Gas Leak అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గ్యాస్ లీక్ ఘటన కలకలం రేపుతోంది. మలికిపురం మండలంలోని ఇరుసమండ వద్ద ఓఎన్‌జీసీ పైప్‌లైన్ నుంచి భారీగా గ్యాస్ లీక్ అవుతోంది. దీంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంపై అధికారులకు సమాచారం అందించారు. దీంతో ఓఎన్‌జీసీ సాంకేతిక నిపుణులు అక్కడికి చేరుకున్నారు. గ్యాస్ లీకేజీ ఘటనతో స్థానికులు భయపడిపోతున్నారు. మరోవైపు కోనసీమ జిల్లాలో గతంలోనూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో భారీగా గ్యాస్ లీకైంది. మలికిపురం మండలంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇరుసుమండలోని ఓఎన్‌జీసీ డ్రిల్ సైట్ నుంచి గ్యాస్ లీకవుతోంది. సోమవారం మధ్యాహ్నం సమయంలో ఈ ఘటన జరిగింది. సుమారు 2 గంటలపాటు గ్యాస్ పైకి చిమ్మింది. దీంతో జనం భయపడిపోయారు. వెంటనే ఈ విషయాన్ని అధికారులకు తెలియజేశారు. దీంతో స్థానిక తహసీల్దార్ శ్రీనివాసరావు ఘటనాస్థలిని పరిశీలించారు. ఓఎన్‌జీసీ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.. దీంతో ఓఎన్‌జీసీ సంస్థ సాంకేతిక నిపుణులు ఘటనాస్థలికి చేరుకున్నారు. గ్యాస్ లీక్ ఘటనతో ఆ చుట్టుపక్కల నివసిస్తున్నవారు ఆందోళనకు గురౌతున్నారు.
మరోవైపు మలికిపురం మండలంలో గ్యాస్ లీక్ కావటం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ ఇక్కడ గ్యాస్ లీక్ ఘటనలు చోటుచేసుకున్నాయి. 2025 మార్చి నెలలో మలికిపురం మండలం కేశనపల్లిలో గ్యా్స్ లీకైంది. గ్రూప్ గ్యాస్ గ్యాదరింగ్ స్టేషన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.ఈ ఘటనలో అప్పట్లో 9 మంది అస్వస్థతకు గురయ్యారు, గ్యాస్ వ్యాపించి స్థానికులు ఇబ్బందులు పడ్డారు. మరోవైపు ఉమ్మడి గోదావరి జిల్లాలలో అప్పుడప్పుడూ ఇలా గ్యాస్ లీకైన ఘటనలు చోటుచేసుకుంటూ ఉంటున్నాయి. అధికారులు, ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. అప్పుడప్పుడూ ఈ తరహా ఘటనలు జరగడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
