Snake Attack: 45 రోజుల్లో ఆరు సార్లు కాటేసిన పాము.. ఆ కుటుంబంపై పగబట్టిన సర్పం!

  • Written By:
  • Updated On - March 14, 2022 / 10:07 AM IST

పాముకు ఏదైనా హాని చేస్తే.. అది పగబడుతుందని ఎప్పటికైనా కాటేసి తీరుతుందని చాలా మంది నమ్ముతారు. కొన్ని సంఘటనలు చూసినప్పుడు ఇదే నిజమేనేమో అనిపిస్తుంది. సినిమాల్లో ఇలాంటి సన్నివేశాలు చూసి నిజమే అని నమ్మినవాళ్లూ ఉన్నారు. చిత్తూరు జిల్లాలో ఆ కుటుంబం గురించి వింటే మీరే ఆశ్చర్యపోతారు. ఎందుకంటే.. కేవలం నెలన్నర వ్యవధిలో… అంటే 45 రోజుల్లో ఓ కుటుంబం ఆరుసార్లు పాముకాటుకు గురైంది. దీంతో ఆ కుటుంబం పై పాము పగబట్టిందనే ప్రచారం ఆ గ్రామంలో పెరిగింది. దీంతో ప్రజలంతా తమకు కూడా ఏమవుతుందో అనే ఆందోళనలో ఉన్నారు.

చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి మండలంలో ఉంది దోర్నకంబాల పంచాయతి. దాని పరిధిలో ఉన్న మల్లయ్యపల్లిలో ఆదిఆంధ్రవాడ లో నివసిస్తున్న వెంకటేష్ కుటుంబంపై ఆ పాము పగబట్టిందంటున్నారు. వీరి కుటుంబంలో వెంకటేష్ తో పాటు ఆయన భార్య వెంకటమ్మ, వాళ్ల కొడుకు జగదీష్, వెంకటేష్ తండ్రి ఉంటారు. వీళ్లంతా వ్యవసాయ పనులు చేసుకుంటారు. అడవికి సమీపంలో ఉన్న కొట్టంలోనే ఉంటారు. కానీ శనివారం రాత్రి పొద్దుపోయాక ఇంటి బయట పడుకున్న వెంకటేష్ ను కాటేసింది ఓ పాము.

పాము కాటు సంగతిని 108 సిబ్బందికి సమాచారమిచ్చారు స్థానికులు. దీంతో వెంటనే బాధితుడిని రుయా ఆసుపత్రికి తరలించి చికిత్సను అందించారు. వెంకటేష్ ను పాము కరవడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ రెండుసార్లు ఆయనను కాటేసింది. ఆయన తండ్రితోపాటు భార్య, కుమారుడిని కూడా గతంలో పాము కాటేసింది. ఈమధ్యనే వెంకటేష్ కుమారుడు జగదీష్ కూడా మరోసారి పాముకాటుకు గురయ్యాడు.

కుటుంబం మొత్తం ఇన్నిసార్లు పాము కాటుకు గురవ్వడంతో తీవ్ర భయాందోళనలకు గురవుతోంది. ఆ పాము తమపై పగబట్టిందని.. అందుకే తమను ఇన్నిసార్లు కాటేస్తోందని.. తమను ఆదుకోవాలని అధికారులను కోరుతున్నారు. కానీ గ్రామస్థులు మాత్రం.. ఆ పాము కాటు నుంచి తప్పించుకోవాలంటే.. ఆ కుటుంబం ఆ ప్రాంతం నుంచి ఎక్కడికైనా దూరంగా వెళ్లిపోవడమే మార్గమంటున్నారు.