Pithapuram: పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు (Pendem Dora Babu) వైసీపీకి (YCP) భారీ షాక్ ఇచ్చారు. ఆయన పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా (Resign) చేస్తున్నట్లు ప్రకటించారు. వైసీపీలో తగిన ప్రాధాన్యత, గుర్తింపు అందకపోవడంతోనే పార్టీని వీడుతున్నట్లు దొరబాబు తెలిపారు. రాజకీయ స్వలాభం కోసం కాదు, పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధే తన లక్ష్యమని స్పష్టం చేశారు.
ఇటీవల ఆయన పార్టీలో వీడనున్నట్లు వార్తలు వస్తుండగా, కొంతమంది వాటిని కొట్టిపారేశారు. అయితే, ఆయన తాజా ప్రకటనతో దీనిపై క్లారిటీ వచ్చినట్లైంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలోని ఏదో ఒక పార్టీలో చేరనున్నట్లు దొరబాబు స్పష్టం చేశారు. అన్నీ పార్టీల నుంచి ఆహ్వానాలు అందాయని , అనుచరులతో చర్చించి భవిష్యత్తు నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. 25 సంవత్సరాల పాటు పిఠాపురం ప్రజలతో మమేకమైన నేను .. తనకు వెన్నుపోటు రాజకీయాలు తెలియదని, ప్రజలకు సేవ చేస్తానని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి జగన్‌తో తనకు ఎలాంటి సమస్యలూ లేవని పేర్కొన్నారు.
అయితే, ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి తర్వాత ముఖ్య నేతలు ఒక్కొక్కరుగా ఆ పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు పార్టీ వీడి ఇప్పుడు పెండెం దొరబాబు కూడా ఆ దారిలో చేరారు. 2024 ఎన్నికల్లో తనకు కాదని పిఠాపురం నియోజకవర్గ సీటు వంగా గీతకు ఇచ్చిన దానికి అసంతృప్తిగా ఉన్నారు. ఇక, మరో వైసీపీ నేత మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు కూడా వైసీపీకి రాజీనామా చేశారు. ఆయన టీడీపీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.