వైసీపీ కీలక నేత , మాజీ ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని (Alla Nani) రేపు (బుధువారం) తెలుగుదేశం పార్టీ (టీడీపీ)లో చేరనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు అధికారికంగా ఆయన టీడీపీలో చేరుతున్నట్టు ఎమ్మెల్యే బడేటి చంటి వెల్లడించారు. ఈయన చేరికతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తింది. గత కొద్దీ నెలల నుండి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) నుంచి సీనియర్ నేతలు టీడీపీ (TDP) వైపు మొగ్గు చూపుతుండటం తెలిసిందే. ఇప్పటికే కీలక నేతలు టీడీపీ లో చేరి జగన్ (Jagan) కు షాక్ ఇచ్చారు. ఇప్పుడు ఉన్న కొద్దీ మంది కూడా సైకిల్ ఎక్కుతుండడంతో త్వరలో వైసీపీ ఖాళీ కావడం ఖాయంగా కనిపిస్తుంది.
ఇక ఆళ్ల నాని చేరికపై టీడీపీ శ్రేణుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ విషయాన్ని పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లినట్టు బడేటి చంటి పేర్కొన్నారు. అయినప్పటికీ హైకమాండ్ ఈ అంశంపై కీలక నిర్ణయం తీసుకున్నదని, అధిష్ఠానం నిర్ణయాన్ని తాము గౌరవిస్తున్నామని , నాని చేరిక వల్ల ఏమాత్రం ప్రతికూల ప్రభావం పడదని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. గత రెండు నెలల క్రితం ఆళ్ల నాని వైసీపీకి, తన పార్టీ పదవులకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. టీడీపీ ఆయనకు ఎలాంటి హామీ ఇవ్వలేదని సమాచారం. స్వచ్ఛందంగానే ఆళ్ల నాని టీడీపీలో చేరుతున్నారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఒకప్పుడు వైసీపీ ముఖ్యనేతగా, మంత్రిగా ఆళ్ల నాని కీలక పాత్ర పోషించారు. అయితే జగన్ హయాంలో జరిగిన కొన్ని పరిణామాలు, జిల్లా రాజకీయాల్లో నెలకొన్న వివాదాలు ఆయన్ను టీడీపీ వైపు తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం వైసీపీ లో ఉన్న మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, కీలక నేతలు కూడా టీడీపీ వైపు చూస్తున్నారన్న వ్యాఖ్యలు బడేటి చంటి చేశారు.
ఆళ్ల నాని..2004 – 2013 మధ్య కాంగ్రెస్ సభ్యునిగా ఏలూరు నియోజకవర్గం నుండి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో శాసనసభ్యుడు అయ్యాడు. కాంగ్రెస్‌కు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి 2013లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్‌ఆర్‌సీపీ)లో చేరారు. 2014 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. 2017లో ఎమ్మెల్సీ అయ్యి , మళ్లీ ఏలూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి , 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా తిరిగి ఎన్నికై జగన్ మంత్రివర్గంలో ఉపముఖ్యమంత్రి మరియు ఆరోగ్య కుటుంబ సంక్షేమ, వైద్య విద్య మంత్రి అయ్యారు. 9 ఆగష్టు 2024 న వైసీపీ కి రాజీనామా చేసాడు. ఇక ఇప్పుడు టీడీపీ లో చేరబోతున్నాడు.
Read Also : Sonakshi Warns Mukesh Khanna: నటుడికి బహిరంగంగా వార్నింగ్ ఇచ్చిన హీరోయిన్