Ganja: “సీలావతి” పై ఏపీ పోలీస్ స్పెషల్ ఆపరేషన్…ఇది చేపకాదండోయ్…

ఏపీలో గంజాయి సాగు విపరీతంగా సాగుతుంది.

  • Written By:
  • Updated On - November 5, 2021 / 12:01 AM IST

“సీలావతి” అంటే చాలామందికి చేపలో ఓ రకంగానే తెలుసు కానీ ఇప్పుడు పోలీసుల నోటి నుంచి వస్తున్న “సీలావతి” అంటే కూడా చేప అని అనుకుంటే మాత్రం మీరు పప్పులో కాలేసినట్లే.. ఇంతకీ ఈ సీలవతి అంటే ఎంటో తెలుసుకోవాలనుకుంటున్నారా…అయితే వివరాల్లోకి వెళ్దాం

ఏపీలో గంజాయి సాగు విపరీతంగా సాగుతుంది. విశాఖ,విజయనగరం ఏజెన్సీలో గంజాయిసాగు వేల ఎకరాల్లో సాగుతున్నట్లు పోలీసుల లెక్కల్లో బయటపడింది.ఈ గంజాయి సాగు కూడా నాలుగైదు రకాలుగా సాగుచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.జాతీయ,అంతర్జాతీయ స్థాయి బాగా డిమాండ్ కలిగిన సీలావతి రకాన్ని ఎక్కువమంది సాగు చేస్తున్నారు.నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB), డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI), మరియు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (SEB) అధికారులు తెలిపిన ప్రకారందేశంలోని 17 రాష్ట్రాల్లోని 41 జిల్లాల్లో గంజాయిని సాగు చేస్తున్నారు..ముఖ్యంగా ఏవోబీ ప్రాంతంలో గంజాయి సాగు ఎక్కువ అని పోలీసులు అంటున్నారు. ఏవోబీ ప్రాంతంలో సీలావతి రకం గంజాయి సాగుపై పోలీసులు దృష్టి సారించారు.ఆంధ్రా ఒడిశా సరిహద్దు (ఏవోబీ), తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతాల నుంచి గంజాయి సాగు, అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు.

సీలావతి తో పాటు రాజ హంస, కళా పత్రి రకం గంజాయి సాగు విశాఖపట్నం రూరల్ ,ఏవోబీ ప్రాంతాల్లో సాగు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.గంజాయి సాగు,అక్రమ రవాణా నియంత్రించడానికి ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.దీనిని పూర్తిగా నియంత్రించడానికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు.డ్రోన్లు,జీపీఎస్ సహాయంతో ఏవోబీ ప్రాంతంలో పంటలు పండే ప్రాంతాన్ని గుర్తిస్తుస్తున్నామని… గిరిజనుల సహకారంతో పోలీసులు సాగుదారులను కనిపెట్టి గంజాయి పొలాలను ధ్వంసం చేస్తున్నారని అని డీజీపీ తెలిపారు

గంజాయిని బీహార్, అస్సాం, త్రిపుర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మణిపూర్, పశ్చిమ బెంగాల్, జమ్మూ & కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్తో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో సాగు చేస్తున్నారని…AOB ప్రాంతంలో ‘సీలావతి’ రకాన్ని పెంచడానికి నేల, నీరు మరియు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయన్నారు. ఇది వివిధ రాష్ట్రాల నుండి స్మగ్లర్లను ఆకర్షిస్తోందని డీజీపీ తెలిపారు.
గత ఏడాది ఒడిశా పోలీసులు దాదాపు 25 వేల ఎకరాల్లో గంజాయి సాగును ధ్వంసం చేశారని… ప్రస్తుతం జరుగుతున్న ‘ఆపరేషన్ పరివర్తన’లో వారు తమకు పూర్తిగా సహకరిస్తున్నట్లుఎ స్పెషల్ డ్రైవ్ పర్యవేక్షణ అధికారి తెలిపారు. నెల రోజుల ఆపరేషన్లో సమాన స్థాయిలో పంటను నాశనం చేయాలని మేము ప్లాన్ చేస్తున్నామన్నారు.

పోలీసులపై గిరిజనుల దాడి…
గంజాయి తోటలను ధ్వంసం చేయడానికి వెళ్లిన ఎక్సైజ్ పోలీస్ అధికారులపై గిరిజనుల ఎదురు తిరగబడ్డారు.నష్టపరిహారం చెల్లించి తోటలు ధ్వంసం చేయండి అంటూ గిరిజనులు పోలీసులపై విరుచుకుపడ్డారు.జి.మాడుగుల మండలం పంచాయతీ రాసవీధి గ్రామానికి గంజాయి తోటలు ధ్వంసం చేయడానికి వెళ్ళిన అధికారులను గిరిజనులు నిలదీశారు. ఎక్సైజ్ అధికారుల పై దాడికి ప్రయత్నించడంతో ముందుగా గుర్తించిన అధికారులు భయం తో వెనుతిరిగారు. తమ గ్రామాలకు రావద్దని స్థానికులు పోలీసులు, ఎక్సైజ్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు . ఈ క్రమంలో గిరిజనులు పోలీసు సిబ్బంది మధ్య స్వల్ప ఉద్రిక్తత వాతావరణం నెలకొనగా..అక్కడే ఉన్న ద్విచక్ర వాహనాలను స్వల్పంగా ధ్వంసం చేశారు..ఎక్సైజ్ సిబ్బంది అక్కడి నుంచి వెళ్లి పోయే వరకు గిరిజనులు పట్టుపట్టారు…చివరకు చేసేదిలేక ఎక్సైజ్ సిబ్బంది ఎక్కడ నుంచి వెనుదిరిగారు. మంత్రి అవంతి శ్రీనివాస్ ఈరోజు పాడేరు పర్యటన నేపథ్యంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.