Site icon HashtagU Telugu

AP : ఏపీ ప్రభుత్వ సలహాదారుగా నటుడు అలీ..ఉత్తర్వులు జారీ..!!

Ali

Ali

సినీనటుడు, కమెడియన్ అలీకి ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారునిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది సర్కార్. కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న అలీ…రాజకీయాలకు కాస్త దగ్గరగానే ఉన్నారు. 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. ఎన్నికల్లో పోటీ చేయాలని భావించినా…సీట్ల సర్దుబాటు విషయంలో అది కుదరలేదు. దీంతో వైసీపీ తరపున ప్రచారం చేశారు అలీ. ముస్లింల ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అలీ చేత ప్రచారం చేయించింది వైఎస్సార్ సీపీ. దీంతో అధికారంలోకి వస్తే అలీకి మంచి పదవి ఖాయం అని ప్రచారం కూడా జరిగింది. కానీ ఎలాంటి పదవీ ఇవ్వలేదు. దీంతో కొంచెం నిరాశకు గురైన అలీ…పార్టీ మారుతారనే వార్తలు కూడా వచ్చాయి. గతంలో టీడీపీలో ఉన్న అలీ..మళ్లీ సొంతగూటికి వెళ్లే ఆలోచన లేదన్నారు. పవన్ తో దగ్గరి సంబంధాలు ఉండటంతో జనసేనలోకి వెళ్తారన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది.

సినిమాలు లేక, వైసీపీలో ఎలాంటి పదవీ రాక…పార్టీ లో నుంచి బయటకు వెళ్తారన్న ప్రచారం జోరందుకోవడంతో…అలీకి గుడ్ న్యూస్ చెప్పారు జగన్. తానుపార్టీ మారుతున్నారన్న వార్తలపై అలీ స్పందించారు. తనపై కొందరు కావాలనే కుట్ర పూరిత ప్రచారం చేస్తున్నారన్నారు. తాను పార్టీ మారడం లేదన్నారు. ఎట్టిపరిస్థితుల్లో వైసీపీలోనే కొనసాగుతానంటూ చెప్పుకొచ్చారు. పదవుల కోసం వైసీపీ చేరలేదని తేల్చి చెప్పారు. జగన్ ను సీఎం చేయాలన్న లక్ష్యంతోనే తాను వైసీపీలో చేరారని చెప్పారరు. మరోసారి జగన్ సీఎం అయ్యేంత వరకు తాను అంకితభావంతో పనిచేస్తానని వెళ్లడించారు అలీ.

Exit mobile version