Site icon HashtagU Telugu

Naravaripalli : నారావారిపల్లెకు అరుదైన గౌరవం

Naravaripalli

Naravaripalli

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu) స్వగ్రామం నారావారిపల్లె(Naravaripalli )కు ‘స్కోచ్’ అవార్డు (Skoch Award) లభించింది. పీఎం సూర్యఘర్ పథకం కింద అతి తక్కువ సమయంలోనే 1,600 ఇళ్లపై సోలార్ రూఫ్‌టాప్ ప్రాజెక్టులను పూర్తి చేసినందుకు ఈ అరుదైన గుర్తింపు దక్కింది. ఈ ప్రాజెక్టును ముఖ్యమంత్రి స్వయంగా ప్రారంభించారు. అధికారులు కేవలం నాలుగున్నర నెలల్లో ఈ లక్ష్యాన్ని సాధించి ఆదర్శంగా నిలిచారు. సెప్టెంబర్ 20న ఢిల్లీలో జరిగే సదస్సులో తిరుపతి జిల్లా కలెక్టర్ ఈ అవార్డును అందుకోనున్నారు. ఈ సందర్భంగా నారావారిపల్లెను ‘స్వర్ణ నారావారిపల్లె’గా గుర్తిస్తూ స్కోచ్ గ్రూప్ కలెక్టర్‌కు లేఖ రాసింది.

79th Independence Day : తెలంగాణను మోడల్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

నారావారిపల్లె క్లస్టర్‌లో మొత్తం 2,378 ఇళ్లు ఉండగా, వాటిలో 1,649 ఇళ్లకు సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్టు కోసం మొత్తం రూ.20.68 కోట్లు ఖర్చు చేశారు. ఒక్కో యూనిట్‌కు రూ.1,21,600 ఖర్చు కాగా, పీఎం సూర్యఘర్ పథకం కింద కేంద్రం రూ.60,000 రాయితీ ఇచ్చింది. మిగిలిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించింది. పనులను వేగవంతం చేయడానికి మొత్తం 8 కంపెనీలకు బాధ్యతలు అప్పగించారు. సాంకేతిక కారణాల వల్ల కొన్ని ఇళ్లకు సోలార్ ప్యానెల్స్ అమర్చలేదు, ఇందులో ఆధార్, బ్యాంకు ఖాతా వివరాలు సరిగా లేని ఇళ్లు కూడా ఉన్నాయి.

ఈ ప్రాజెక్టు ద్వారా నారావారిపల్లె క్లస్టర్‌లోని మూడు పంచాయతీలకు సోలార్ విద్యుత్ సరఫరా అవుతోంది. దీనివల్ల విద్యుత్ నష్టం తగ్గడమే కాకుండా, గ్రామస్థులకు ఆదాయం కూడా సమకూరుతోంది. ఉదాహరణకు, జూన్ నెలలో 2.30 లక్షల యూనిట్ల విద్యుత్ మిగిలింది. మిగిలిన విద్యుత్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో యూనిట్‌కు రూ.2.09 చొప్పున కొనుగోలు చేసింది. దీని ద్వారా లబ్ధిదారులకు దాదాపు రూ.4,80,700 ఆదాయం వచ్చింది. ఈ ప్రాజెక్టు విజయవంతం కావడంతో, ఏపీఎస్‌పీడీసీఎల్‌ ఎండీకి కూడా గవర్నెన్స్‌ నౌ కేటగిరీలో ‘అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్’ లభించింది. దీనితో పాటు, ఏపీకి కూడా ‘స్పెషల్ స్టేట్ అవార్డు’ మరియు ‘ప్రెస్టీజియస్ అవార్డు’ లభించాయి.