Site icon HashtagU Telugu

Amaravati:అమరావతిలో కార్పోరేష‌న్‌ “పరేషాన్.”

Amaravati

Amaravati

అమరావతి రాజధాని ప్రాంతంలో ప్రస్తుతం కార్పొరేషన్ రగడ పెను దుమారం రేపుతోంది. రాజధాని నిమిత్తం ఏర్పాటు చేసిన 29 గ్రామాల్లో తుళ్లూరు మండలం నుంచి 16 గ్రామలతో పాటు మంగళగిరి మండలంలోని 3 గ్రామాల‌ను కలిపి మొత్తం 19 గ్రామాలను అమరావతి కాపిటల్ సిటీ మున్సిపల్ కార్పొరేషన్ (ఏసీసీఎంసి)గా గుర్తిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో అధికారులు ఆయా గ్రామాల్లో అభిప్రాయ సేకరణ కోసం గ్రామసభలు నిర్వహిస్తున్నారు.
గ్రామసభలో ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఆర్డీఏ లో ఉన్న గ్రామాలను విడదీసి ఎలా కార్పొరేషన్ చేస్తారంటూ నిల‌దీస్తున్నారు. గ‌త ప్ర‌భుత్వం గుర్తించిన త‌ర‌హాలోనే సీఆర్డీఏ లో ఉన్న 29 గ్రామాలను కలిపి కార్పొరేషన్ గా చేయాల‌ని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే అంగీకరించేది లేదని తెగేసి చెబుతున్నారు.
అమరావతి రాజధాని కోసం సీఆర్డీఏలో పొందుప‌రిచిన 29 గ్రామాలు తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల పరిధిలోనివి. అయితే తాడేపల్లి మండలంలోని రాజధాని పరిధిలో ఉన్న ఉండవల్లి, పెనుమాక గ్రామలతో పాటుగా మంగళగిరి మండలంలోని రాజధాని గ్రామాలైన బేతపూడి, నిడమర్రు, ఐనవోలు, ఎర్రబాలెం గ్రామాలతో పాటు ఇతర గ్రామాలను కలిపి 2021 మార్చి నెలలో  మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పోరేషన్ (ఎంటీఎంసి) ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కార్పొరేషన్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ హైకోర్టు లో 42 పిటిషన్లు విచారణ దశలో ఉన్నాయి. విచారణ పూర్తయ్యే వరకు ఎన్నికలు కూడా నిర్వహించకూడదని న్యాయస్థానం స్పష్టం చేసింది.

29 గ్రామాలు, 25 గ్రామ పంచాయితీలు..

అమరావతి రాజధానిలో భాగంగా సీఆర్డీఏలో ఉన్న 29 గ్రామాల్లో గ్రామ పంచాయితీలుగా ఉన్నవి 25 మాత్రమే. ఇలా పంచాయితీలుగా ఉన్నవాటిని మాత్రమే కార్పొరేషన్ గా మార్చేందుకు వీలుంటుంది. కాగా మిగిలిన 4 గ్రామాలు ఈ పంచాయితీల పరిధిలోని పాలనలో ఉండటంతో అమరావతి కార్పొరేషన్ లో విలీనానికి ఇబ్బందులేమీ ఉండవు. కానీ 29 గ్రామాలతో కలిపి ఉన్న 25 గ్రామ పంచాయతీలన్నీ కలిపి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని గ్రామసభలో ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

ఏఎంఆర్డీఏ ఏర్పాటుతో..

వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం 2020 జూన్ 31 న సీఆర్డీఏ ను రద్దు చేసి అమరావతి మెట్రో పాలిటన్ రీజిన్ డెవలప్మెంట్ ఆధారిటీ (ఏఎంఆర్డీఏ)ని ఏర్పాటు చేసింది. అనంతరం 2021 జనవరి 20 న మూడు రాజధానులు ఏర్పాటు చేస్తూ జగన్ ప్రభుత్వం ప్రకటన చేసింది. దీంతో అమరావతి గ్రామాల్లో ప్రభుత్వంపై నిరసన ప్రారంభమైంది. రాజధాని గ్రామాల్లో పూర్తిస్థాయిలో ఆందోళనలు పెరిగాయి. శాంతి భద్రతల సమస్యలు కూడా అదే స్థాయిలో ఉత్పన్నమయ్యాయి.

