Abandonment of ‘CPS’: జగన్ కు పంజాబ్ దెబ్బ

సీపీఎస్ రద్దు ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి మెడకు చుట్టుకుంటుంది. దేశ వ్యాప్తంగా నాలుగు రాష్ట్రాల్లో సీపీఎస్ రద్దు అంశాన్ని ఉద్యోగులు బయటకు తీస్తున్నారు.

  • Written By:
  • Updated On - October 22, 2022 / 02:13 PM IST

సీపీఎస్ రద్దు ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి మెడకు చుట్టుకుంటుంది. దేశ వ్యాప్తంగా నాలుగు రాష్ట్రాల్లో సీపీఎస్ రద్దు అంశాన్ని ఉద్యోగులు బయటకు తీస్తున్నారు. కేంద్రం నిర్ణయంతో సంబంధం లేకుండా రద్దు ను అమలు చేయాలని కోరుతున్నారు.నాలుగు రాష్ట్రాల్లో సీపీఎస్ రద్దు చేయడం తో ఏపీలోనూ సీపీఎస్ రద్దు కోసం ఉద్యమిస్తున్న ఉద్యోగసంఘాలకు ఊపునిస్తోంది. ప్రభుత్వంపై ఒత్తిడి మరింత పెరగబోతోంది. సీపీఎస్ రద్దు కాకపోతే మాత్రం వచ్చే ఎన్నికల్లో ఉద్యోగుల ఓట్లు కోల్పోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇంకేదైనా ప్రత్యామ్నాయానికి మొగ్గు చూపుతారా? లేక ఉద్యోగుల ఓటు బ్యాంకును దృష్టిలో ఉంచుకుని సీపీఎస్ రద్దుకు సిద్దమవుతుందా ? అనేది జగన్ కు సవాల్ గా మారింది

ఇప్పటికే జార్ఖండ్, ఛత్తీస్ ఘడ్, రాజస్తాన్  రాష్ట్రాల్లో సీపీఎస్ ను ప్రభుత్వాలు ఇప్పటికే రద్దు చేయడం గమనార్హం. ఇప్పుడు పంజాబ్ కూడా అదే బాట పట్టింది. ఉద్యోగుల కోరిక మేరకు సీపీఎస్ ను రద్దు చేస్తూ పంజాబ్ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు త్వరలో వెలువడనున్నాయి. ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు ఇచ్చిన హామీల్లో ఉద్యోగుల సీపీఎస్ రద్దు కూడా ఒకటి. అధికారంలోకి వస్తే వారం రోజుల్లోనే దీన్ని రద్దు చేస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. నాలుగేళ్లు కావస్తున్నా ఇది అమలుకాలేదు. దీంతో ఉద్యోగులు తమ పోరు ముమ్మరం చేస్తున్నారు. అయితే పోలీసులతో వారిని అణచివేస్తున్న తరుణంలో వైసీపీ సర్కార్ కు పంజాబ్ లో ఆప్ సర్కార్ రూపంలో మరో షాక్ తగిలింది.

కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రాల్లో అమలు చేస్తున్న ఉద్యోగుల కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్)ను రద్దు చేయాలంటూ కొంతకాలంగా ఆందోళన జరుగుతుంది. దీన్ని ఎత్తేస్తే ఆ భారాన్ని  మోయాల్సి ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రావడం లేదు. కొన్ని రాష్ట్రాల్లో తాము అధికారంలోకి వస్తే సీపీఎస్ రద్దు చేస్తామని రాజకీయ పార్టీలు హామీలిచ్చి అధికారంలోకి వచ్చాయి. మరికొన్ని రాష్ట్రాల్లో హామీ ఇవ్వకపోయినా ఉద్యోగుల ఆందోళన నేపథ్యంలో సీపీఎస్ రద్దు చేశాయి. దీంతో ఈ వ్యవహారం వైసీపీ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతోంది.

వైఎస్ జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చేసిన పాదయాత్రలో అధికారమిస్తే వారం రోజుల్లోనే ఉద్యోగుల సీపీఎస్ రద్దు చేస్తానని హామీ ఇచ్చారు. ఆ హామీ ఇప్పటికీ అమలు కాకపోవడంతో  ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. అయితే ప్రభుత్వం మాత్రం హామీ లోతు తెలియక ఇచ్చేస్తామని లెంపలువేసుకుంది .  అయినప్పటికీ ఉద్యోగులు మాత్రం పట్టు వీడటం లేదు. ఈ నేపథ్యంలో వారిని బుజ్జగించేందుకు జీపీఎస్ పేరుతో మరో పథకం అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నించినా వారు ఒప్పుకోలేదు. తమకు పాత పెన్షన్ పథకం వర్తింపజేయాలని పట్టుబడుతున్నారు. దీంతో ప్రభుత్వం ఇరుకునపడుతోంది. ఇప్పుడు తాజాగా పంజాబ్ కూడా సీపీఎస్ రద్దు చేయడానికి సిద్ధం కావడం తో ఏపీ సర్కార్ మీద ఒత్తిడి పెరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో జగన్ ఏమి చేస్తాడో చూడాలి.