Site icon HashtagU Telugu

Alla Nani : టీడీపీలో చేరనున్న ఆళ్ల నాని..!

Alla Nani to join TDP..!

Alla Nani to join TDP..!

Alla Nani: మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని టీడీపీలో చేరనున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు ఆయన ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో పార్టీ కండువా కప్పుకుంటారని సమాచారం. ఇప్పటికే ఆళ్ల నాని వైఎస్‌ఆర్‌ సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తొలుత ఆయన జనసేనలోకి వెళ్తారని వార్తలు వచ్చినా, చివరకు టీడీపీ గూటికే చేరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా, నాని గతంలో మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఓసారి డిప్యూటీ సీఎంగా పనిచేశారు.

ఇకపోతే.. ఆళ్ల నాని టీడీపీలో చేరికను ఏలూరు నేతలు వ్యతిరేకిస్తున్నారు. పార్టీలో చేరేముందు టీడీడీ కార్యకర్తలకు ఆళ్ల నాని క్షమాపణ చెప్పాలనే డిమాండ్ చేస్తున్నారు. ఆయన క్షమాపణ చెప్పాలంటూ వరుస గ్రూపుల్లో వీడియోలు హల్ చల్ చేస్తున్నాయి. తన 32 ఏళ్ల రాజకీయ జీవితం మొత్తం టీడీపీ కార్యకర్తలను అణగదొక్కిన వ్యక్తి ఆళ్లనాని అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ జీవితాన్ని ఇచ్చిన వైఎస్‌ఆర్‌ కుటుంబానికే వెన్నుపోటు పొడిచిన వ్యక్తి ఆళ్ల నాని అంటూ టీడీపీ కార్యకర్తలు గుర్తుచేస్తున్నారు. మరోవైపు ఈ కార్యక్రమానికి రావాలంటూ ఏలూరు జిల్లా నేతలకు టీడీపీ అధిష్ఠానం నుంచి పిలుపు వచ్చింది. ప్రస్తుతం ఏలూరు ఎమ్మెల్యేగా ఉన్న బడేటి చంటి నాని రాకపై అభ్యంతరం వ్యక్తం చేయలేదని తెలుస్తోంది.

కాగా, ఆళ్ల నాని 2024 ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఓటమి తర్వాత నాని జిల్లా అధ్యక్ష పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. ఆళ్ల నానికి వైసీపీలోని కీలక నేతలతో మంచి సంబంధాలు ఉండేవి. అందుకే తొలి దశలో ఆయన్ను ఉప ముఖ్యమంత్రి పదవి వరించింది. ఆ తర్వాత వైసీపీ జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. జిల్లాలో ఎందరో కీలక నేతలు ఉన్నా.. నాని మాటకే జగన్ ప్రాధాన్యత ఇచ్చేవారని అక్కడి ప్రజాప్రతిధులు చెబుతారు. అటు వైసీపీలో మరో కీలక నేత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి కూడా నాని అత్యంత సన్నిహితుడిగా పేరుంది.