AP Govt vs Tollywood:ఏపీలో మళ్లీ ప్రభుత్వం Vs తెలుగు సినీ పరిశ్రమ

టాలీవుడ్ పెద్దలంతా కలిసి ఏపీ సీఎం జగన్ ను ఆ మధ్య కలిశారు. దీంతో అంతా ఆల్ హ్యాపీస్ అనుకున్నారు. టిక్కెట్ రేట్లు కొలిక్కి వచ్చినట్టే.

  • Written By:
  • Updated On - June 16, 2022 / 12:07 PM IST

టాలీవుడ్ పెద్దలంతా కలిసి ఏపీ సీఎం జగన్ ను ఆ మధ్య కలిశారు. దీంతో అంతా ఆల్ హ్యాపీస్ అనుకున్నారు. టిక్కెట్ రేట్లు కొలిక్కి వచ్చినట్టే. ఇక థియేటర్లు నిరాటంకంగా నడుస్తాయి అని భావించారు. సో నో ప్రాబ్లం అన్నట్టే నడిచింది ఇన్నాళ్లు. కానీ ఇప్పుడు మళ్లీ ఏపీ సర్కార్ Vs టాలీవుడ్ అన్నట్టుగా సీన్ తయారైంది. ఇదంతా టిక్కెట్ల అమ్మకాలకు సంబంధించి కావడంతో కీలకంగా మారింది.

ఇకపై సినిమాల టిక్కెట్లను APFDC ద్వారా ఆన్ లైన్ లో మాత్రమే విక్రయించాలని జగన్ సర్కార్ డిసైడ్ అయ్యింది. ఇప్పటికే దీనిపై జూన్ 2న జీవో నెంబర్ 69ను కూడా రిలీజ్ చేసింది. దీనికి సంబంధించి నెల రోజుల్లోపు థియేటర్లన్నీ ప్రభుత్వంతో ఎంవోయూ చేసుకోవాలి. ఈమేరకు ఆదేశాలు జారీ అయ్యాయి. కానీ ఆ ఎంవోయూని పరిశీలించిన ఎగ్జిబిటర్లు షాక్ అయ్యారు. ఎందుకంటే అందులో ఉన్న పాయింట్లు అలాంటివి.

సినిమా టిక్కెట్లను APFDC ద్వారా అమ్మితే.. ఆ డబ్బును థియేటర్లకు మళ్లీ ఎప్పుడు జమ చేస్తారో ఎంవోయూలో క్లియర్ గా చెప్పలేదు. దీంతో ఆ పాయింట్ పై క్లారిటీ రావాల్సిందే అని ఎగ్జిబిటర్లంతా స్పష్టంగా చెబుతున్నారు. ఫిలిం ఛాంబర్ ద్వారా తాము టిక్కెట్లను ఆన్ లైన్ అమ్ముతామని.. ఈమేరకు ప్రభుత్వానికి ఇబ్బంది లేకుండా లింక్ కూడా ఇస్తామని ఓ లేఖ రాశారు. కానీ ప్రభుత్వం మాత్రం.. సర్కారు గేట్ వే ద్వారానే టిక్కెట్లు అమ్మాలని కచ్చితంగా చెప్పింది. జీవోలో అదే ఉంది.

ఇప్పుడు ఎంవోయూ పై సంతకం పెడితే తమ జుట్టు ప్రభుత్వం చేతిలో పెట్టినట్టేనని దీనివల్ల డబ్బులు ఎప్పుడు వస్తాయో కూడా చెప్పలేమని.. అది ఆర్థికంగా తమకు భారమంటున్నారు ఎగ్జిబిటర్లు. కానీ జూలై 2లోపు సంతకం చేయకపోతే.. ఏకంగా లైసెన్స్ లనే రద్దు చేస్తామని ప్రభుత్వం తేల్చి చెప్పడంతో ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదంటున్నారు. కానీ పరిస్థితి అంతవరకు వస్తే.. ఒప్పందంపై సంతకం చేసేదే లేదని.. అవసరమైతే థియేటర్లను కూడా మూసేస్తామని తేల్చి చెబుతున్నారు ఎగ్జిబిటర్లు.

Cover Photo: FILE