Site icon HashtagU Telugu

Free Health Insurance: ఏపీలో విప్లవాత్మకమైన నిర్ణయం.. అందరికీ ఉచిత ఆరోగ్య బీమా!

Free Health Insurance

Free Health Insurance

Free Health Insurance: ఏపీలో అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. రాష్ట్రంలోని ప్రజలందరికీ ఉచిత ఆరోగ్య బీమా (Free Health Insurance) పథకాన్ని వర్తింపజేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ పథకం అమల్లోకి వస్తే విప్లవాత్మకమైన చర్యగా అభివర్ణించొచ్చు. ఈ నిర్ణయంపై త్వరలోనే ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించి అధికారికంగా నిర్ణయం తీసుకోనున్నారు.

ఇందుకు అనుగుణంగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా నుంచి కృష్ణా జిల్లా వరకు ఒక యూనిట్, గుంటూరు నుంచి రాయలసీమ జిల్లాల వరకు మరో యూనిట్‌గా గుర్తించి టెండరు పిలవబోతున్నారు. ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టు కింద ఏడాది రూ.25 లక్షల విలువైన చికిత్సలను ప్రస్తుతం ఉచితంగా అందిస్తున్నారు.కొత్త బీమా విధానంలో వార్షిక పరిమితి, ఇతర షరతులతో నిమిత్తం లేకుండా ప్రజలందరికీ ఉచితంగా బీమా సౌకర్యాన్ని కల్పించేందుకు వీలుగా టెండరు డాక్యుమెంట్ సిద్ధమైంది. ప్రతి కుటుంబానికి ఇప్పుడున్న రూ.25 లక్షల వార్షిక పరిమితి వైద్య సేవలు యథావిధిగా కొనసాగనున్నాయి.

ఐతే ఏడాదికి రూ.2.5 లక్షల వైద్య సేవలు ఉచితంగా అందించేలా టెండరు పిలవనున్నారు. ఆపైన చికిత్సకు అయ్యే ఖర్చును ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టు భరిస్తుంది. దీనిని హైబ్రిడ్ విధానంగా పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఏడాదికి రెండున్నర లక్షల్లోపు వ్యయమయ్యే ట్రీట్‌మెంట్ పొందేవారి సంఖ్య రాష్ట్రంలో 97 శాతం వరకు ఉంది. సీఎం చంద్రబాబు స్థాయిలో నిర్ణయం జరిగిన అనంతరం ఈ ఏడాది ఏప్రిల్ లేదా మే నుంచి బీమా విధానం అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఉచిత ఆరోగ్య బీమా కల్పనపై ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో ప్రధానంగా చర్చ జరగనుంది. ఈ మేరకు ప్రతిపాదనల్లో కొన్ని మార్పులు చేర్పులు చేయనున్నారు.

ప్రస్తుతం వార్షిక ఆదాయం రూ.5 లక్షలలోపు ఉన్న వారికి ట్రస్టు ద్వారా ఉచితంగా వైద్య సేవలు అందుతున్నాయి. ఈ పరిధిలో కోటి 43 లక్షల కుటుంబాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు కలిపి మరో 8.5 లక్షల మంది ఉన్నారు. బీమా పథకం కింద ఒక్కో ఉద్యోగి, పెన్షనర్ రూ. 7 వేల వరకు చెల్లిస్తున్నారు. జర్నలిస్టులు కూడా ప్రీమియం చెల్లిస్తున్నారు. ప్రీమియం చెల్లించే జాబితాలో ఉన్న వారికి మినహాయించి, మిగిలిన వారందరికీ బీమా విధానాన్ని వర్తింపచేసేందుకు వీలుగా ప్రతిపాదనలు సిద్ధం చేశారు.

