ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు సాయంత్రం వైజాగ్ కి చేరుకోనున్నారు. ఆయన ఈ పర్యటన సీఐఐ భాగస్వామ్య సదస్సు (CII Partnership Summit 2025) నేపథ్యంలో అత్యంత కీలకంగా భావిస్తున్నారు. సాయంత్రం 6 గంటలకు విశాఖ చేరుకున్న వెంటనే, సమ్మిట్ ఏర్పాట్లపై అధికారులు, మంత్రులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ రోజు రాత్రే భారత్ ఫోర్జ్ వైస్ చైర్మన్ అమిత్ కళ్యాణితో సీఎం భేటీ అవుతారు. నాలుగు రోజుల పాటు వరుసగా వన్ టు వన్ మీటింగ్స్, పెట్టుబడుల ఒప్పందాలు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు వంటి అనేక కార్యక్రమాలతో ఆయన విశాఖలో బిజీగా ఉండనున్నారు.
Gold Price Today: బంగారం తగ్గింది.. సిల్వర్ రేట్ పెరిగింది
గురువారం ఉదయం నుంచే సమ్మిట్‌లో జాతీయ, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో ముఖ్యమైన చర్చలు జరగనున్నాయి. ముఖ్యంగా ‘ఇండియా–యూరోప్ బిజినెస్ రౌండ్‌టేబుల్’, ‘పార్ట్నర్స్ ఇన్ ప్రోగ్రెస్’ వంటి సెషన్లలో సీఎం పాల్గొననున్నారు. తైవాన్, ఇటలీ, స్వీడన్, నెదర్లాండ్స్ దేశాల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ‘వైజాగ్ ఎకనామిక్ రీజియన్’ అభివృద్ధిపై సిఎం దృష్టి సారించనున్నారు. గురువారం సాయంత్రం నెట్వర్క్ డిన్నర్‌తో మొదటి రోజు కార్యక్రమాలు ముగియనున్నాయి. నవంబర్ 14న ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్, వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ సమక్షంలో సదస్సు ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ఏపీ పెవిలియన్ ప్రారంభం, డ్రోన్ సిటీ, స్పేస్ సిటీ లాంచ్‌లు, అలాగే సింగపూర్‌కు నేరుగా విమాన సర్వీసులపై ఒప్పందం కుదరనున్నాయి.
శనివారం (నవంబర్ 15) సదస్సు చివరి రోజు అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగనుంది. గూగుల్, శ్రీ సిటీ, రేమండ్, ఇండోసోల్ వంటి ప్రముఖ సంస్థల ప్రాజెక్టుల శంకుస్థాపనలు జరగనున్నాయి. బహ్రెయిన్, న్యూజిలాండ్, జపాన్, కెనడా, మెక్సికో వంటి దేశాల ప్రతినిధులతో సీఎం భేటీలు నిర్వహిస్తారు. ‘గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ’, ‘సస్టైనబుల్ సిటీస్’, ‘ఆంధ్ర టూరిజం విజన్’ వంటి కీలక సెషన్లు జరుగనున్నాయి. ఈ సదస్సులో 100కి పైగా అంతర్జాతీయ ప్రతినిధులు పాల్గొని, రూ. 10 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన 30కి పైగా ఒప్పందాలు కుదరనున్నాయి. ఏఐ, స్పేస్, గ్రీన్ ఎనర్జీ, ఎంఎస్ఎంఈ, ఫైనాన్స్ రంగాల్లో కొత్త పెట్టుబడులు సాధించడం ద్వారా ఏపీని “వికసిత్ భారత్” లక్ష్య దిశగా తీసుకెళ్లడమే సీఎం చంద్రబాబు ప్రధాన ధ్యేయం. విశాఖ సమ్మిట్ ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ పెట్టుబడిదారుల దృష్టిపథంలో నిలపాలనే సంకల్పంతో ప్రభుత్వం సిద్ధమై ఉంది.
