Site icon HashtagU Telugu

Web Option System: పారదర్శక వెబ్ ఆప్షన్ విధానంతోనే టీచర్లకు మేలు!

Web Option System

Web Option System

Web Option System: అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో మానవప్రమేయం లేకుండా పూర్తి పారదర్శకంగా ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించగా, కొందరు వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఈ విధానంపై తప్పుడు ప్రచారానికి దిగి టీచర్లను గందరగోళానికి గురిచేస్తున్నారు. వెబ్ ఆప్షన్ (Web Option System) విధానంలో ఎటువంటి రాజకీయ జోక్యం, పైరవీలకు తావు ఉండదు. ఉపాధ్యాయుల సర్వీసు ఆధారంగా మాత్రమే వారి బదిలీలు, పదోన్నతులు ఉంటాయి. ఈ విషయంలో ఎటువంటి వదంతులను నమ్మవద్దని పాఠశాల విద్యాశాఖ విజ్ఞప్తి చేస్తోంది.

ఆంధ్రప్రదేశ్ చరిత్రలో తొలిసారిగా 4,853 ప్రమోషన్లు ఆన్లైన్ ద్వారా ఎటువంటి రాజకీయ జోక్యానికి తావులేకుండా ప్రభుత్వం పూర్తిచేసింది. రాష్ట్రంలో కొత్తప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ఏడాది మరింత పారదర్శకంగా ఉండేందుకు ఉపాధ్యాయ సంఘాలతో పలుమార్లు సంప్రదింపులు జరిపాక Teacher Transfers Act అమలులోకి తెచ్చింది. ఇందులో అన్ని బదిలీలను ఆన్లైన్ ద్వారా మాత్రమే చేయాలని నిబంధనగా పెట్టారు. 2025 మే 21 నుండి జూన్ 10 వరకు బదిలీ షెడ్యూల్ ఖరారు చేశారు. దీనిద్వారా ఇప్పటివరకు 35,235 బదిలీలు పూర్తయ్యాయి.

Also Read: BJP National President: బీజేపీ జాతీయ కొత్త అధ్య‌క్షులు ఎవ‌రు? రేసులో ముగ్గురు దిగ్గ‌జాలు!

2025లో అమలైన కొత్త సాంకేతికతలు

ఈ ఏడాది ఆన్ లైన్ బదిలీల ప్రక్రియలో టీచర్లకు పలు వెసలుబాట్లు కల్పించారు. మండల కేంద్రం నుంచి స్కూళ్లను దూరం ఆధారంగా చూపించారు. దీనివల్ల టీచర్లకు దగ్గర స్కూల్ ఎంచుకునే అవకాశం కలిగింది. 150-200 స్కూల్స్ ఉండే క్లస్టర్లలో ఖాళీలను ఎంచుకునే సౌలభ్యం కల్పించారు. ఎన్ని సార్లైనా ఎంపికలను సేవ్ చేసుకునే అవకాశం కల్పించారు. బలవంతపు బదిలీ అయిన వారు మాత్రం ఖచ్చితంగా కన్ఫర్మ్ చేయాలి. వెబ్ ఆప్షన్ వాడకం విధానం వివరించే వీడియో అందుబాటులో ఉంచారు. టీచర్లకు అన్ని స్థాయిలలో సహాయక కేంద్రాలు ఏర్పాటు చేశారు.

మ్యాన్యువల్ కౌన్సిలింగ్ లో అన్నీ ఇబ్బందులే

మ్యాన్యువల్ కౌన్సెలింగ్ లో ప్రధానంగా కొత్తగా వచ్చే ఖాళీలు తక్షణమే చూపించకపోవడం వల్ల సీనియర్ టీచర్లు అవకాశం కోల్పోతారు. దీనివల్ల వారికి అన్యాయం జరుగుతుంది. మ్యాన్యువల్ కౌన్సెలింగ్ లో రోజుకు 400-500 మందిని మాత్రమే కౌన్సిలింగ్ కు అవకాశం ఉంటుంది. ఫలితంగా షెడ్యూల్‌లోగా బదిలీలు, పదోన్నతులు పూర్తిచేయడం కష్టంగా మారుతుంది. మహిళలు, వృద్ధులు, ఆరోగ్య సమస్యలతో ఉన్న టీచర్లకు సుదూర ప్రాంతాల నుంచి కౌన్సిలింగ్ సెంటర్ల వద్ద పడిగాపులు కాయాల్సి ఉంటుంది. ఇది ఏరకంగానూ ఉపాధ్యాయులకు ప్రయోజనకరం కాదు.

2015లోనే ఆన్ లైన్ విధానానికి శ్రీకారం

1998 ముందు జిల్లాపరిషత్, మండలపరిషత్ పాఠశాలల్లో టీచర్ల బదిలీలను జిల్లాపరిషత్ చైర్మన్లు, ప్రభుత్వ పాఠశాలల్లో బదిలీలను జిల్లా విద్యాశాఖాధికారులు (DEOs) నిర్వహించేవారు. ఆ తర్వాత మండల, జిల్లాపరిషత్ టీచర్ల బదిలీల బాధ్యతను DEOల అధీనంలోకి తీసుకొచ్చారు. అదే ఏడాదిలో బదిలీలకు కౌన్సెలింగ్ వ్యవస్థ ప్రారంభమై, 2014 వరకు కొనసాగింది. అయితే మ్యాన్యువల్ కౌన్సెలింగ్‌లో రాజకీయ జోక్యంతోపాటు ఎక్కువ శ్రమ, సమయం, వనరుల వృథా జరుగుతుంది. ఈ సమస్యలను అధిగమించేందుకు 2015లో వెబ్ ఆధారిత కౌన్సెలింగ్ వ్యవస్థను ప్రవేశపెట్టారు. ఇది కౌన్సిలింగ్ వ్యవస్థలో పారదర్శకత, నమ్మకాన్ని తీసుకువచ్చింది. అదేవిధానాన్ని గత ప్రభుత్వం కూడా కొనసాగించింది. 2021లో సుమారు 38,000 బదిలీలు, 2023లో సుమారు 44,000 బదిలీలు ఆన్లైన్ ద్వారా జరిగాయి.