KCR vs Jagan: జ‌గ‌న్‌కు ఫిటింగ్ పెట్టిన కేసీఆర్..!

  • Written By:
  • Updated On - March 10, 2022 / 04:31 PM IST

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ గురువారం 80 వేల‌కు పైగా ఉద్యోగాల నోటిఫికేష‌న్ జారీ చేసి, నిరుద్యోగుల‌కు భారీ న‌జ‌రానా ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. గత ఎనిమిదేళ్లుగా అన్ని వర్గాలను ఏదో ఒక పథకం ద్వారా రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను ఆకట్టుకుంటున్న సీఎం కేసీఆర్ నియామకాల విషయంలో కొంత వెనకబడి ఉన్నారు. నిరుద్యోగ సమస్యను పరిష్కారించాలంటూ దాదాపు రెండేళ్లుగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నా, కేసీఆర్ నుంచి ఎలాంటి స్పంద‌న రాలేదు.

అయితే ఇటీవ‌ల నిరుద్యోగుల్లో పెద్ద ఎత్తున‌ అసహనం పెరగడంతో, తప్పనిసరి పరిస్థితుల్లో, గెలుపే లక్ష్యంగా కేసీఆర్ భారీ స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. రాష్ట్రంలో కొలువుల జాతరకు తెరలేపిన కేసీఆర్, నిరుద్యోగ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించ‌డం కోసం తెలంగాణలో మెగా జాబ్ నోటిఫికేష‌న్ ప్ర‌క‌టించారు. కేసీఆర్ ప్ర‌క‌ట‌న‌తో తెలంగాణ‌లో స‌బంరాలు చేసుకుంటుంటే, ప‌క్క‌నే ఉన్న మ‌రో తెలుగు రాష్ట్రం ఏపీలో మాత్రం జ‌గ‌న్ స‌ర్కార్ పై ఒత్తిడి పెరిగింది.

ఏపీలో గ‌త ఎన్నిక‌ల్లో భాగంగా, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఏటా జనవరి ఒకటిన జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని జగన్ హామీ ఇచ్చారు. అలాగే మెగా డీఎస్సీ కూడా నిర్వహిస్తామని కూడా హామీ ఇచ్చారు. అయితే ఈ రెండు ప్రస్తుతం కార్యరూపం దాల్చలేదు. దీంతో ఏపీలో ఉపాధి అవకాశాలు లేక నిరుద్యోగులు అసహనంతో ఉన్నారు. ఒక‌వైపు పరిశ్రమలు పెద్దగా రాకపోవడం, మ‌రోవైపు ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ కాకపోవడంతో, వచ్చే ఎన్నికలలో జగన్ ప్ర‌భుత్వానికి ఇబ్బందిగా మారనుందని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

వాస్త‌వానికి రాష్ట్రంలో గ్రామ‌ వాలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయ పోస్టులను పెద్ద సంఖ్యలో భర్తీ చేసినా జాబ్ క్యాలెండర్ విడుదలపై నిరుద్యోగుల్లో అసంతృప్తి నెలకొంది. ఈ క్ర‌మంలో ఏపీలోని నిరుద్యోగ యువత కూడా ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక‌వైపు పొరుగున ఉన్న తెలంగాణ‌ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల జాతర జరుగుతున్న క్ర‌మంలో, ఏపీలో కూడా ఇప్పుడు ఉద్యోగాల భ‌ర్తీకి జ‌గ‌న్ పూనుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రంలో వెంట‌నే ఉద్యోగ నియామ‌కాలు చేప‌ట్ట‌కుంటే, నిరుద్యోగుల్లో జ‌గ‌న్ ప్ర‌భుత్వం పై తీవ్ర‌స్థాయిలో అసంతృప్తి పెరిగే అవ‌కాశం ఉంది. ఏది ఏమైనా తెలంగాణ‌లో కొలువుల జాత‌ర‌కు తెర‌లేపి, ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోమ‌న్ రెడ్డికి, తెలంగాణ సీఎం కేసీఆర్ పెద్ద ఫిటింగ్ పెట్టార‌ని రాజ‌కీయ‌వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు.