Adani Says No: రాజ్యసభ రేసు నుంచి అదాని ఔట్

ఏపీ నుంచి త్వ‌ర‌లో ఖాళీ అవ‌బోతున్న నాలుగు రాజ్య‌స‌భ స్థానాల్లో ఒక‌టి అదానీ గ్రూప్‌న‌కు కేటాయించిన‌ట్లు విస్తృతంగా వార్త‌లు వ‌చ్చాయి.

  • Written By:
  • Updated On - May 15, 2022 / 09:42 PM IST

ఏపీ నుంచి త్వ‌ర‌లో ఖాళీ అవ‌బోతున్న నాలుగు రాజ్య‌స‌భ స్థానాల్లో ఒక‌టి అదానీ గ్రూప్‌న‌కు కేటాయించిన‌ట్లు విస్తృతంగా వార్త‌లు వ‌చ్చాయి. ఆయన కుటుంబం నుంచి ప్రీతి అదానీ రాజ్య‌స‌భ‌కు ఎంపిక కాబోతున్నారంటూ ప్ర‌చారం జ‌రిగింది. ఎన్నిక‌ల షెడ్యూల్ కూడా రావ‌డంతో ఇక అధికారిక ప్రకటన మాత్రమే మిగిలిందని భావించారు. అయితే తాము ఏ పార్టీలో చేర‌డంలేద‌ని, ఏ స‌భ‌కు తాము వెళ్ల‌బోవ‌డంలేదంటూ అదానీ గ్రూప్ అధికారికంగా ప్ర‌క‌టించింది. రాజ‌కీయ పార్టీలో చేరే ఉద్దేశం త‌మ‌కు లేద‌ని అదానీ గ్రూప్ స్పష్టం చేసింది.

గ‌తంలో రిల‌య‌న్స్ గ్రూప్ త‌ర‌ఫున ప‌రిమ‌ళ్ న‌త్వానీ రాజ్య‌స‌భ‌కు ఎంపికయ్యారు. అయితే ఆయ‌న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి పార్టీ త‌ర‌ఫున ఎంపిక కావాల‌ని వైసీపీ ష‌ర‌తు విధించ‌డంతో న‌త్వానీ వైసీపీ స‌భ్య‌త్వం తీసుకొని ఆ పార్టీ త‌ర‌ఫున నామినేష‌న్ వేసి రాజ్య‌స‌భ స‌భ్యుడ‌య్యారు. ఇప్పుడు అదానీని కూడా ఇదే త‌ర‌హాలో ఎంపిక కావాలంటూ వైసీపీ పెద్ద‌లు కోరారు. పార్టీల త‌ర‌ఫున ఎంపిక కావ‌డం ఇష్టం లేని అదానీ ఆ ప్ర‌తిపాద‌న‌ను తిర‌స్క‌రించారు.దీంతో అదానీ గ్రూప్‌న‌కు ఇవ్వాల్సిన రాజ్య‌స‌భ సీటును ఎవరికి కేటాయిస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది.

నాలుగు రాజ్య‌స‌భ స్థానాల‌కు సంబంధించి పలువురు పేర్లు వినిపిస్తున్నాయి. ఒక‌టి విజ‌య‌సాయిరెడ్డిని మళ్ళీ ఎంపిక చేస్తారనే దానిపై వార్తలు వచ్చిన వాటిలో నిజం లేదని తెలుస్తోంది. మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి, నెల్లూరు జిల్లా బీసీ నేత బీద మ‌స్తాన్‌రావును ఎంపిక చేశార‌ని వైసీపీ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇప్పుడు అక‌స్మాత్తుగా అదానీ రేసు నుంచి త‌ప్పుకోవ‌డంతో ఆ స్థానంలో ఎవ‌రిని ఎంపిక చేస్తారో అనే ఉత్కంఠ నెల‌కొంది. టిడిపి మాజీ నేత చలమల సెట్టి సునీల్ పేరు కూడా వినిపిస్తోంది. ఇదిలా ఉంటే పారిశ్రామిక‌వేత్త‌ల కోటాకు సంబంధించి తెలంగాణాలో జగన్ కి అత్యంత సన్నిహితుడైన మైహోం రామేశ్వ‌ర‌రావు రేసులో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది అయితే రామేశ్వర రావు మరో రాష్ట్రం నుంచి బీజేపీ అవకాశం ఇవ్వొచ్చని భావిస్తున్నారు.