నిర్దేశించిన రెండు యూనిట్లకు కలిపి ఒక టెండరు పిలుస్తారు. తక్కువ మొత్తాన్ని కోట్ చేసి, ఎల్‌-1గా ప్రైవేట్ కంపనీ వస్తే, అదే ధరకు సేవలు అందించేందుకు వీలుగా ప్రభుత్వ రంగ సంస్థను ఆహ్వానిస్తారు. దీనికి ప్రభుత్వ రంగ సంస్థ ఆమోదం తెలిపితే మరో యూనిట్ బాధ్యత అప్పగిస్తారు. ఒక వేళ ప్రభుత్వ రంగ సంస్థనే ఎల్‌-1గా వస్తే రెండు యూనిట్ల బాధ్యతను అప్పగిస్తారు. ప్రభుత్వ రంగ సంస్థ ద్వారానే సేవలు కొనసాగించాలనేది ప్రభుత్వ ఉద్దేశం.

Also Read: Most ODI Runs vs Pakistan: పాకిస్థాన్‌పై వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్లు వీరే!

ప్రస్తుతం ట్రస్టు ద్వారా రోగి చికిత్సకు ముందస్తు అనుమతి లభించేందుకు 24 గంటల వరకు సమయం పడుతోంది. బీమా విధానంలో 6 గంటల్లోనే చికిత్స ప్రారంభానికి అనుమతి లభించనుంది. ఇక చికిత్సకు ఆమోదం తెలిపేందుకు బీమా సంస్థ నిరాకరిస్తే వెంటనే అప్పీలు చేసుకునే వెసులుబాటు కల్పిస్తారు. ఈ విధానంలో ప్రభుత్వానికి అపరిమిత అధికారాలు ఉంటాయి. ఎంపిక చేసిన బీమా కంపెనీ మూడేళ్ల పాటు సర్వీసు అందించాలి. ప్రతి ఏడాది పని తీరు సమీక్షిస్తారు. ప్రస్తుతం ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టు అనుబంధ హాస్పిటల్స్ బీమా విధానంలోనూ కొనసాగుతాయి. వైద్య మిత్రల సేవలను కొనసాగిస్తారు. ఎంపిక చేసిన బీమా సంస్థలకు ప్రతి మూడు నెలలకోసారి ప్రభుత్వ పరంగా ముందుగానే చెల్లింపులు చేస్తారు. దీనివల్ల బిల్లుల చెల్లింపుల సమస్యలు తలెత్తవు. రోగులకు అందించిన చికిత్స వివరాలు అందిన తర్వాత బీమా సంస్థలు సాధ్యమైనంత త్వరగా చెల్లింపులు చేసేలా నిర్దేశిత గడువును కూడా టెండరు డాక్యుమెంట్‌లో పొందుపరుస్తున్నారు.

ప్రస్తుతం 30 రకాల స్పెషాల్టీలతో కలిపి 3 వేల 257 రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. వీటిని అలాగే కొనసాగించనున్నారు. ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద అందే 1949 రకాల చికిత్సలూ ఇందులో ఉన్నాయి. బీమా ప్రీమియం కింద ప్రభుత్వం చెల్లించే మొత్తం కంటే తక్కువగా ఖర్చు అయితే అందులో నిర్వహణ వ్యయమొత్తాన్ని కంపెనీలు మినహాయించుకుని మిగిలిన దానిని వెనక్కి ఇచ్చేయాలి. ఎక్కువైతే మాత్రం బీమా కంపెనీ భరించాలన్న విధంగా ప్రతిపాదనలు సిద్ధం అయ్యాయి.

ప్రతి కుటుంబం తరపున ప్రభుత్వం చెల్లించాల్సిన ప్రీమియం రూ.2500 వరకు ఉండొచ్చని అంచనా. జాతీయ స్థాయిలో పిలిచే టెండర్ల ద్వారా ప్రభుత్వ, ప్రైవేట్ బీమా కంపెనీలు పోటీ పడతాయి. తమిళనాడు, జార్ఖండ్, రాజస్థాన్, మహారాష్ట్ర ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వ బీమా సంస్థల ద్వారా అక్కడి వారికి వైద్య సేవలు అందుతున్నాయి. WHO అధ్యయన ఫలితాలు, వివిధ రాష్ట్రాల్లో అమల్లో ఉన్న ఉత్తమ పద్ధతులను ప్రభుత్వం సమీక్షించింది.