ఒకప్పుడు తెలుగు సినిమాలలో తన వినోదభరిత నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నటి వాసుగి (Actress Pakeezah Vasuki), ప్రస్తుతం తీవ్ర దారిద్య్రంలో జీవనంతో పోరాడుతున్నారు. ‘అసెంబ్లీ రౌడీ’ చిత్రంలోని ‘పాకీజా’ పాత్రతో తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చోటు దక్కించుకున్న ఆమె, నేడు తమిళనాడులో ఆదరణ లేకపోవడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపైనే ఆశలు పెట్టుకుంది. తాను తెలుగు సినీ కుటుంబాలైన చిరంజీవి, నాగబాబు, మోహన్ బాబు సహకారంతోనే ఇప్పటి వరకు బ్రతికి ఉన్నానని, లేకపోతే బహుశా బ్రతికి ఉండేదాన్నేమో కాదని భావోద్వేగంతో తెలిపారు.
MLC 2025: మేజర్ లీగ్ క్రికెట్‌లో సరికొత్త చరిత్ర.. అతిపెద్ద రన్ చేజ్ చేసిన సీటెల్!
తమిళనాడులో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన వాసుగి, జయలలిత పిలుపుతో అన్నాడీఎంకే పార్టీలో చేరడంతో సినిమాలకు దూరమయ్యారు. అప్పటి నుంచి పరిస్థితులు నెమ్మదిగా దిగజారాయని ఆమె చెప్పారు. భర్త మద్యానికి బానిసై ఆస్తులు నాశనం చేయడం, అనంతరం అతడి ఆత్మహత్య, అత్తమామల వేధింపులు వంటి వ్యక్తిగత విషాదాలు ఆమె జీవితాన్ని నిండా కుదిపేశాయి. తల్లి క్యాన్సర్ చికిత్సకు తన వద్ద ఉన్న డబ్బు అంతా ఖర్చుపెట్టిన తర్వాత సహాయం చేసేవారు కరువయ్యారన్నది ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
ప్రస్తుతం ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న పాకీజా.. గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లను కలిసేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. “తెలుగువారే నాకు అన్నం పెట్టారు, ఇప్పుడు తెలుగు నాయకులే నా జీవితాన్ని మళ్ళీ గాడిలో పెట్టాలి” అంటూ భావోద్వేగంతో విజ్ఞప్తి చేశారు. కనీసం ఒక చిన్న పింఛన్ ఇవ్వగలిగితే, జీవితాంతం వారికి రుణపడి ఉంటానని, అవసరమైతే వారి కోసం ప్రచారం కూడా చేస్తానని పేర్కొన్నారు. ఆమె కష్టాలను ప్రభుత్వాలు గమనించి, తగిన సాయం చేయాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.