Snake Catcher : సర్పాల స్నేహితుడు ఈ భాస్కర్ నాయుడు!

తిరుమల పేరు చెప్పగానే నిత్యం గోవింద న్మామ స్మరణ మార్మోగుతోంది. అక్కడి చెట్టు, పుట్ట ప్రతిదీ ఆధ్యాత్మికతను పులుముకొని ఉంటాయి. అయితే తిరుమల క్షేత్రం ఏడుకొండలుగా ఎలా ప్రసిద్ధి చెందిందో.. దట్టమైన అడవుల నిలయంగానూ పేరొందింది.

  • Written By:
  • Updated On - December 16, 2021 / 03:03 PM IST

తిరుమల పేరు చెప్పగానే నిత్యం గోవింద న్మామ స్మరణ మార్మోగుతోంది. అక్కడి చెట్టు, పుట్ట ప్రతిదీ ఆధ్యాత్మికతను పులుముకొని ఉంటాయి. అయితే తిరుమల క్షేత్రం ఏడుకొండలుగా ఎలా ప్రసిద్ధి చెందిందో.. దట్టమైన అడవుల నిలయంగానూ పేరొందింది. వెంకన్న దర్శనం కోసం వేలాది మంది భక్తులు తిరుమల వస్తుంటారు. అక్కడ గోవింద నామ స్మరణలతో పాటు ‘‘పాములు బాబోయ్ పాములు’’ అరుపులు, కేకలు కూడా వినిపిస్తుంటాయి. అలాంటి సమయంలోనే నేనున్నా అంటూ ప్రత్యక్ష మవుతాడు టీటీడీ రిటైర్డ్ ఉద్యోగి భాస్కర్ నాయుడు.

ఎలాంటి పామునైనా సరే చాలా ఈజీగా పట్టేస్తాడు. అలా పట్టేసిన పాములకు ఏమాత్రం హానిచేయడు. వాటిని సురక్షితంగా అడవుల్లో వదిలిపెడతాడు. తిరుమల క్షేత్రానికి వచ్చే భక్తులు పద్మావతి కాంప్లెక్స్, వీఐపీ గదులు, గణపతి కాంప్లెక్స్ లలో బస చేస్తుంటారు. సహజంగా చెట్లు ఎక్కువగా ఉండటంతో పాములు హల్ చల్ చేస్తుంటాయి. ఒక్కోసారి కాంప్లెక్స్ లోకి వచ్చేస్తుంటాయి. జెర్రిపోతు, నాగుపాములు, కొండచిలువలు సైతం ఉంటాయి. అయితే ఎక్కడ ఏ పాము కనిపించినా వెంటనే భాస్కర్ నాయుడికి ఫోన్ కాల్ వెళ్తుంది. వాటిని చాకచాక్యంగా పట్టుకొని అడవుల్లో క్షేమంగా వదలిపెడుతుంటాడు. ఇప్పటికే వందలాది పాములను భాస్కర్ నాయుడు పట్టుకొని అడవుల్లో వదలిపెట్టాడు. అందుకే భాస్కర్ నాయుడికి సర్పాల స్నేహితుడిగా పేరుంది.

కొన్ని సంఘటనలు

అలిపిరి – తిరుమల నడకమార్గంలో శుక్రవారం నాగుపాము కలకలం రేపింది. అలిపిరి మెట్లదారిలోని 3400 మెట్టు వద్ద  ఓ పే..ద్ద నాగుపాము వచ్చినట్లు భక్తులు  చెప్పడంతో భాస్కర్ నాయుడు వెంటనే అక్కడికి చేరుకున్నారు. బుసలు కొడుతున్న ఆ పామును చాకచక్యంగా పట్టుకుని అవ్వాచారికోనలో  వదిలేశారు.

స్థానిక నరసింహస్వామి ఆలయం దగ్గర్లో ఉన్న ఓ షాపులో ఆ భారీ నాగు పాము కనిపించింది. భక్తులతో పాటు షాపు ఓనర్ అదిరిపడ్డారు. పాము అనగానే సహజంగానే అందరిలోనూ ఒకింత భయం ఉంటుంది. పైగా దుకాణం నుంచి బయటకు రావడంతో అందరూ భయపడిపోయారు. వెంటనే భాస్కర్ నాగుపామును గుర్తించి జాగ్రత్తగా అడవిలో వదిలేశాడు.

వీఐపీలు బస చేసే పద్మావతి ఏరియాలోని పాండవ అతిథిగృహం ముందుకు పాము రావడాన్ని గుర్తించిన అక్కడి సిబ్బంది, భక్తులు భయంతో పరుగులు తీశారు. వెంటనే సెక్యూరిటీ సిబ్బంది ద్వారా టీటీడీ ఉద్యోగి, పాములు పట్టే భాస్కర్‌ నాయుడికి సమాచారమిచ్చారు. వెంటనే భాస్కర్‌ నాయుడు చేరుకుని తన వద్దనున్న పరికరాలతో చాకచక్యంగా జెర్రిపోతును పట్టుకున్నాడు. దాంతో అక్కడి వారు ఊపిరిపీల్చుకున్నారు.