Site icon HashtagU Telugu

MLA Roja: రోజాపై `కోవ‌ర్టు` ఆప‌రేష‌న్

Roja And Jagan

Roja And Jagan

చిత్తూరు న‌గ‌రి ఎమ్మెల్యే రోజా గ్రూపు రాజ‌కీయాల‌తో స‌త‌మ‌తం అవుతోంది. ప‌లుమార్లు సీఎం జ‌గ‌న్ ఎదుట పంచాయ‌తీ పెట్టిన‌ప్ప‌టికీ శాశ్వ‌త పరిష్కారం రాలేదు. పైగా రోజాను మంత్రివ‌ర్గంలోకి తీసుకోకుండా ముంద‌స్తుగా కొంద‌రు సీనియ‌ర్లు వ్య‌తిరేక పావులు క‌దుపుతున్నారు. ఆమె నియోజ‌క‌వ‌ర్గం న‌గ‌రిలోని ఒక గ్రూపు నిత్యం వ్య‌తిరేకంగా ప‌నిచేస్తోంద‌ని త‌ల‌పోస్తున్నారు. కోవ‌ర్టులు న‌గ‌రి వైసీపీలో ఉన్నార‌ని విశ్వ‌సిస్తున్నారు. ప్ర‌త్య‌ర్థి పార్టీల‌కు అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని రోజా అనుమానం. మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ జ‌రిగితే చిత్తూరు జిల్లా నుంచి ఈసారి చెవిరెడ్డి భాస్క‌ర్ రెడ్డి, కరుణాక‌ర్ రెడ్డి, రోజా, పెద్దిరెడ్డి మ‌ధ్య పోటీ ఉండ‌నుంది. ప్ర‌స్తుతం పంచాయ‌తీరాజ్ మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డిని మంత్రివ‌ర్గం నుంచి త‌ప్పిస్తే, రోజాకు స్థానం వ‌స్తుంద‌ని ఆమె వ‌ర్గీయుల ఆశ‌. కానీ, ఆమె కంటే రాజ‌కీయాల్లో సీనియ‌ర్లుగా ఉన్న క‌రుణాక‌ర్ రెడ్డి, భాస్క‌ర్ రెడ్డిలు రోజాకు పోటీ వ‌చ్చే ఛాన్స్ ఉంది. మంత్రివ‌ర్గంలో స్థానాన్ని ఆశిస్తోన్న వాళ్లంద‌రూ ఒకే సామాజిక వ‌ర్గానికి చెందిన లీడ‌ర్లు. పైగా జ‌గ‌న్ కుటుంబానికి అత్యంత స‌న్నిహితులు. ఎవ‌రికి వారే ఈక్వేష‌న్ల‌ను లెక్కించుకుంటూ మంత్రి ప‌ద‌విని ఆశిస్తున్నారు.

