ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అండ్ వైసీపీ ప్రభుత్వం పై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపుపై స్పందించిన అచ్చెన్నాయుడు, విద్యుత్తు ఛార్జీలు గతంలో ఎన్నడూ లేని విధంగా పెంచిన ఘనత సీఎంప జగన్‌కే దక్కుతుందని అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు. ఇది జగన్ అసమర్థ పాలనకు నిదర్శనమని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ఇక జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని అచ్చెన్నాయుడు గుర్తు చేశారు.
దీంతో ప్రజలపై ప్రస్తుత విద్యుత్ ఛార్జీల పెంపుదలతో 4,400 కోట్ల భారం పడుతుందని అచ్చెన్నాయుడు అన్నారు. జగన్‌కు పాలన చేతకాకపోతే దిగిపోవాలని సూచించిన అచ్చెన్నాయుడు, రాష్ట్ర ప్రజల నడ్డి విరుస్తూ, సామాన్యుల జేబులకు చిల్లి పెడుతున్నారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు విద్యుత్తు ఛార్జీలు తగ్గిస్తామని చెప్పిన జగన్అ, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత జనంపై వీర బాదుడు బాదుతున్నారని, దీంతో జనాలు బెంబేలెత్తి పోతున్నారని అచ్చెన్నాయుడు ద్వజమెత్తారు.ఇక తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో ఒక్కసారి కూడా విద్యుత్తు ఛార్జీలను పెంచలేదన్న విషయాన్ని అచ్చెన్నాయుడు గుర్తు చేశారు
ఇకపోతే ఏపీలో విద్యుత్ ఛార్జీల పెంచుతూ.. ఎలక్ట్రికల్ కంట్రోల్ కమిషన్ బుధవారం ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పెరిగిన విద్యుత్ ఛార్జీలు ఆగస్టు నుంచి అమలులోకి రానున్నాయని ఎలక్ట్రిక్ కంట్రోల్ కమిషన్ వెల్లడించింది. ఈ నేపధ్యంలో విద్యుత్ వినియోగంలో 30 యూనిట్లకు గానూ 45 పైసలు, 31 నుంచి 75 యూనిట్ల వరకు 95 పైసలు, 76 – 125 మధ్య యూనిట్లకు 1.40, 126 నుంచి 225 యూనిట్ల వరకు 1.57, ఆ తర్వాత 226 – 400 మధ్య యూనిట్ల విద్యుత్ వినియోగానికి 1.16, అదే విధంగా 400 ఆపై యూనిట్ల వినియోగించే వారికి యూనిట్ 55 పైసల చొప్పున పెంచనున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొనిన సంగతి తెలిసిందే.