ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు రంజుగా సాగుతున్నాయి. 2024 ఎన్నికలే లక్ష్యంగా అన్ని పార్టీలు పావులు కదుపుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే తెలుగుదేశంపార్టీ అధినేత చంద్రబాబు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని కీలకనేతలతో సమావేశాలు ఏర్పాటు చేస్తూ కార్యాచరణ చేస్తున్నారు. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో టీడీపీకి 160 సీట్లు గ్యారెంటీ అంటూ తెలుగు తమ్ముళ్ళు ఇప్పటి నుంచే జోరుగా ప్రచారం మొదలు పెట్టారు. ఇక జగసేన విషయానికి వస్తే.. ఒకవైపు బీజేపీతో బంధాన్ని కొనసాగిస్తూనే, టీడీపీతో పెట్టుకున్న చీకటి బంధం గురించి, తాజాగా జరిగిన ఆ పార్టీ ఆవిర్భావసభంలో భాగంగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలతో బట్టబయలు అయ్యింది. విడి విడిగా పోటీ చేసి వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వమని, మళ్ళీ రాష్ట్రంలో వైసీపీని అధికారంలోకి రానివ్వమని పవన్ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే అధికార వైసీపీని ఏ రేంజ్‌లో టార్గెట్ చేశారో అనేది క్లియర్ కట్‌గా అర్ధమవుతోంది.
ఒకవైపు జగన్‌ను టార్గెట్ చేస్తూనే మరోవైపు పొత్తుల పై క్లియర్‌గా తన స్టాండ్ ఏంటో తేల్చి చెప్పారు పవన్. ఓటును చీల్చనివ్వబోం అని, వైసీపీ వ్యతిరేక శక్తులతో కలిసి పని చేసేందుకు సిద్ధం, బీజేపీ రోడ్డు మ్యాప్ కోసం ఎదురు చూస్తున్నామని, రాజకీయప్ర యోజనాలు పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసం ముందుకు వస్తే, పొత్తుల గురించి ఆలోచిస్తానని పవన్ కళ్యాణ్ తాజాగా జనసేన ఆవిర్భవ సభలో వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ పిలుపుకు కలిసి వచ్చేది ఎవరు, ఆయనతో అడుగులు వేసేది ఎవరనేది ఇప్పుడు రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. 2014 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ పొత్తు పెట్టుకోగా, ఆ కూటమికి జనసేన మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల్లో టీడీపీ కూటమి విజయం సాధించగా, వైసీపీ ప్రతిపక్ష స్థానానికి పరిమితం అయ్యింది. ఇక ఆ తర్వాత ప్రత్యేక హోదా, విభజన హామీల విషయంలో బీజేపీ, టీడీపీలకు చెడింది. బీజేపీతో విడాకులు తీసుకున్న తర్వాత చంద్రబాబు కాంగ్రెస్‌తో చేతులు కలిపారు. అయితే ఏపీలో కాంగ్రెస్ పూర్తిగా శవాసనం వేయడంతో టీడీపీకి ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది.
మరోవైపు బీజేపీ నుంచి పక్కకు జరిగిన పవన్ కళ్యాణ్.. బీఎస్పీ కమ్యూనిస్టులతో చేతులు కలిపి ఎన్నికల బరిలోకి దిగారు. అయితే పవన్ మరోవైపు చంద్రబాబుతో రహస్య బంధం కొనసాగిస్తూనే ఉన్నారనేది రాజకీయాలు పై మినిమం అవగాహాన ఉన్న ఎవరైనా చెబుతారు. బహిరంగంగా పొత్తు పెట్టుకోకపోవడంతో గత ఎన్నికల్లో టీడీపీ ఒంటరిగానే పోటీ చేయాల్సివచ్చింది. 2019 ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం సృష్టించడంతో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు డకౌట్ అయ్యాయి. ప్రచారాల్లో రెచ్చిపోయిన జనసేన ఎన్నికల ఫలితాలరోజు తుస్సుమనిపించింది. కేవలం ఒకే ఒక్క స్థానంలో విజయం సాధించింది జనసేన. ఇక పోటీ చేసిన రెండు చోట్ల చిత్తు చిత్తుగా ఓడిపోయారు పవన్ కళ్యాణ్. అయితే గత ఎన్నికల తర్వాతో అధికార వైసీపీ రోజు రోజుకూ బటపడుతుంటే, ప్రతిపక్షాలు మాత్రం దిగజారుతూ వస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో అధికార పార్టీపై కాస్త వ్యతిరేకత ఉన్నా ప్రతిపక్షాలు పూర్తిగా బలహీనపడడంతో వైసీపీకి పెద్దగా టెన్షన్ లేకుండా పోయింది.
