Adani : ‘ఆదాని’కి రాజ్య‌స‌భ‌పై జ‌గ‌న్ కీల‌క నిర్ణ‌యం

రాజ్య‌స‌భ స్థానాల అభ్య‌ర్థుల ఎంపిక విష‌యంలో వైసీపీ నిర్థార‌ణ‌కు వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది.

  • Written By:
  • Publish Date - May 14, 2022 / 06:00 PM IST

రాజ్య‌స‌భ స్థానాల అభ్య‌ర్థుల ఎంపిక విష‌యంలో వైసీపీ నిర్థార‌ణ‌కు వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. అత్యంత విశ్వ‌స‌నీయంగా తెలుస్తోన్న స‌మాచారం ప్ర‌కారం ఈసారి పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ కుటుంబానికి చెందిన సభ్యుడు లేదా ఆదానీ స‌తీమ‌ణి డాక్టర్ ప్రీతి అదానీ కి వైసీపీ కోటా రాజ్య‌స‌భ ద‌క్క‌నుంది. వ‌చ్చే నెల 10వ తేదీన జ‌రిగే రాజ్య‌స‌భ ఎన్నిక‌ల కోసం న‌లుగురు అభ్య‌ర్థుల ఎంపిక పూర్తియినట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం అసెంబ్లీలో వైసీపీకి ఉండే బలం ప్రకారం ఖాళీ అయిన నాలుగు స్థానాల్లో వైఎస్సార్‌సీపీ విజయం సాధిస్తుంది.

వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డిని మ‌రోసారి కొనసాగించాలని సీఎం నిర్ణయించార‌ని తెలుస్తోంది. బీసీ సామాజికవర్గానికి ఒక్క సీటు ఇవ్వనుండగా, ఆకోటాలో నెల్లూరు జిల్లాకు చెందిన బీద మస్తాన్‌రావు పేరును ఎంపిక చేసిన‌ట్టు వినికిడి. నాలుగో స్థానానికి సీఎం తరపు న్యాయవాది నిరంజన్‌రెడ్డి నామినేషన్‌ వేసే అవకాశం ఉందని ఆ పార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చ న‌డుస్తోంది. ఒక వేళ ఆయ‌న్ను కాద‌నుకుంటే ఉత్త‌రాంధ్ర‌కు చెందిన మాజీ కేంద్ర‌ మంత్రి కిల్లికృపా రాణిని రాజ్యసభకు పంపే అవకాశం ఉంది. చివరి నిమిషంలో సోషల్‌ ఇంజినీరింగ్‌ లెక్కలు మారితే 2024 ఎన్నికల దృష్ట్యా నాలుగో రాజ్య‌స‌భ సీటు మైనార్టీ వర్గాలకు చెందిన అభ్యర్థికి లేదా ఎస్సీ ప్రతినిధికి దక్కే అవకాశం ఉందని వైఎస్‌ఆర్‌సి వ‌ర్గాల్లోని ఈక్వేష‌న్‌. ఇప్ప‌టి వ‌ర‌కు సీఎం ముగ్గురి పేర్లను ఖరారు చేశారని, రెండు మూడు రోజుల్లో నాలుగో అభ్యర్థిని ఖరారు చేస్తారని తాడేప‌ల్లి వ‌ర్గాల టాక్‌.

గ‌త రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్‌ షాల సూచ‌న మేరకు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ సీనియర్‌ గ్రూప్‌ ప్రెసిడెంట్‌ పరిమళ్‌ నత్వానీకి రాజ్యసభ టిక్కెట్ వైసీపీ నుంచి ఇచ్చారు. ఈసారి అమిత్ షా ప్రతిపాదించిన పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ కుటుంబానికి అవ‌కాశం ఇవ్వ‌డ‌దానికి జగన్ మోహన్ రెడ్డి సిద్ధ‌మ‌య్యార‌ని విశ్వసనీయ వర్గాలు స‌మాచారం. ఇటీవ‌ల జ‌రిగిన స‌మావేశంలో అదానీల‌కి వైఎస్సార్‌సీపీ టిక్కెట్టు ఇచ్చే అవ‌కాశాల‌పై కేంద్ర హోంమంత్రి ప్ర‌స్తావించార‌ని తెలుస్తోంది.

టీడీపీ నుంచి ఫిరాయించిన ముగ్గురు బీజేపీ రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, టీజీ వెంకటేష్‌, సురేష్‌ ప్రభు , విజ‌య‌సాయిరెడ్డి పదవీకాలం జూన్‌ 21తో ముగియనుంది. ఆ స్థానాల‌ను భ‌ర్తీ చేయ‌డానికి ఇప్ప‌టికే నోటిఫికేష‌న్ జారీ అయింది. ఈసారి ఆ నాలుగు స్థానాల‌ను వైసీపీ కైవ‌సం చేసుకుంటుంది. 175 స్థానాలున్న అసెంబ్లీలో వైఎస్సార్‌సీపీకి 151 సీట్లు ఉండగా, ప్రతిపక్ష టీడీపీకి 23, జనసేనకు ఒక సీటు ఉన్నాయి. ఫిబ్రవరిలో మంత్రి మేకపాటి గౌతమ్ మృతి చెందడంతో నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు నియోజకవర్గం ఖాళీ అయింది. దీంతో వైసీపీకి ప్ర‌స్తుతం 150 మంది ఎమ్మెల్యేల బ‌లం ఉంది. ఒక్కో రాజ్యసభ సీటును గెలవాలంటే సగటున 44 మంది ఎమ్మెల్యే ఓట్లు అవసరం కాగా మొత్తం నాలుగు స్థానాల్లో వైఎస్సార్‌సీపీ విజయం సాధిస్తుందని స్పష్టం అవుతోంది.

ఏపీకి రాజ్యసభలో 11 సీట్లు ఉన్నాయి. వీరిలో ఇప్పుడు ఐదుగురు వైఎస్‌ఆర్‌సి సభ్యులు (విజయసాయిరెడ్డిని మినహాయించి, వీరి పదవీకాలం జూన్ 21తో ముగుస్తుంది). జూన్ 10న భర్తీ కానున్న నాలుగు రాజ్యసభ స్థానాలు వైఎస్సార్సీపీ బలాన్ని ఎగువ సభలో ఐదు నుంచి తొమ్మిదికి పెంచుతుంది. వైఎస్‌ఆర్‌సీకి చెందిన వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, టీడీపీకి చెందిన కనకమేడల రవీంద్ర, బీజేపీకి చెందిన సి.ఎం ర‌మేష్ వచ్చే ఏడాది ఏప్రిల్ 22న ప‌ద‌వీ కాలం ముగుస్తుంది. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈ మూడు స్థానాలకు ఎన్నికలు జరగనుండగా, ఈ మూడు స్థానాలను కూడా వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకునే అవకాశం ఉంది.