ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2025-26 బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి (Agriculture Budget) భారీగా రూ.48,341.14 కోట్లు కేటాయించింది. వ్యవసాయం దేశం, రాష్ట్ర అభివృద్ధికి ప్రధాన ఆధారమని మంత్రి అచ్చెన్నాయుడు (Agriculture Minister Kinjarapu Atchannaidu) పేర్కొన్నారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా వ్యవసాయ బడ్జెట్‌ను రూపొందించినట్లు తెలిపారు. వికసిత్ భారత్ 2047కు అనుగుణంగా, వ్యవసాయ రంగాన్ని ప్రగతిపథంలో నడిపిస్తామని, భూసార పరీక్షలు, ఎరువుల సరఫరా, మద్దతు ధర వంటి అంశాల్లో సమగ్ర ప్రణాళికలు అమలు చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు.
రైతులకు భూసార పరీక్షలు, ఎరువుల సరఫరా
2024-25 సంవత్సరంలో రూ.13.09 కోట్లతో 4.30 లక్షల భూసార పరీక్ష పత్రాలను రైతులకు అందించినట్లు మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. ఈ చర్యల వల్ల రైతులు తమ భూముల పౌష్టిక స్థితిని తెలుసుకుని, తగిన విధంగా పంటలను సాగు చేయగలుగుతారు. 2025-26లో 6 లక్షల భూసార పరీక్ష పత్రాలు అందించేందుకు లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. అలాగే రైతుల కోసం 41.38 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువుల సరఫరా కోసం ముందస్తు ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. రైతుల భరోసా పెంచే విధంగా ఈ కార్యక్రమాలు రైతాంగానికి మేలు చేయనున్నాయని ప్రభుత్వం పేర్కొంది.
వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు
2025-26 బడ్జెట్‌లో వ్యవసాయ రంగ వృద్ధి రేటు 22.86 శాతంగా నమోదైందని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వం భూసార పరీక్షలను విస్మరించినప్పటికీ, ప్రస్తుత ప్రభుత్వం ఈ అంశాన్ని ప్రాధాన్యతనిస్తూ, వ్యవసాయ అభివృద్ధికి ముందస్తు చర్యలు తీసుకుంటుందని తెలిపారు. రైతుల ఆదాయాన్ని పెంచడానికి ప్రభుత్వ సహకారంతో అనేక కొత్త పథకాలను అమలు చేయనున్నట్లు తెలిపారు. వ్యవసాయ రంగాన్ని సమర్థవంతంగా అభివృద్ధి చేస్తూ, ఆర్థికంగా నిలబెట్టే లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి స్పష్టం చేశారు.
వ్యవసాయ బడ్జెట్ కేటాయింపులు చూస్తే..
- వ్యవసాయ శాఖకు రూ.12,401.58 కోట్లు
- ఉద్యాన శాఖకు రూ.930.88 కోట్లు
- పట్టుపరిశ్రమకు రూ.96.22 కోట్లు
- సహకార శాఖకు రూ.239.85 కోట్లు
- పశుసంవర్ధక శాఖకు రూ.1,112.07 కోట్లు
- మత్స్య రంగానికి రూ.540.19 కోట్లు
- విత్తన రాయితీ పంపిణీకి రూ.240 కోట్లు
- ఎరువుల బఫర్ స్టాక్ నిర్వహణకు రూ.40 కోట్లు
- ప్రకృతి వ్యవసాయానికి రూ.61.78 కోట్లు
- వ్యవసాయ యాంత్రీకరణకు రూ.219.65 కోట్లు
- రైతులకు వడ్డీలేని రుణాల కింద రూ.250 కోట్లు
- అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకం అమలుకు రూ.9,400 కోట్లు
- ఉచిత పంటల బీమా కోసం రూ.1,023 కోట్లు
- ఎన్జీ రంగా వర్సిటీకి రూ.507.01 కోట్లు
- ఉపాధి హామీకి రూ.6,026.87 కోట్లు
- ఎన్టీఆర్ జలసిరికి రూ.50 కోట్లు
- నీటివనరుల శాఖకు రూ.12,903.41 కోట్లు
- వైఎస్సార్ వర్సిటీకి రూ.98.21 కోట్లు
- ఎస్వీ వెటర్నరీ వర్సిటీకి రూ.154.57 కోట్లు
- ఏపీ ఫిషరీస్ వర్సిటీకి రూ.38 కోట్లు
- ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకానికి రూ.12,773.25 కోట్లు
AP News : లక్ష మంది పేద మహిళలకు మిషన్లు పంపిణీ.. ఏపీ ప్రభుత్వం నిర్ణయం..