ఏపీ సీఎం జగన్ కు రిషిరాజ్ సింగ్ నేతృత్వంలోని ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (I-PAC) ఇచ్చిన సర్వే రిపోర్ట్ వైసీపీకి షాక్ ఇచ్చేలా ఉందని తెలుస్తోంది. మిషన్ 2024 కార్యాచరణ ప్రణాళిక దిశగా చేసిన సర్వేలు మధ్యతరగతి, సంపన్నులు, వ్యాపార వర్గాలు, ప్రభుత్వ ఉద్యోగులు, యువకులు జగన్ సర్కార్ కు వ్యతిరేకంగా ఉన్న విషయాన్ని స్పష్టం చేసిందని తెలుస్తోంది. రెండోసారి అధికారాన్ని నిలబెట్టుకోవడానికి సంక్షేమ పథకాలు సరిపోవని సర్వే బృందం తేల్చేసిందట. అభివృద్ధి ఏపీలో జరగడంలేదనే భావంతో ఎక్కువ మంది ఉన్నారని జగన్ కు ఫీడ్ బ్యాక్ ఇచ్చారట. అందుకే, ఇక నుంచి సంక్షేమంతో పాటు అభివృద్ధి దిశగా అడగులు వేయాలని, లేదంటే రెండోసారి అధికారం కష్టమని సర్వే రిపోర్ట్ ఐ ప్యాక్ టీం ఇచ్చిందని తెలుస్తోంది.
అందుకే, అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్న జగన్ జూన్ 23న చిత్తూరు జిల్లాలోని ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్‌లో ఎనిమిది పారిశ్రామిక యూనిట్లకు సీఎం శంకుస్థాపన చేయబోతున్నారు. పారిశ్రామికీకరణను ప్రోత్సహించేందుకు ప్రతినెలా సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. `గడప గడపకూ మన ప్రభుత్వం` కార్యక్రమంపై వర్క్‌షాప్ సందర్భంగా 2024 ఎన్నికల కోసం వైఎస్సార్‌సీపీ ప్రచార బాధ్యతలు చేపట్టిన రిషిరాజ్‌సింగ్ పార్టీ నేతలకు ప్రెజెంటేషన్ ఇచ్చారు. జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు సమాజంలోని అట్టడుగు వర్గాల ప్రజల ఆదరణ పొందుతున్నాయని తెలిపారు. కానీ, అభివృద్ధి మందగమనంపై యువత, మధ్యతరగతి వర్గాల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోందని స్పష్టం చేశారని తెలుస్తోంది. ఐటీ రంగాన్ని అభివృద్ధి చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించాలని, ఉపాధి కల్పించే మార్గాల్లో తయారీ రంగాన్ని ప్రోత్సహించాలని ఐ-ప్యాక్ పార్టీ దృష్టికి తీసుకొచ్చింది.
సంక్షేమ పథకాల పరిధిలోకి రాని మధ్యతరగతి, సంపన్నులు, వ్యాపార వర్గాలు, ప్రభుత్వ ఉద్యోగులు, యువకులు ఇతర వర్గాలను ఆకర్షించడానికి ప్రభుత్వం అభివృద్ధి అంశాలపై దృష్టి పెట్టాలని రిషిరాజ్ టీం సూచించింది. జగన్ ప్రభుత్వం తన ఫ్లాగ్‌షిప్ మెగా హౌసింగ్ ప్రోగ్రామ్ కింద పేదలకు 32 లక్షల ఇళ్లను అందించింది. అయితే సంక్షేమ పథకాల నుండి వారిని నిరోధించడంపై సమాజంలోని మెజారిటీ వర్గాల్లో అశాంతి నెలకొంది. ఈ వర్గాలను ఆకర్షించేందుకు నగరాలు, పట్టణాలలో లేఅవుట్‌లతో సరసమైన ధరలకు మధ్య, ఉన్నత ఆదాయ వర్గాలకు, ప్రభుత్వ ఉద్యోగులకు ప్లాట్లు అందించే స్మార్ట్ టౌన్‌షిప్ పథకాన్ని జగన్ ప్రభుత్వం ప్రారంభించింది. పారిశ్రామికీకరణ కార్యకలాపాలను వేగవంతం చేయడం రాబోయే రెండేళ్లలో ఉన్నతవర్గాలు, వ్యాపార వర్గాలు, యువతను ఆకర్షించేందుకు వైఎస్సార్‌సీపీకి ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.