Kadambari Jethwani: ముంబయి నటి కాదంబరి జెత్వానీ కేసు విషయంలో ప్రభుత్వం ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నటి జెత్వానీ శుక్రవారం విజయవాడకు (Vijayawada) వచ్చారు. మధ్యాహ్నం ఆమె పోలీస్ కమిషనర్‌ను కలిసే అవకాశం ఉంది. ఏసీపీ స్రవంతిరాయ్ నేతృత్వంలో ప్రత్యేక బృందం.. జత్వానీ నుంచి వివరాలు తీసుకోనున్నారు. మరోవైపు, ఆమెపై నమోదు చేసిన ఫోర్జరీ కేసునూ విచారణాధికారి పరిశీలించనున్నారు. ఏపీ పోలీసులు అక్రమ కేసులు పెట్టి తనను అనేక విధాలుగా వేధించారని నటి జెత్వానీ ఆరోపించారు. ఆ అధికారులకు సంబంధించిన అన్ని ఆధారాలు తన దగ్గర ఉన్నాయని.. వీటన్నింటినీ ఏపీ ప్రభుత్వానికి అందిస్తానని చెప్పారు.
We’re now on WhatsApp. Click to Join.
తన కుటుంబ సభ్యులను అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేశారని.. ఇప్పుడు సర్కారు తనకు సపోర్ట్ చేస్తుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. సోషల్ మీడియాలో కొందరు తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని.. డబ్బుల కోసమే ఇలా మాట్లాడాతున్నానని తన వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు జరిగిన అన్యాయంపై విచారణ జరిపి న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వంపై తనకు పూర్తి నమ్మకం ఉందని స్పష్టం చేశారు.
కాగా, కృష్ణా జిల్లాకు చెందిన వైసిపి నేత కుక్కల విద్యాసాగర్ తనని వేధించాడంటూ ముంబయికి చెందిన సినీనటి కాదంబరీ జత్వానీ ఆరోపించడం ఏపీలో సంచలనం రేపింది. ఇందులో రాజకీయ నాయకులతోపాటు, ఇద్దరు ఐపీఎస్‌లు, ప్రభుత్వంలోని కీలక నేతల ప్రమేయం కూడా ఉన్న విషయం వెలుగులోకి వచ్చి హాట్ టాపిక్ అయింది. గత ప్రభుత్వం హయాంలో తాను పడిన ఇబ్బందుల గురించి మీడియా ముఖంగా చెబుతూ జత్వానీ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ కేసులో అసలు నిజాలను నిగ్గు తేల్చేందుకు సీసీఎస్ ఏసీపీ స్రవంతి రాయ్‌ను విచారణ అధికారిగా నియమించింది. ఈ మొత్తం వ్యవహారం వెనుక అత్యంత శక్తివంతమైన వ్యక్తులున్నారంటూ ఆమె ఆరోపించడం చర్చనీయాంశమయ్యింది.