ఇక ఇప్పుడు పవన్ చేసిన వ్యాఖ్యలు గమనిస్తే టీడీపీతో చేతులు సిద్ధంగా ఉన్నారనేది స్పష్టమవుతోంది. కానీ టీడీపీకి ఇక తలుపులు తీసి ఉండవని గతంలో బీజేపీ తేల్చి చెప్పింది. మరి పవన్ తాజాగా చేసిన వ్యాఖ్యలతో బీజేపీ- జనసేన కూటమిలో టీడీపీని చేర్చుకుంటారా అని రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తోంది. గత ఎన్నికల్లో మోదీ అండ్ కాషాయ దళం పై తీవ్రస్థాయిలో విమర్శలు చేసి, రాహుల్ గాంధీతో చేతులు కలిపిన చంద్రబాబును బీజేపీ నమ్ముతుందా అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. అయితే జనసేనతో పొత్తు పెట్టుకోవడానికి టీడీపీకి మాత్రం ఎలాంటి అభ్యంతరాలు లేవనే చెప్పొచ్చు. ఏపీలో ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు మాట్లాడుతూ.. వన్ సైడ్ లవ్ ఉంటే సరిపోదు రెండు వైపుల నుంచి ఉండాలని వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఏకంగా పవనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో జనసేన-టీడీపీల మధ్య పొత్తుకు పెద్దగా ఇబ్బందులు రాకపోవచ్చని విశ్లేషకులు అంటున్నారు. కానీ సమస్యంతా బీజేపీతోనే.. టీడీపీతో పొత్తు అంటే కమలం పెద్దలు పవన్‌తో అంగీకరిస్తారా లేక పక్కన పెడతారా అనేది ఇప్పుడు రాజకీయవర్గాల్లో ఆశక్తిగా మారింది.
2019 ఎన్నికలను కామ్రేడ్లతో కలిసి జనసేన ఎన్నికల బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. అయితే 2024 ఎన్నికల్లో మాత్రం ఆ పరిస్థితి ఉండదు. ఎందుకంటే.. ప్రస్తుతం బీజేపీతో పవన్ కాపురం చేస్తున్నారు. వీరి ప్రయాణం వచ్చే ఎన్నికల వరకు కంటిన్యూ అవడం ఖాయమనే చెప్పాలి. మరోవైపు కమలనాథులకు, కమ్యూనిస్టులకు పడదు. దీంతో బీజేపీతో కలిసి ఉండే పార్టీతో కమ్యూనిస్టులు కలిసి నడవలేదు. దీంతో వచ్చే ఎన్నికల్లో కామ్రెడ్లు ఒంటిరిగానే పోటీ చేస్తారా లేక కాంగ్రెస్‌తో కలిసిపోటీ చేస్తారా అనేది చూడాలి.
ఇక అధికార వైసీపీ పార్టీ విషయానికి వస్తే.. సింహం సింగిల్‌గానే వస్తుందంటూ ఆ పార్టీ నేతలు ఇప్పటికే తేల్చిచెప్పారు. గత ఎన్నికల టైమ్‌లోనే అందరూ కలిసివచ్చినా, వైసీపీ మాత్రం ఒంటరిగానే పోటీ చేస్తుందని జగన్ మోహన్ రెడ్డి వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మరోసారి 2024 ఎన్నికల్లో కూడా వైసీపీ ఎవరితోనూ పొత్తు పెట్టుకోకుండా బరిలోకి దిగనుంది. ఈ క్రమంలో ఒక్క అధికార పార్టీ తప్పా ఎవరు ఎవరితో పొత్తు పెట్టుకుంటారో అనేది కీలకంగా మారింది. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ ఏపీలో పొత్తుల రాజకీయానికి తెరలేపారని రాజకీయవర్గాల్లో చర్చించుకుంటున్నారు. ఈ నేపధ్యంలో 2024 ఎన్నికల్లో అధికార వైసీపీ టార్గెట్‌గా పావలు కదుపుతున్న పవన్ కళ్యాణ్ ఆశలు ఫలిస్తాయా లేక ఎప్పుడు ఎన్నికలు వచ్చినా 160 సీట్లు మావే అంటూ ఇప్పటి నుంచే డప్పు కొడుతున్న సైకిల్ ఫామ్‌లోకి వస్తుందా, లేక రాష్ట్రంలో మరోసారి సోలోగా బరిలోకి దిగుతున్న ఫ్యాన్ పార్టీ రెండోసారి పవర్‌ను నిలుపుకుంటుందా అనేది చూడాలి. 2024 ఎన్నికలు జగన్‌ను ఎదుర్కోవడానికి అన్ని పార్టీలు ఏకమవుతాయనేది మాత్రం ఖాయంగా కనిపిస్తుంది. మరి వచ్చే ఎన్నికల్లో ఎవరి పాచికలు పారుతాయో అనేది చూడాలి.