Site icon HashtagU Telugu

Pegasus Spyware Issue: షోకాజ్ నోటీస్ పై.. ఏబీ రిప్లై ఇదే..!

Ab Venkateswara Rao Show Cause Notice

Ab Venkateswara Rao Show Cause Notice

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌కంప‌నులు రేపిన పెగాస‌స్ స్పైవేర్ ఇష్యూ పై ఇటీవ‌ల మీడియా ముందుకు వ‌చ్చిన ఏపీ మాజీ ఇంట‌లిజెన్స్ ఛీఫ్ ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు కీల‌క వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. దీంతో ఏప్రిల్ 5వ తేదీన మంగ‌ళ‌వారం ఏపీ ప్ర‌భుత్వం ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావుకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ క్ర‌మంలో ఏపీ ఛీఫ్ సెక్ర‌ట‌రీ ఇచ్చిన షోకాజ్ నోటీసుపై ఈరోజు ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు ఘాటుగా స్పందించారు.

వ్యక్తిత్వ దూషణలు, ఆరోపణలపై స్పందించే అవకాశం త‌న‌కు ఆలిండియా సర్వీస్‌ రూల్స్‌ కల్పించాయని వివ‌ర‌ణ‌లో పేర్కొన్నారు. తనకు ఇచ్చిన నోటీసులోనే పేర్కొన్న రూల్‌ 17 నియమానికి అనుగుణంగా, తాను మీడియాతో మాట్లాడినట్లు ఏబీ వెల్లడించారు. ఏపీలో గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో తాను ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా ఉన్న స‌మ‌యంలో పెగాసస్‌ సాఫ్ట్‌వేర్‌ వినియోగించలేదని మాత్రమే చెప్పానని.. ఆలిండియా సర్వీస్‌ రూల్స్‌ 6 ప్రకారం.. అధికారిక అంశాలపై స్పష్టత ఇచ్చే అవకాశం క‌ల్పించార‌ని ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు స్ప‌ష్ట‌త ఇచ్చారు.

ఇక తన గౌరవానికి భంగం కలిగించేలా ఎవ‌రు విమర్శలు చేసినా, రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం తాను స్పందించడం ప్రాధమిక హక్కు అని ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు పేర్కొన్నారు. ముఖ్యంగా తాను మీడియా సమావేశం పెడుతున్నట్లు ముందుగానే ప్రభుత్వానికి తెలిపానని, ఈ క్ర‌మంలో వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి చేసిన ట్వీట్ పై కూడా స్పందించాన‌ని ఏబీ వెంకటేశ్వరరావు తన వివరణలో పేర్కొన్నారు. చివ‌రిగా రూల్‌ నెంబర్‌-3 ప్రకారం అధికారులు పాదర్శకంగా, జవాబుదారీతనంగా ఉండాల‌నేదే త‌న ఉద్దేశ‌మ‌ని, మీడియా సమావేశంలో భాగంగా తాను ఏపీ ప్రభుత్వాన్ని ఎక్కడా విమర్శించలేదని ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు తేల్చి చెప్పారు. మ‌రి ఏబీ వివ‌ర‌ణ‌పై ఏపీ స‌ర్కార్ రియాక్ష‌న్ ఎలా ఉంటుందో చూడాలి.

Exit mobile version