Site icon HashtagU Telugu

Amaravati : అమ‌రావ‌తిపై `మోసం` గురూ!

Amaravati

Amaravati

`అదో క‌మ్మ‌రావ‌తి..చంద్ర‌బాబు మ‌నుషుల ఇన్ సైడ‌ర్ ట్రేడింగ్..రాజ‌ధానిలో ఎలాంటి నిర్మాణాలు జ‌ర‌గ‌లేదు..భ్ర‌మ‌రావ‌తి గ్రాఫిక్స్ …అదో ఎడారి, స్మ‌శానం..` ఇలా ఎన్నో ఆరోప‌ణ‌లు చేశారు సీఎం జ‌గ‌న్‌, వైసీపీ కీల‌క మంత్రులు..` ఇప్పుడు అక్క‌డి నిర్మాణాల‌ను లీజుకు ఇవ్వ‌డానికి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌ర్కార్ సిద్ధం అయింది. అక్క‌డి భూముల‌ను వేలం వేయ‌డానికి పూనుకుంది. ఎక‌రం రూ. 10కోట్ల క‌నీస ధ‌ర‌తో వేలం వేయ‌డానికి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం నిర్ణ‌యించుకుంది.

ఏపీ సీఎంగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌రువాత ప్ర‌జా వేదిక‌ను కూల్చేశారు. ఆ త‌రువాత మూడు రాజ‌ధానుల అంశాన్ని తెర‌పైకి తీసుకొచ్చారు. కేవ‌లం క‌మ్మ కులానికి సంబంధించిన రాజ‌ధానిగా సీఎం హోదాలో జ‌గ‌న్ ఆరోప‌ణ చేశారు. సీఐడీ విచార‌ణకు ఆదేశించారు. కొండ‌ను త‌వ్వి ఎలుక‌ను ప‌ట్టిన విధంగా వంద‌లాది మందిని విచారించిన సీఐడీ ఇన్ సైడ‌ర్ ట్రేడింగ్ ను నిరూపించ‌లేక‌పోయింది. అంతేకాదు, ఇన్ సైడ‌ర్ ట్రేడింగ్ ప‌దాన్నే సుప్రీం త‌ప్పుబ‌ట్టింది. మొత్తం వ్య‌వ‌హారాన్ని హైకోర్టులో తేల్చుకోవాని ఆర్డ‌ర్ చేసింది. భూములు ఇచ్చిన రైతుల‌కు మూడు నెల‌ల్లో ప్లాట్లు ఇవ్వాల‌ని, సీఆర్డీయే ఒప్పందం ప్ర‌కారం నిర్మాణాలు చేప‌ట్టాల‌ని అంతిమ తీర్పు చెప్పింది. అమ‌రావ‌తిలోనే రాజ‌ధాని ఉండాల‌ని కూడా ఆదేశించింది.

హైకోర్టు ఇచ్చిన అంతిమ తీర్పును భేఖాత‌రు చేస్తూ రాజ‌ధాని ప్రాంతంలోని భూముల‌ను అమ్ముకోవ‌డానికి జ‌గ‌న్ స‌ర్కార్ సిద్ధం అయింది. న్యాయ‌స్థానం ఇచ్చిన తీర్పును అనుకూలంగా జ‌గ‌న్ స‌ర్కార్ మ‌లుచుకుంది. భూముల‌ను రిజిస్ట్రేష‌న్ చేయాల‌ని తీర్పులో ఉన్న అంశాన్ని ఆస‌ర‌గా తీసుకుని వాళ్ల చేత ఇటీవ‌ల రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ‌ను ప్ర‌భుత్వం పూర్తి చేసింది. దీంతో ఇక ఆ భూములపై సంపూర్ణ హ‌క్కు ప్ర‌భుత్వానికి ద‌క్కేలా ప‌క్కా. స్కెచ్ వేశారు. అందులో భాగంగానే భూముల‌ను ఇప్పుడు అమ్మ‌కానికి పెట్టారు. ఆన్ రికార్డ్ ప్ర‌స్తుతం రైతులు ప్ర‌శ్నించ‌డానికి లేకుండా చేశామ‌ని ప్ర‌భుత్వం భావిస్తోంది. కానీ, హైకోర్టు తీర్పు ప్ర‌కారం చేయాల్సినవి ఏమీ చేయ‌కుండా భూముల‌ను అమ్మ‌కానికి పెట్ట‌డంపై మ‌రోసారి రైతులు కోర్టు మెట్టులు తొక్కే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

భూములు ఇచ్చిన రైతుల డిమాండ్ల‌ను మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ లాంటి వాళ్లు కూడా వ్య‌తిరేకించారు.
అమరావతి ఎవరి కోసం అంట అంటూ పుస్త‌కాన్ని కూడా ఒక కీల‌క లీడ‌ర్ రాశారు. రాజ‌ధాని రోడ్ల‌ను కూడా త‌వ్వేశారు. అక్క‌డ రాజ‌ధాని ఉంటే మునిగిపోతుంద‌ని పుస్త‌కాల‌ను రాసిన మేధావులు ఉన్నారు. ల‌క్ష కోట్ల‌తో నిర్మాణాల‌ను చేప‌ట్ట‌లేని ఆర్థిక సంక్లిష్ట‌త ఉంద‌ని సాక్షాత్తు సీఎం జ‌గ‌న్ అన్నారు. అందుకే, ఒకే రాజ‌ధాని కాదు, మూడు రాజ‌ధానులు నిర్మిస్తాన‌ని రెండున్న‌రేళ్లుగా రైతుల‌తో ఆటాడుకున్నారు. ఇప్పుడే అదే రాజ‌ధాన్ని తాక‌ట్టు పెట్టుకుని 2,500కోట్లు రాబ‌ట్టాల‌ని జ‌గ‌న్ చూస్తున్నారు. ప్ర‌స్తుతం ఉన్న భ‌వ‌నాల‌ను ప్రైవేటు సంస్థ‌ల‌కు లీజుకు ఇవ్వ‌డానికి సిద్ధం అయ్యారు. నా రాజ్యం నా ఇష్టం అన్న‌ట్టు ఉంది జ‌గ‌న్ వాల‌కం. ఇలాంటి ప‌రిస్థితుల్లో న్యాయ‌స్థానం ఎలా స్పందిస్తుందో..చూద్దాం!