అమరావతి నగరాన్ని ‘గ్రీన్ రాజధాని’గా అభివృద్ధి చేస్తున్న విషయం తెలిసిందే. పూర్తి స్థాయి పునరుత్పాదక శక్తితో నడిచే ప్రపంచంలోని మొట్టమొదటి రాజధాని ఇదేనని గతంలో ప్రభుత్వం ప్రకటించింది. ఈ గ్రీన్ విజన్‌లో భాగంగా పునరుత్పాదక ఇంధనాల వాడకంతో పాటు.. రోడ్లు, ఉద్యానవనాలు, బఫర్ జోన్‌ల వెంట విస్తృతంగా చెట్ల పెంపకం చేపట్టనున్నట్లు మాస్టర్ ప్లాన్‌లో పొందుపరిచారు. గ్రీన్ స్పేస్‌లు, స్థిరమైన మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసే విధంగా ప్రణాళికలు రూపొందించారు. ప్రస్తుతం ఆ ప్లాన్ అమలు దిశగా అడుగులు పడుతున్నాయి. అమరావతికి హరిత హారం వేయడం కోసం.. మొక్కలు పెంచేందుకు వీలుగా ఉద్ధండరాయునిపాలెంలో సీఆర్డీఏ సెంట్రల్ నర్సరీ నిర్మిస్తున్నారు. నర్సరీతో పాటు రైతు శిక్షణ కేంద్రం కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ శిక్షణ కేంద్రంతో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
ఉద్ధండరాయునిపాలెంలో రూ.75 లక్షలతో సీఆర్డీఏ ఉద్యాన నర్సరీని ఏర్పాటు చేస్తోంది. నర్సరీతో పాటు రైతు శిక్షణ కేంద్రం కోసం 25 ఎకరాలు కేటాయించారు. కరకట్ట దిగువన ఈ ప్రదేశం ఉంది. ఇందులో 5 ఎకరాల స్థలాన్ని.. రాజధాని ప్రాంత నిరుద్యోగులు, రైతు కూలీలకు శిక్షణ ఇచ్చేందుకు కేటాయించారు. మిగతా 20 ఎకరాల్లో రాజధాని ప్రాంత వాతావరణం, నేలలకు తగిన మొక్కలను పెంచనున్నారు. నగరంలో పచ్చదనం పెంపునకు ఈ నర్సరీ మొక్కలను ఉపయోగించనున్నారు. రహదారుల పక్కన, డివైడర్ల మధ్యలో, ఉద్యానాలు, ఎల్పీఎస్ లేఔట్లలో ఈ నర్సరీ మొక్కలనే వాడనున్నారు.
ఆరు నెలల్లో ఈ నర్సరీని సిద్ధం చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో పాలీహౌస్‌లు, షేడ్‌నెట్‌లు ఏర్పాటు చేయనున్నారు. ఈ నర్సరీకి అవసరమయ్యే సేంద్రీయ ఎరువును.. ఇక్కడే వర్మీ కంపోస్టు యూనిట్‌ను నిర్మించి తయారు చేయనున్నారు. బోన్సాయ్ రకాలను కూడా విరివిగా పెంచడంతో పాటు థీమ్ పార్కును కూడా అభివృద్ధి చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ నర్సరీలో ప్రత్యేకంగా సీతాకోకచిలుకల పార్కును కూడా డిజైన్ చేశారు అధికారులు.
ఐదు ఎకరాల స్థలంలో నిర్మించనున్న ఈ శిక్షణ కేంద్రంలో.. నిపుణులను తయారు చేసేందుకు సీఆర్డీఏ.. ఉద్యాన శాఖ సహకారం తీసుకుంటోంది. ఈ కేంద్రంలో మొక్కలకు అంట్లు కట్టడం, కొమ్మలు కత్తిరించడం, నర్సరీల నిర్వహణలో మెలకువలు నేర్పించడంతో పాటు.. మొక్కల సంరక్షణ తదితర అంశాల్లో శిక్షణ ఇస్తారు. ఈ శిక్షణతో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. శిక్షణ కేంద్రం, నర్సరీలో వివిధ అవసరాలకు పూర్తిగా పునరుత్పాధక ఇంధన వనరులు ఉపయోగించనున్నారు.