Site icon HashtagU Telugu

Konaseema : అమ‌లాపురం విధ్వంసంలో రాజ‌కీయం

Konaseema

Konaseema

ఒక సంఘ‌ట‌న రాజ‌కీయ ప‌రిణామాల‌ను మార్చేస్తుంది. అందుకే, ఆయా పార్టీలు ఎత్తుకు పైఎత్తులు వేస్తుంటారు. కులం, మ‌తం, ప్రాంతం అంశాల‌ను బాగా వాడుకోవ‌డం స‌ర్వ‌సాధారణంగా మారింది. కోన‌సీమ జిల్లాకు అంబేద్క‌ర్ కోన‌సీమ జిల్లాగా నామ‌క‌ర‌ణం చేయాల‌ని వైసీపీ నిర్ణ‌యించింది. సాధార‌ణంగా అంబేద్క‌ర్ పేరు పెట్ట‌డాన్న ఎవ‌రూ అభ్యంత‌ర పెట్ట‌రు. పైగా టీడీపీ చీఫ్ చంద్ర‌బాబు కూడా అధికారంలోకి వ‌స్తే కోన‌సీమ జిల్లాకు అంబేద్క‌ర్ పేరు పెడ‌తాన‌ని హామీ ఇచ్చారు. అధికార‌, విప‌క్ష పార్టీల ఆమోదం ఉన్న ఈ అంశాన్ని ఎవ‌రు రాజ‌కీయంగా వాడుకోవాల‌ని చూస్తున్నారు? అనేది హాట్‌ టాపిక్.

అమ‌లాపురం కేంద్రంగా జ‌రిగిన విధ్వంసం రాష్ట్రంలోని లా అండ్ ఆర్డ‌ర్ ప‌రిస్థితిని ప్ర‌శ్నిస్తోంది. గ‌త కొన్ని రోజులుగా ప్లాన్ చేసుకుని చేసిన విధ్వంసంగా ప్ర‌భుత్వం భావిస్తోంది. అంతేకాదు, టీడీపీ, జ‌న‌సేన కు చెందిన కొంద‌రు ఉద్దేశ పూర్వ‌కంగా చేసిన దాడులుగా హోంమంత్రి తానేటి వ‌నిత చెబుతున్నారు. ఒక వేళ అదే నిజ‌మైతే, ముందుగానే వాళ్ల క‌ద‌లిక‌ల‌ను పోలీస్ తెలుసుకోలేక పోయిందా? నిఘా వ్య‌వ‌స్థ ఏమైంది? మంత్రి విశ్వ‌రూప్, ఎమ్మెల్యే ఇంటిని ధ్వంసం చేశారంటే ప్రీ ప్లాన్ గా జ‌రిగిన విధ్వంసంగా భావించాలి. దాన్ని ముందుగానే పోలీసు వ్య‌వ‌స్థ ప‌సిగ‌ట్ట‌లేక పోయింది. అంటే, దీన్ని ప్ర‌భుత్వం వైఫ‌ల్యం కింద ప‌రిగ‌ణించాల్సిందే.

గ‌త వారం రోజులుగా ఎమ్మెల్సీ అనంత ఉద‌య్ భాస్క‌ర్ చేసిన మ‌ర్డ‌ర్ ఏపీలో హాట్ టాపిక్ అయింది. డ్రైవ‌ర్ సుబ్ర‌మ‌ణ్యంను చంపేసిన‌ట్టు వైసీపీ ఎమ్మెల్సీ అంగీక‌రించ‌డంతో అరెస్ట్ చేశారు. కానీ, పోలీసు విచార‌ణ‌పై విప‌క్షాలు, ద‌ళిత సంఘాలు పెద్ద ఎత్తున ప్ర‌భుత్వంపై ఒత్తిడి తెచ్చాయి. దీంతో విధిలేని ప‌రిస్థితుల్లో వైసీపీ ఎమ్మెల్సీపై చ‌ర్య‌లు తీసుకున్నారు. ఆ హ‌త్య క్ర‌మంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి అప‌వాదు వ‌చ్చింది. దాన్ని అధిగ‌మించ‌డానికి అమ‌లాపురం విధ్వంసాన్ని వైసీపీ క్యాడ‌ర్ చేసింద‌ని విప‌క్షాల అనుమానం. ప‌బ్లిక్ మైండ్ ను వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉద‌య్ చేసిన మ‌ర్డ‌ర్ నుంచి మ‌ళ్లించే క్ర‌మంలో అమ‌లాపురం సంఘ‌ట‌న‌ను సృష్టించార‌ని విప‌క్షాల అనుమానం. వాస్త‌వంగా కోన‌సీమ జిల్లాకు అంబేద్క‌ర్ పేరు పెట్ట‌డం అనేది విధ్వంసం చేసేంత‌ సీరియ‌స్ ఇష్యూ కానేకాదు.

జిల్లాల సంఖ్య పెంపు క్ర‌మంలో కొన్ని నెల‌ల పాటు క‌స‌ర‌త్తు జ‌రిగింది. అభ్యంత‌రాల‌ను ప్ర‌భుత్వం ఆహ్వానించింది. వాటిని ప‌రిశీలించిన త‌రువాత కోన‌సీమ జిల్లాకు అంబేర్క‌ర్ కోన‌సీమ జిల్లాగా నామ‌క‌ర‌ణం చేయ‌డం జ‌రిగింది. ఆ నిర్ణ‌యాన్ని నిర‌సిస్తూ అమ‌లాపురంను త‌గుల‌బెట్టేలా చేసింది. అంటే, ఆ విధ్వంసం వెనుక ఖ‌చ్చితంగా ఆసాంఘిక శ‌క్తులు ఉంటాయ‌ని పోలీసులు అనుమానిస్తున్నారు. ఉత్త‌రాంధ్ర మీద ప‌ట్టు సాధించ‌డానికి రాజ‌కీయంగా టీడీపీ, జ‌న‌సేన ఆడుతోన్న గేమ్ గా వైసీపీ భావిస్తోంది. అమ‌లాపురం కేంద్రంగా జ‌రిగిన ఆ దారుణ విధ్వంసం వెనుక ఎవ‌రు ఉన్నారు అనేది తేల్చ‌డం పోలీసుల‌కు పెద్ద క‌ష్టం కాదు. పైగా నిర‌స‌న‌కారులు చేసిన రాళ్ల దాడిలో పోలీసులు గాయ‌ప‌డ్డారు. అమ‌లాపురం కేంద్రంగా వంద‌లాది మంది క‌ర్ర‌లు, రాడ్ల‌తో బ‌య‌ట‌కు వ‌చ్చారు. ఆ దృశ్యాల‌ను పోలీసులు ప‌రిశీలిస్తున్నారు. వాళ్లంతా జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. కానీ, ఆ పార్టీ చీఫ్ ప‌వ‌న్ క‌ల్యాణ్ మాత్రం ఖండిస్తున్నారు. మొత్తం మీద రాజ‌కీయాన్ని సంత‌రించుకున్న అమ‌లాపురం విధ్వంసం వెనుక నిజా నిజాలు బ‌య‌ట‌కు రావ‌ల్సి ఉంది.