Nara Lokesh: శ్రీకాళహస్తిలో తవ్వకాలకు కారకులైనవారిని చర్యలు తీసుకోవాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అయ్యారు. ‘‘చేసిన పాపాలు పోవాలని, సన్మార్గంలో నడిచేలా దీవించాలని భక్తులంతా శ్రీకాళహస్తీశ్వర స్వామిని వేడుకుంటారు. అధికారమదం తలకెక్కిన వైకాపా ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి మాత్రం శ్రీకాళహస్తి సన్నిధిలోనే పాపాలకు పాల్పడుతున్నాడు. స్వామి, అమ్మవార్లకే అపచారం తలపెడుతున్నాడు’’ అని లోకేశ్ మండిపడ్డారు.
‘‘పురాతన శ్రీకాళహస్తి ఆలయంలో స్వామి అమ్మవార్లకి నైవేద్యాలు తయారుచేసే గది, మృత్యుంజయ పూజలు నిర్వహించే ప్రదేశంలో వేల ఏళ్ల నాటి చారిత్రక కట్టడాలను కూల్చేయిస్తున్నాడు. పురావస్తు, దేవాదాయ శాఖ నిబంధనలు పట్టించుకోకుండా, వీఐపీల ఆశీర్వాదాల కోసం శ్రీకాళహస్తి ఆలయంలో తవ్వకాలు చేపట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. చారిత్రక, పురావస్తు, ఆధ్యాత్మిక సంపద ధ్వంసం చేయడం నిబంధనలకు విరుద్ధమే కాదు, పాపం. శ్రీకాళహస్తి ఆలయంలో తవ్వకాలకు కారకులపై చర్యలు తీసుకోవాలి’’ అని లోకేశ్ డిమాండ్ చేశారు.