Site icon HashtagU Telugu

Srisailam : శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్..ఆ హోటల్ వెబ్‌సైట్‌ ఫేక్?

Haritha Hotel Srisailam

Haritha Hotel Srisailam

సైబర్ నేరగాళ్లు శ్రీశైలం హరిత హోటల్ పేరుతో నకిలీ వెబ్‌సైట్‌ను సృష్టించారు. ఈ నకిలీ వెబ్‌సైట్‌ను నమ్మి బెంగళూరుకు చెందిన ఓ పర్యాటకుడు రూ. 15,950 మోసపోయాడు. సైబర్ మోసగాళ్లు ఇచ్చిన ఫేక్ రశీదుతో హోటల్‌కు వెళ్లగా.. సిబ్బంది అది నకిలీది అని చెప్పారు. దీంతో కంగుతున్న పర్యాటకుడు హోటల్ మేనేజర్‌ను కలిశాడు. అయితే ఈ ఫేక్‌ వెబ్‌సైట్‌పై శ్రీశైలం పోలీసులకు ఫిబ్రవరిలోనే ఫిర్యాదు చేసినట్లు మేనేజర్ చెప్పారు. భక్తులు, పర్యాటకులు.. అధికారిక వెబ్‌సైట్‌లోనే హోటల్ బుకింగ్ చేసుకోవాలని.. అనుమానాస్పద లింక్‌లను క్లిక్ చేయవద్దని అధికారులు సూచిస్తున్నారు.

సైబర్ నేరగాళ్లు యూజర్లను మోసం చేసి.. వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించడానికి ఎప్పటికప్పుడు సరికొత్త మార్గాలను అన్వేషిస్తూనే ఉన్నారు. అందులోనూ ఈ మధ్య కాలంలో ఫిషింగ్ దాడులు పెరిగిపోతున్నాయి. ఈ ఫిషింగ్ దాడుల్లో సైబర్ నేరగాళ్లు.. ఏదైనా ప్రముఖ వెబ్‌సైట్ యానిఫామ్ రిసోర్స్ లొకేటర్ (URL) లేదా డొమైన్లను పోలి ఉండే నకిలీ వెబ్‌సైట్లను తయారు చేస్తారు. దీని ద్వారా వినియోగదారులను మోసం చేస్తారు. తాజాగా ఇలాంటి ఘటనే ఆంధ్రప్రదేశ్‌లో జరిగింది. శ్రీశైలం హరిత హోటల్ పేరుతో ఉన్న నకిలీ వెబ్‌సైట్‌ను నమ్మి ఓ భక్తుడు నిండా మోసపోయాడు. దాదాపు ఏడాదికాలంగా కొనసాగుతున్న ఈ సైబర్ మోసం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు..

హరిత రిసార్ట్స్ పేరుతో ఏపీ టూరిజం శాఖ హోటళ్లను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ హోటళ్లలో ఆన్‌లైన్ బుకింగ్ చేసుకోవడానికి ఓ వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేశారు. అయితే అచ్చం ఈ వెబ్‌సైట్‌ను పోలిన మరో వెబ్‌సైట్‌ను సైబర్ కేటుగాళ్లు తయారు చేశారు. బెంగళూరుకు చెందిన ఓ పర్యాటకుడు.. ఆన్‌లైన్‌లో శ్రీశైలంలో హరిత హోటల్ పేరుతో ఉన్న వెబ్‌సైట్‌ను ఒరిజినల్ అని నమ్మాడు. ఆ నకిలీ వెబ్‌సైట్‌ నిర్వాహకుడిని ఫోన్‌లో సంప్రదించి.. రూమ్, దర్శనం కోసం రూ. 15,950 ఆన్‌లైన్‌లో చెల్లించాడు. అనంతరం బుకింగ్‌ రశీదు తీసుకుని.. ఆదివారం శ్రీశైలంలోని హరిత హోటల్‌కు వెళ్లాడు.

హోటల్ నిర్వాహకులకు ఆ రశీదు చూపించగా.. అది నకిలీదని టూరిజం సిబ్బంది చెప్పారు. దీంతో ఆ పర్యాటకుడు షాక్‌కు గురయ్యాడు. అనంతరం ఆ హరిత రిసార్ట్‌ మేనేజర్‌ పవన్‌ను వివరణ కోరగా అది నకిలీ వెబ్‌సైట్‌ అని తెలిపారు. ఈ సైబర్ మోసం గురించి ఫిబ్రవరిలో శ్రీశైలం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఈ నకిలీ వెబ్‌సైట్ల పట్ల భక్తులు, పర్యాటకులు జాగ్రత్తగా ఉండాలని.. ఇలాంటి వాటిని సంప్రదించకూడదు అని చెప్పారు. కేవలం అధికారిక వెబ్‌సైట్‌లోనే వసతి గదులు బుక్‌ చేసుకోవాలని చెప్పారు.

కాగా, ఈ ఫిషింగ్ దాడులతో డబ్బుతో పాటు వ్యక్తిగత సమాచారాన్ని సైబర్ కేటుగాళ్లు దొంగిలిస్తున్నారు. ప్రధానంగా ఈ నకిలీ వెబ్‌సైట్ల లింక్‌ను.. వీరు లక్ష్యంగా చేసుకున్న వ్యక్తులకు ఈ-మెయిల్, టెక్స్ట్ మెసేజ్ ద్వారా పంపిస్తారు. ఈ లింకుల్లో వినియోగదారుల పాస్ వర్డ్‌లు, పేమెంట్ వివరాలు, ఇతర వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించడానికి ఉద్దేశించిన ఫామ్‌లు ఉంటాయి. అందుకే హోటల్ బుకింగ్, ఇన్సూరెన్స్, లాటరీ, అమెజాన్ ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లంటూ.. మెసేజ్‌లు, ఈ మెయిళ్ల ద్వారా వచ్చే లింక్‌లను క్లిక్ చేయకూడదు. ఇలాంటి సైబర్ నేరాలను 1930 హెల్ప్‌లైన్‌ నంబర్‌కు కాల్ చేసి రిపోర్ట్ చేయాలి.

Exit mobile version