సంక్రాంతి త‌రువాత మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ ఉంటుంద‌ని వైసీపీలో వ‌ర్గాల్లోని టాక్‌. ఆ మేర‌కు ఇప్ప‌టి నుంచే మంత్రి వ‌ర్గంలో చోటు కోసం పావులు క‌దుపుతున్నారు. ఫ‌లితంగా గ్రూపు విభేదాలు తారాస్థాయికి చిత్తూరులో చేరాయ‌ని తెలుస్తోంది. ప్రత్యేకించి రోజాకు వ్య‌తిరేకంగా ఒక గ్రూపు న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గంలో ప‌నిచేస్తోంద‌ని అధిష్టానం వ‌ద్ద ఫిర్యాదు ఉంది. ఆ గ్రూపు ఇప్పుడు మ‌రింత రెచ్చిపోవ‌డంతో నేరుగా ఎస్పీ సెంథిల్ కుమార్ కు ఫిర్యాదు చేసేంత వ‌ర‌కు వెళ్లింది. కోవ‌ర్టుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆమె ఫిర్యాదు చేసింది.
ఫ్లెక్సీల్లో మంత్రి పెద్దిరెడ్డి, డీజీపీ గౌత‌మ్ స‌వాంగ్ ఫోటోల‌ను వేసుకుని కోవ‌ర్టులు బెదిరిస్తున్నార‌ని రోజా ప్ర‌ధాన ఆరోప‌ణ‌. అక్ర‌మ వ‌సూళ్ల‌కు పాల్ప‌డుతున్నార‌ని ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. వీళ్లంతా పార్టీని బ‌హిష్క‌ర‌ణ‌కు గురైన వాళ్లేనంటూ
ఆరోపిస్తున్నారు. గ‌తంలోనూ ప‌లు సంద‌ర్భాల్లో న‌గ‌రి కేంద్రంగా గ్రూపు విభేదాలు ప్రారంభోత్స‌వాలు, శంకుస్థాప‌న‌ల స‌మ‌యంలో బ‌య‌ట‌ప‌డిన విష‌యం విదిత‌మే. పైగా ఆ నియోజ‌క‌వ‌ర్గంలో తొలి నుంచి కాంగ్రెస్ , వైసీపీని క‌నిపెట్టుకుని ఉన్న వాళ్ల ఒక గ్రూపు. రోజాతో పాటు తెలుగుదేశం నుంచి వ‌చ్చిన వాళ్లు మ‌రో గ్రూప్ గా ఉన్నారు.

రెండు గ్రూపుల మ‌ధ్య ఎప్పుడూ రాజ‌కీయ విభేదాలు ఎడ‌తెగ‌కుండా కొన‌సాగుతున్నాయి. ఆ క్ర‌మంలోనే ఆమె రెండు సార్లు న‌గ‌రి నుంచి ఓడిపోయారు. తెలుగుదేశం పార్టీలో ఉన్న‌ప్పుడు దివంగ‌త ముద్దుక్రిష్ణ‌మ‌నాయుడు గ్రూపు వ్య‌తిరేకంగా ప‌నిచేసింద‌ని ఆమె అనుమానం. అందుకే రెండుసార్లు టీడీపీ నుంచి ఆమె ఓడిపోయారట‌. వైసీపీ నుంచి 2014, 2019 ఎన్నిక‌ల్లో గెలుపొందారు. దానికి కార‌ణంగా టీడీపీ నుంచి వ‌చ్చిన ఆమె వ్య‌క్తిగ‌త గ్రూపు ప్ల‌స్ వైసీపీలోని వాళ్లు క‌లిసి ప‌నిచేయ‌డ‌మేన‌ని స్థానికుల అభిప్రాయం. తాజాగా టీడీపీ నుంచి వ‌చ్చిన గ్రూప్ కు, వైసీపీలోని ఒక గ్రూపుకు మ‌ధ్య పొస‌గ‌డంలేదు. దీంతో జ‌డ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ ఆ రెండు గ్రూప్ ల మ‌ధ్య వార్ న‌డిచింది. ఆ సంద‌ర్భంగా జ‌గ‌న్ వ‌ద్ద పంచాయ‌తీ పెట్ట‌గా రోజాదే పైచేయిగా నిలిచింది. ఇప్పుడు మ‌ళ్లీ మంత్రివ‌ర్గ మార్పు స‌మ‌యం వ‌స్తున్న క్ర‌మంలో రోజాను గ్రూప్ విభేదాలు వెంటాడ‌డం గ‌మ‌నార్హం. జ‌గ‌న్ సూచ‌న మేర‌కు ఎపీఐసీసీ చైర్మ‌న్ ప‌ద‌వికి రాజీనామా చేసింది. మంత్రివ‌ర్గంలో స్థానం కో్సం ఆమె ఎదురుచూస్తోంది. ఈ స‌మ‌యంలో సొంత పార్టీలోని కోవ‌ర్టు ఆప‌రేష‌న్ వ్య‌వ‌హారం రోజాను ఎటువైపు తీసుకెళుతుందో చూడాలి.