ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. సచివాలయ సిబ్బంది ప్రస్తుత జాబ్ ఛార్ట్‌లో ఉన్న విధులపాటు మరికొన్ని అదనపు బాధ్యతలు కూడా చేపట్టాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామ, పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు సంక్షేమ పథకాలు, సేవలు సమర్థవంతంగా చేరేలా చర్యలు తీసుకోవాలని ఈ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ముఖ్యంగా ప్రతి ఇంటి స్థాయిలో పౌరుల డేటా సేకరించి, ప్రభుత్వ పథకాలకు అర్హులైన లబ్ధిదారులను గుర్తించాలన్నది ప్రధాన ఉద్దేశం.
Layoffs: ఉద్యోగాలు కోల్పోవడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణమా?!
ఈ కొత్త ఆదేశాల ప్రకారం, సచివాలయ సిబ్బంది “ఇంటి వద్దకే సేవలు” అందించే విధానాన్ని మరింత బలోపేతం చేయాల్సి ఉంటుంది. సంక్షేమ పథకాల అమలులో ఏవైనా సమస్యలు తలెత్తితే వాటిని పరిష్కరించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలి. అలాగే సచివాలయాలకు వచ్చే పౌర వినతులను సమయానికి పరిష్కరించడం, వివిధ విపత్తుల సమయంలో హాజరై సహాయక చర్యల్లో పాల్గొనడం వంటి అంశాలను కూడా తప్పనిసరిగా పాటించాలన్నారు. ఈ విధంగా సచివాలయ వ్యవస్థ ప్రజలతో మరింత సాన్నిహిత్యం పెంచి, “ప్రభుత్వం మీ ఇంటి ముందే” అనే భావనను బలపరచడమే లక్ష్యంగా ప్రభుత్వం చూస్తోంది.
ప్రభుత్వం స్పష్టంగా హెచ్చరించింది. ఈ ఉత్తర్వులను విస్మరించిన సిబ్బందిపై జిల్లా కలెక్టర్లు తగిన శాసన చర్యలు తీసుకోవాలని. ఇప్పటివరకు కొంతమంది సచివాలయ సిబ్బంది తమ పనితీరుపై నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించారని, ఆ పరిస్థితి పునరావృతం కాకుండా క్రమశిక్షణతో వ్యవహరించాలని సూచించింది. గ్రామ, వార్డు సచివాలయాలు రాష్ట్ర పరిపాలనా వ్యవస్థలో కీలక భాగమని గుర్తు చేస్తూ, ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడంలో ఇవే ముందుండాలని ప్రభుత్వం పేర్కొంది. ఈ ఉత్తర్వులు అమల్లోకి రావడంతో సచివాలయాల పనితీరు మరింత పారదర్శకంగా, ఫలితాల దిశగా సాగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.