Lokesh Accreditation: యూట్యూబ్ ఛానెల్స్ విలేకరులకు అక్రిడేషన్‌ : లోకేష్

నంద్యాల నియోజకవర్గంలో నారా లోకేశ్‌ (Nara Lokesh) యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. యాత్రలో భాగంగా న్యాయవాదులు, జర్నలిస్టులు, టీచర్లు, డాక్టర్లు, కాంట్రాక్టర్లు సహా వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు, ప్రజలతో లోకేశ్‌ భేటీ అయ్యారు.

  • Written By:
  • Updated On - May 19, 2023 / 09:23 PM IST

Nara Lokesh : నంద్యాల నియోజకవర్గంలో నారా లోకేశ్‌ (Nara Lokesh) యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. యాత్రలో భాగంగా న్యాయవాదులు, జర్నలిస్టులు, టీచర్లు, డాక్టర్లు, కాంట్రాక్టర్లు సహా వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు, ప్రజలతో లోకేశ్‌ భేటీ అయ్యారు. పలు అంశాలపై వారితో చర్చించిన లోకేశ్‌ అభిప్రాయాలు, సూచనలు తీసుకున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక వివిధ వర్గాల ప్రజల సంక్షేమం కోసం అమలు చేయనున్న అంశాలపై వారితో చర్చించారు. అనంతరం నారా లోకేశ్ (Lokesh) మాట్లాడుతూ ‘‘వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఎందుకు నివాళులర్పించారని అని కొందరు నన్ను అడుగుతున్నారు.

వైఎస్ తీసుకున్న అన్ని నిర్ణయాలతో ఏకీభవించను. కానీ, ఆయన ఏనాడూ రాష్ట్ర పరువు తీసేలా ప్రవర్తించలేదు. వైఎస్‌ జగన్ మాత్రం రాష్ట్రం పరువు తీశారు. టీడీపీ అధినేత చంద్రబాబు తీసుకొచ్చిన ప్రాజెక్టులన్నింటినీ వైఎస్‌ కొనసాగించారు. దక్షిణ భారతదేశ బిహార్‌గా రాష్ట్రాన్ని జగన్‌ మార్చేశారు. ఆఖరికి మీడియా ప్రతినిధులపైనా జగన్ అండ్ కో దాడులకు తెగబడుతున్నారు. ఉపాధ్యాయులను మద్యం షాపుల ముందు నిలబెట్టి అవమానించారు. న్యాయవాదులు, టీచర్లు, డాక్టర్లు, కాంట్రాక్టర్లు ఇలా అందరూ జగన్ బాధితులే. ఈ విషయాలపై ప్రతి ఒక్కరూ ఒకసారి ఆలోచించాలన్నారు.

ఉమ్మడి కర్నూలు జిల్లాలో టీడీపీకి 14 సీట్లు ఇవ్వండి : ఫాక్స్‌కాన్ సంస్థను ఏపీకి తీసుకురావడానికి ఎంతో కష్టపడ్డాం. ఇప్పుడు ఆ సంస్థని జగన్‌ తెలంగాణకు తరిమేశారు. దీని వల్ల లక్ష మంది యువత ఉద్యోగ అవకాశాలు కోల్పోయారు. 2014లో ఉమ్మడి కర్నూలు జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలను మాత్రమే గెలిపించినప్పటికీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. 2019లో క్లీన్ స్వీప్ చేసిన వైకాపా కర్నూలుకు ఏం చేసిందో మీరు ఆలోచించండి. 2024లో తెదేపాకు 14 సీట్లు ఇవ్వండి. కర్నూలుని నంబర్ వన్‌ చేసి చూపిస్తాం. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో హాస్టల్ ఛార్జీలు పెంచడం దారుణం. వైద్య విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీసం మందులు, దూది లేని పరిస్థితి నెలకొంది. జగన్ పాలనలో ఇదయ్యా దుస్థితి. కనీస మౌలిక వసతులు కల్పించడంలో ఈ ప్రభుత్వం విఫలమైంది. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వసతులు కల్పిస్తాం. అవసరమైన డాక్టర్లు, మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

