Site icon HashtagU Telugu

AP : ఏపీని ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు పటిష్ఠ ప్రణాళిక: సీఎం చంద్రబాబు

CM Chandrababu

CM Chandrababu

AP :  ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి కేంద్రబిందువుగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన దిశలో ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. విశాఖపట్నంలో నిర్వహించిన ఇండియా ఫుడ్ మాన్యుఫాక్చరింగ్ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన, ఈ రంగంలో రాష్ట్రానికి ఉన్న విస్తృత అవకాశాలపై మాట్లాడారు. రాబోయే ఐదేళ్లలో ఈ రంగంలో రూ. లక్ష కోట్లు మేర పెట్టుబడులను రాష్ట్రంలోకి రప్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వెల్లడించారు. ఇప్పటికే దేశ ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో 9 శాతం వాటాతో 50 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువను ఆంధ్రప్రదేశ్ కలిగి ఉందని చంద్రబాబు గుర్తుచేశారు.

Read Also: Subhas Chandra Bose : నేతాజీ అస్థికలు భారతదేశానికి రప్పించండి..ప్రధాని మోడీకి అనితా బోస్ భావోద్వేగ విజ్ఞప్తి

రాష్ట్ర జీఎస్‌డీపీలో వ్యవసాయ మరియు అనుబంధ రంగాల వాటా 35 శాతంగా ఉందని పేర్కొంటూ, ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తోందని అన్నారు. ఇప్పటికే ‘ఫ్రూట్ కేపిటల్ ఆఫ్ ఇండియా’గా పేరుగాంచిన ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు దేశానికి ‘ఆక్వా హబ్’గా కూడా మారిపోతోందని ఆయన తెలిపారు. పెట్టుబడులకు అనువైన వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వం “ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 4.0″ను తీసుకొచ్చిందని వెల్లడించారు. రూ. 200 కోట్లకు పైబడే పెట్టుబడులను ‘మెగా ప్రాజెక్టులు’గా గుర్తించి, ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించనున్నట్లు వివరించారు. రాష్ట్రంలోని ప్రతీ నియోజకవర్గంలో పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేసి, అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టినట్టు చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో 9 ఇంటిగ్రేటెడ్ ఫుడ్ పార్కులు, 17 లక్షల మెట్రిక్ టన్నుల కోల్డ్ స్టోరేజ్ సామర్థ్యం కలగలిపి ఉన్నాయని తెలిపారు. ఇవి రైతులకు మద్దతుగా నిలుస్తాయని, వ్యవసాయ దిగుబడుల విలువ పెరిగేలా చేస్తాయని పేర్కొన్నారు.

కేవలం పెట్టుబడులే కాదు, ఆవిష్కరణలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని సీఎం స్పష్టం చేశారు. అగ్రిటెక్ రంగంలో బిల్ గేట్స్ ఫౌండేషన్‌తో భాగస్వామ్యంగా, ఆవిష్కరణల కోసం రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌తో కలిసి పనిచేయనున్నట్లు తెలిపారు. “వన్ ఫ్యామిలీ వన్ ఎంట్రప్రెన్యూర్” కార్యక్రమం ద్వారా యువత పారిశ్రామిక రంగంలోకి అడుగుపెట్టి కొత్త ఆవిష్కరణలకు దారితీయాలని సీఎం పిలుపునిచ్చారు. పెట్టుబడులకు ఇదే సరైన సమయం అని, కేంద్ర ప్రభుత్వం సహకారం మరింతగా అందిస్తోందని ఆయన భరోసా ఇచ్చారు. ప్రపంచ స్థాయి ఫుడ్ బ్రాండ్లను భారత్ నుంచి తయారు చేయడం ద్వారా ఆహార ప్రాసెసింగ్ రంగంలో దేశానికి ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలన్నదే తన లక్ష్యమని చంద్రబాబు తెలిపారు. మారుతున్న ఆహారపు అలవాట్లకు అనుగుణంగా నూతన ఉత్పత్తులు అభివృద్ధి చేయాలని సూచించారు. వ్యవసాయాన్ని లాభదాయకంగా, సుస్థిరంగా మార్చడమే తన ధ్యేయమని పునరుద్ఘాటించిన సీఎం, త్వరలో అమరావతిలో ట్రేడ్ ప్రమోషన్ కౌన్సిల్ ఏపీ చాప్టర్, రాష్ట్రానికి అంతర్జాతీయ పెట్టుబడుల పరంగా కొత్త దారులు తెరవనుందని పేర్కొన్నారు.

Read Also: RIL AGM 2025 : రిలయన్స్ జియో కొత్త ఆవిష్కరణలు

Exit mobile version