Site icon HashtagU Telugu

AP Waqf Board Chairman: వక్ఫ్‌ బోర్డు ఛైర్మన్‌గా అబ్దుల్‌ అజీజ్‌ పదవి స్వీకరణ..

Ap Waqf Board Chairman Abdul Aziz

Ap Waqf Board Chairman Abdul Aziz

AP Waqf Board Chairman: టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీనియర్ నేత అబ్దుల్ అజీజ్‌కు కీలకమైన పదవి ఇచ్చారు. ఎన్నికల్లో టికెట్‌ రాకపోయినా, ఆయనకు ప్రాముఖ్యమైన పదవి లభించింది, ఈ బాధ్యతను ఆయన స్వీకరించారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డు సభ్యులను నియమించిన విషయం తెలిసిందే. ఇందులో 8 కొత్త సభ్యులను చేర్చడమే కాక, గత ప్రభుత్వంలో ఎన్నికైన ఇద్దరిని కూడా కొనసాగించారు.

ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం, వక్ఫ్ బోర్డు కొత్త ఛైర్మన్‌గా టీడీపీ సీనియర్ నేత అబ్దుల్ అజీజ్‌ను నియమించారు. అబ్దుల్ అజీజ్, నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి టికెట్‌ ఆశించారు, కానీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీ అభ్యర్థిగా టికెట్ పొందారు. ఈ నేపథ్యంలో, అజీజ్ పార్టీ కోసం ఈ ఎన్నికలలో పని చేశారు, అందుకే చంద్రబాబు నాయుడు ఆయనకు వక్ఫ్ బోర్డు ఛైర్మన్‌గా కీలక బాధ్యతలు అప్పగించారు.

అబ్దుల్ అజిజ్

విజయవాడలోని వక్ఫ్ బోర్డు కార్యాలయంలో అబ్దుల్ అజీజ్ తన బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో వక్ఫ్ బోర్డు సభ్యులు అందరూ హాజరుకాగ, ఎమ్మెల్సీ రుహుల్లా హాజరుకాలేదు. వక్ఫ్ బోర్డు ఛైర్మన్‌గా ఆయన ఎన్నిక ఏకగ్రీవంగా జరిగిందని అబ్దుల్ అజీజ్ సభ్యుల సమక్షంలో ప్రకటించారు.

అజీజ్ మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా వక్ఫ్ బోర్డు ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా వాటిని కాపాడుతామని తెలిపారు. ఈ క్రమంలో రాష్ట్రంలో వక్ఫ్ భూములలో 21,594 ఎకరాలు అన్యాక్రాంతం అయినట్లు వెల్లడించారు. ఈ భూములను చట్టం ప్రకారం స్వాధీనం చేసుకోవడం తమ ప్రాధాన్యత అని చెప్పారు.

అజీజ్, గత ప్రభుత్వంలో వక్ఫ్ బోర్డులో సభ్యులుగా ఉన్న ఎమ్మెల్సీ రుహుల్లా, ఖాజాలాను కూటమి ప్రభుత్వం కొనసాగించడాన్ని గుర్తుచేశారు. ఈ విషయం ఆధారంగా, కొత్త బోర్డు కాదు, గతంలోని రెండు సభ్యులను కొనసాగిస్తూ, మరో 8 మందిని సభ్యులుగా నియమించినట్టు తెలిపారు. తాను ఇప్పుడు వక్ఫ్ బోర్డు ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించానని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్‌లో మైనార్టీ సంక్షేమానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలోని తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ తెలిపారు. రాష్ట్రంలో వక్ఫ్‌బోర్డు ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు, నిబంధనల ప్రకారం వక్ఫ్ బోర్డు ఏర్పాటును పూర్తి చేసినట్టు వెల్లడించారు. వక్ఫ్ భూములను పరిరక్షించుకుంటూ, అన్యాక్రాంతమైన వక్ఫ్ భూములను స్వాధీనం చేసుకోవడం తమ ప్రాధాన్యత అని చెప్పారు.

గత ప్రభుత్వం వక్ఫ్ బోర్డు సభ్యుల నియామకంపై ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, కోర్టు వక్ఫ్ బోర్డు ఛైర్మన్ ఎంపిక ప్రక్రియపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసి, ఆ ప్రక్రియను నిలిపివేసింది. దీంతో వక్ఫ్ బోర్డు వ్యవహారంలో గందరగోళం ఏర్పడింది. అయితే, కూటమి ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించడంపై దృష్టి పెట్టిందని చెప్పారు.

గత ప్రభుత్వం ఇచ్చిన జీవో-47ను రద్దు చేసి, తాజాగా జీవో 75ను జారీ చేశామని, ఈ ప్రక్రియలో గత బోర్డు సభ్యులలో ఇద్దరిని కొనసాగించి, నూతనంగా నామినేటెడ్ సభ్యులను నియమించినట్లు తెలిపారు. అయితే ఈ బోర్డు సభ్యుల తొలి సమావేశంలో అబ్దుల్‌ అజీజ్‌ను వక్ఫ్‌ బోర్డు నూతన ఛైర్మన్‌గా ఎన్నుకోగా.. ఆయన బాధ్యతలు స్వీకరించారు.