Site icon HashtagU Telugu

ACB : ఏసీబీకి అడ్డంగా బుక్కైన మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్‌.. సెల‌వు రోజుల్లో కూడా..?

Sullurupet Imresizer

Sullurupet Imresizer

రాష్ట్రవ్యాప్త సాధారణ తనిఖీల్లో భాగంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. మున్సిప‌ల్ కార్యాల‌యానికి ఏసీబీ అధికారులు సడన్ గా ఎంట్రీ ఇచ్చారు. దీంతో మున్సిపల్ కమిషనర్ హడావిడి పడ్డాడు. తన దగ్గర ఉన్న డబ్బుల కట్టల్ని కిటికీనుంచి బయటపడేశాడు. మొక్కల్లో సంచి పడిపోయింది కదా తనను పట్టించుకోరని అనుకున్న మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్‌కి ఏసీబీ అధికారులు షాక్ ఇచ్చారు. మొక్క‌ల్లో ఉన్న సంచిని ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సంచిలో ఉన్న 1.13 లక్షల రూపాయలను సీజ్ చేయ‌గా… కమిషనర్ కారులోని డ్యాష్ బోర్డ్ లో మరో 50 వేల రూపాయలు దొరికాయి. క‌మీష‌న‌ర్ బీరువాలో మరో 30 వేల రూపాయలు కూడా దొరికాయి. మొత్తం లక్షా 93 వేల రూపాయలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ వ్య‌వ‌హారం అంతా చూస్తే ఏసీబీ అధికారులు పక్కా సమాచారంతోనే మున్సిపల్ ఆఫీస్ కి వెళ్లారని తెలుస్తోంది. పంచాయతీ సెక్రటరీగా ఉంటూ ప్రమోషన్ మీద మున్సిపల్ కమిషనర్ అయిన‌ నాగిశెట్టి నరేంద్రకుమార్ లంచం తీసుకుంటూ ఏసీబీ కి అడ్డంగా దొరికిపోయాడు. గతంలో ఆయన వెంకటగిరి మున్సిపల్ కమిషనర్ గా ఉన్నారు. ఆ తర్వాత సూళ్లూరుపేట బదిలీపై వచ్చారు. బుధవారం ఉదయాన్నే ఏసీబీ అధికారులు సూళ్లూరుపేట మున్సిపల్ ఆఫీస్ లో తనిఖీలు చేపట్టారు. ఉదయం 11.30 గంటలకు నెల్లూరు ఏసీబీ డీఎస్పీ జీఆర్‌ఆర్‌ మోహన్‌ ఆధ్వర్యంలో టీమ్ సూళ్లూరుపేట చేరుకుంది. మున్సిపల్ ఉద్యోగులను లోపల ఉంచి తలుపులు వేసి సోదాలు మొదలు పెట్టారు. కమిషనర్‌ నాగిశెట్టి నరేంద్రకుమార్‌ ఛాంబర్‌ లో పక్కనే కిటికీ ఉంది. ఏసీ ఉంటుంది కాబట్టి సహజంగా ఆ కిటికీ మూసేస్తారు. కానీ అధికారులు ఎంట్రీ ఇచ్చే సమయానికి కిటికీ తెరిచి ఉంది. దీంతో వారికి అనుమానం వచ్చింది. బయట కిటికీ దగ్గరకు వెళ్లి చూసే సరికి సంచిలో రూ.1.13 లక్షల నగదు ఉంది. దీంతోపాటు మరికొంత నగదుని కూడా ఏసీబీ స్వాధీనం చేసుకుంది. రాత్రి పొద్దుపోయే వరకు ఏసీబీ బృందం సోదాలు చేసింది. అప్పటి వరకూ బయటకు అధికారిక సమాచారం రాలేదు. ఆ తర్వాత అధికారికంగా ఎంత నగదు స్వాధీనం చేసుకున్నారనే విషయాన్ని తెలిపారు ఏసీబీ సిబ్బంది.

సూళ్లూరుపేట మున్సిపాల్టీ పరిధిలో ఎలాంటి అనుమతులు లేకుండా 110 ఇళ్ల నిర్మాణాలు జరిగాయని, 50 ఇళ్ల నిర్మాణాలు అనుమతులకు విరుద్ధంగా జరిగాయని అధికారులు గుర్తించారు. కమిషనర్‌ నరేంద్రకుమార్‌ సాధారణ పనిదినాల్లో రోజూ రాత్రి 8 గంటలకు వరకు ఆఫీస్ లోనే ఉంటారని, సెలవు రోజుల్లోనూ కష్టపడి పడనిచేస్తుంటారని సిబ్బంది చెబుతున్నారు. సెలవు రోజుల్లో కూడా ఇంత కష్టపడి పనిచేయడంపై స్థానికులకు అనుమానం వచ్చింది. నలుగురు వ్యక్తులు ఏసీబీకి ఫిర్యాదు చేయడంతో.. ఈ వ్యవహారం బయటపడింది.

Exit mobile version