ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఈ రోజు (June26) రాజమహేంద్రవరం(rajamahendravaram) పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తున్నారు. ముఖ్యంగా ఆయన ‘అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు’ (Akhanda Godavari Project)కి శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం హైదరాబాద్ నుండి ప్రత్యేక విమానం ద్వారా రాజమహేంద్రవరం చేరుకుంటారు. గోదావరి తీర ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో రూపొందించిన ఈ ప్రాజెక్టులో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కూడా పాల్గొనడం విశేషం. ఆయన పవన్‌తో కలిసి పుష్కరఘాట్, సైన్స్ మ్యూజియం, ఫారెస్ట్ అకాడమీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు ముఖ్య లక్ష్యం
ఈ పర్యాటక ప్రాజెక్టు తూర్పు గోదావరి, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లోని గోదావరి నది తీర ప్రాంతాన్ని ఆధునీకరించి, అంతర్జాతీయ పర్యాటక గమ్యస్థలంగా మారుస్తుంది. దీని కోసం ప్రభుత్వం రూ.94.44 కోట్ల నిధులతో ప్రాజెక్టును చేపట్టింది. ముఖ్యంగా 2027లో జరిగే గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాజెక్టును ప్రణాళికాబద్ధంగా రూపొందించారు. గోదావరి నది పరివాహక ప్రాంతాల్లోని సాంస్కృతిక, ఆధ్యాత్మిక ప్రదేశాలు, ప్రకృతి వైభవాన్ని ప్రజలకు పరిచయం చేస్తూ పర్యాటక ఆకర్షణగా మలచనున్నారు.
ప్రాజెక్టు ద్వారా వచ్చే ప్రయోజనాలు
ఈ ప్రాజెక్టు అమలుతో పర్యాటక రంగం వేగంగా అభివృద్ధి చెందుతుంది. దీంతో స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. హోటల్ రంగం, రవాణా, చేనేత, హస్తకళలు వంటి రంగాలకు పెద్ద పుష్కలంగా మారుతుంది. కాకినాడ బీచ్, కొల్లేరు సరస్సు, దేవాలయాలు, శక్తిపీఠాలను ప్రోత్సహించి పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేస్తారు. ఇది విదేశీ పర్యాటకులను ఆకర్షించి, రాష్ట్రానికి ఆదాయాన్ని పెంచుతుంది. ప్రజలకు కొత్త అవకాశాలు, జీవనోపాధులు లభిస్తాయి. ‘అఖండ గోదావరి’ పేరుతో ఈ ప్రాజెక్టు రాష్ట్ర భవిష్యత్తుకు కీలక మైలురాయిగా నిలవనుంది.