విభజించు పాలించు..

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విభజించు పాలించు అనే సూత్రాన్ని అన్నింటా అమలు చేస్తున్నారనే ఆరోపణలు బాహాటంగా వినిపిస్తున్నాయి. ఈ ప్రక్రియలో భాగంగానే రాజధాని గ్రామాలను రెండుగా విభజించి రెండు కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారని అమరావతి వాసుల అభిప్రాయం. అమరావతి రాజధానిలో తమ గ్రామాలను వద్దు అంటూ ఆనాడు ఏకగ్రీవ తీర్మానాలు చేసిన గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాల్లో సైతం కార్పొరేష‌న్ ను వ్యతిరేకిస్తూ ఏకగ్రీవ తీర్మానాలు చేశారు. ఆ మేర‌కు మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ (ఎంటీఎంసి) ఏర్పాటును వ్యతిరేకిస్తూ హైకోర్టులో 42 పిటిషన్లు విచారణ దశలో ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ గ్రామసభల పేరిట రగడ ఏంటని ప్ర‌శ్నిస్తున్నారు.

అధికారుల వాదన ఇలా..

సీఆర్డీఏ పరిధిలోని 29 గ్రామాలను కలిపి కార్పొరేషన్ గా ఏర్పాటు చేసే నిమిత్తం 2020 జనవరి 9 న పంచాయతీ రాజ్, గుంటూరు జిల్లా కలెక్టర్ సంయుక్తంగా నోటిఫికేషన్ ఇవ్వటం జ‌రిగింది. ఆ మేర‌కు గ్రామ సభలకు సమాయత్తం అవుతున్న త‌రుణంలో మూడు రాజధానులు అంశం తెరమీదకు వ‌చ్చింది. దీంతో 29 గ్రామాల్లో తీవ్రమైన గందరదోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఫ‌లితంగా అప్ప‌ట్లో గ్రామసభలు నిర్వహించలేక పోయామని అధికారులు చెబుతున్నారు. ఆ లోగా మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ ఏర్పాటు జరిగిపోయిందని, ఇప్పుడు దాని నుంచి విలీన గ్రామలైన ఆరు గ్రామాలను వెనక్కి తీసుకురావటం సాధ్యపడదని స్పష్టం చేస్తున్నారు. అందువల్లే 19 గ్రామ పంచాయతీలతో కూడిన 23 గ్రామాలను కార్పొరేషన్ గా ఏర్పాటు చేస్తున్నామని వివరిస్తున్నారు. 2021 నవంబర్ మాసంలో మూడు రాజధానుల అంశాన్ని ప్రభుత్వం విరమించుకున్నప్పటికి సంబంధిత పిటిషన్లు హైకోర్టులో విచారణలోనే ఉన్నందున కార్పొరేషన్ ప్రక్రియ ఏర్పాటు ఎలా సాధ్యమని రాజధాని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. దీనితో అమరావతి కార్పొరేషన్ అంశం వివాదాస్పదంగా మారింది.
ఎన్నికల కోసమా,, నిధుల కోసమా..
అమరావతి గ్రామాల్లో ఎన్నికలు నిర్వహించాలన్న న్యాయస్థానం ఆదేశాల ప్ర‌కారం సీఆర్డీఏలోని గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలి. అప్పుడు వ‌చ్చే ఫ‌లితాలు వైసీపీకి అనుకూలంగా ఉంటాయ‌న్న న‌మ్మ‌కం ఆ పార్టీలోని కొంద‌రికి లేదు. అందుకే కార్పొరేషన్ గా చేసి ఆధిపత్యాన్ని కనబరచాలన్న ఎత్తుగడ వైసీపీ వేసింద‌ని ప్ర‌త్య‌ర్థుల భావ‌న‌. మున్సిపల్ కార్పొరేషన్  మౌలిక వసతుల కల్పన పేరిట నిధులు సేకరిండానికి ఇలాంటి ఆదేశాలు ఇచ్చారనే అనుమానాలు లేక‌పోలేదు. మొత్తం మీద గంద‌ర‌గోళం న‌డుమ నిర్వ‌హిస్తున్న గ్రామ స‌భ‌ల ద్వారా ప్ర‌భుత్వం ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుందో వేచిచూడాల్సిందే.