఏసీ ఏర్ప‌డింది. ఇప్ప‌టికే వైసీపీ మంత్రులు మీడియా ముఖంగా అమ‌రావ‌తి రైతుల యాత్ర‌కు వార్నింగ్ ఇచ్చారు. తీవ్ర ప‌రిణామాల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించారు.

వైసీపీ ఎమ్మెల్యే మూడు రాజ‌ధానుల‌కు మ‌ద్ధ‌తుగా క‌ర‌ణం ధ‌ర్మ శ్రీ రాజీనామాకు సిద్ధ ప‌డ్డారు. ఆయ‌న‌తో పాటు ప‌లువురు ఎమ్మెల్యేలు రాజీనామాల‌కు సై అంటూ ముందుకొస్తున్నారు. ఉత్త‌రాంధ్ర టీడీపీ ఎమ్మెల్యేలు కూడా రాజీనామాల‌కు సిద్ధ‌ప‌డాల‌ని స‌వాల్ విసిరారు. ఎక్క‌డిక‌క్క‌డ అమ‌రావ‌తి నినాదాన్ని వ్య‌తిరేకించేలా ప్ర‌జ‌ల్ని స‌న్న‌ద్ధం చేస్తున్నారు. దీంతో పార్టీల వారీగా రాజ‌ధానుల అంశం పోరాట అస్త్రంగా మారింది. ఫ‌లితంగా రాజ‌మండ్రి కేంద్రంగా ఉద్రిక్త‌త నెల‌కొంది. రాబోవు రోజుల్లో ఉత్త‌రాంధ్ర‌లోకి అమ‌రావ‌తి రైతుల పాద‌యాత్ర కొన‌సాగ‌డం అసంభవంగా క‌నిపిస్తోంది.