న్యాయవాదుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తెస్తాం : కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తాం అని హామీ ఇచ్చాం. దానికి కట్టుబడి ఉన్నాం. జగన్ మాదిరిగా దొంగ హామీలు ఇచ్చి మోసం చేయం. కోర్టుల్లో కనీస మౌలిక వసతులు లేక న్యాయవాదులు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. తెదేపా హయాంలో కొత్త భవనాల నిర్మాణం కోసం పనులు ప్రారంభించాం. వాటిని వైకాపా ప్రభుత్వం ఆపేసింది. తెదేపా అధికారంలోకి వచ్చిన వెంటనే న్యాయ వ్యవస్థకు అధిక నిధులు కేటాయించి మౌలిక వసతులు, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తాం. న్యాయవాదులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తాం. న్యాయవాదుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకొస్తామన్నారు.*

పింక్ కాలర్ జాబ్స్ ఎక్కువగా కల్పిస్తాం : ఎన్నికల ముందు మెగా డీఎస్సీ అన్న జగన్‌ ఆ హామీ మర్చిపోయారు. రూ.లక్షలు ఖర్చు చేసి ట్రైనింగ్ తీసుకొని నోటిఫికేషన్ రాక ఇబ్బంది పడుతున్న ఎంతో మంది యువకులు రాష్ట్రంలో ఉన్నారు. తెదేపా హయాంలో డీఎస్సీని క్రమం తప్పకుండా నిర్వహించాం. తెదేపా అధికారంలోకి వచ్చిన వెంటనే పెండింగ్ పోస్టులన్నీ భర్తీ చేస్తాం. ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు, స్వయం ఉపాధి ద్వారా నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తాం.

రాయలసీమను మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా మార్చాలని తెదేపా ప్రణాళిక సిద్ధం చేసింది. ఆటోమొబైల్స్‌, ఎలక్ట్రానిక్స్ కంపెనీలు పెద్ద ఎత్తున ఏపీకి తెచ్చింది చంద్రబాబు. ఈ రెండు రంగాలను ప్రోత్సహిస్తేనే ఇంజినీరింగ్‌ విభాగంలోని ఇతర ఎలక్ట్రికల్, మెకానికల్ కోర్సులు చేసిన వారికి మంచి అవకాశాలు ఉంటాయి. తెదేపా అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఎక్కువ ఉద్యోగ అవకాశాలు (పింక్ కాలర్ జాబ్స్) కల్పిస్తామన్నారు.

యూట్యూబ్ ఛానెల్స్ వారికి అక్రిడేషన్‌ సౌకర్యం : జర్నలిస్టులను కూడా వైసీపీ ప్రభుత్వం అనేక విధాలుగా వేధిస్తోంది. ఏవేవో జీవోలు తీసుకొచ్చి జర్నలిస్టులను ఇబ్బంది పెడుతున్నారు. వేదింపులకు గురి చేయడమే కాకుండా అరెస్టులు చేస్తున్నారు. జర్నలిస్టులను ఇబ్బంది పెట్టే విధంగా తీసుకొచ్చిన జీవోలను రద్దు చేస్తాం. ఇళ్ల గురించి అడిగితే సజ్జల జర్నలిస్టులపై దాడి చేశారు. ఆఖరికి అక్రిడేషన్ కార్డులు కూడా రద్దు చేశారు.

టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు, టిడ్కో ఇళ్లు ఇస్తాం. ప్రస్తుతం యూట్యూబ్ ఛానెల్స్ కూడా చాలా పాపులర్ అయ్యాయి. వాటికి కొన్ని నిబంధనలు, షరతులు పెట్టి వారికి కూడా అక్రిడేషన్ సౌకర్యం కల్పిస్తామని లోకేశ్‌ (Nara Lokesh) హామీ ఇచ్చారు.

Also Read:  Lady Singham: ‘లేడీ సింగం’ ను హత్య చేశారా?