Site icon HashtagU Telugu

Andhra Pradesh : : నందిగామ‌లో ఓ వ్య‌క్తికి దొరికిన‌ అరుదైన వ‌జ్రం.. దాని విలువ ఎంతంటే..?

Diamonds

Diamonds

ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజ‌క‌వ‌ర్గంలోని చందర్లపాడు మండలం గుడిమెట్లలో ఓ వ్యక్తికి వజ్రం దొరికింది. ఇది అలాంటి ఇలాంటి వజ్రం కాదు. షడ్ బుజి వజ్రం ఆ వ్య‌క్తికి దొరికింది. వజ్రానికి 6 కోణాలు ఉండటంతో దీనికి మంచి డిమాండ్ వస్తోంది. పల్నాడు జిల్లా సత్తెనపల్లి దగ్గర బిగుబండ గ్రామానికి చెందిన ఓ కుటుంబం గుడిమెట్లలో వజ్రాల వేట సాగిస్తోంది. ఈ క్రమంలో షడ్ బుజి వజ్రం లభించింది. దీని విలువ సుమారు రూ. 50 నుంచి రూ. 60 లక్షలు విలువ ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే విషయం తెలుసుకున్న వజ్రాల వ్యాపారులు రూ. 40 లక్షలు ఇస్తామంటూ బేరసారాలు చేస్తున్నారు. వజ్రాన్ని వెతికి కుటుంబ సభ్యులు మాత్రం ఇంకా మంచి ఆఫర్ కోసం ఎదురు చూస్తున్నారు.

గుడిమెట్ల గ్రామంలో ఏడాది పోడువునా వ‌జ్రాల వేట సాగుతుంది. చుట్టుప్ర‌క్కాల గ్రామాల నుంచే కాకుండా రాష్ట్రంలోని ఇత‌ర జిల్లాల నుంచి కూడా చాలామంది ఈ వ‌జ్రాల వేటకోసం వ‌స్తుంటారు. అక్క‌డే రాత్రుళ్లు నిద్ర‌పోయి.. మ‌రుస‌టి రోజు వజ్రాల కోసం కుటుంబాలు కుటుంబాలు వ‌ల‌స వ‌స్తాయి. కొంత‌మంది అయితే నెల‌లు త‌ర‌బ‌డి ఇక్క‌డే వజ్రాల వేట‌లో మునిగిపోతారు. అయితే ఎవ‌రికో ఒక‌రికి ఒక్క వ‌జ్రం మాత్రం అప్పుడ‌ప్పుడు దొరుకుంతుంద‌ని అంటుంటారు. తాజాగా ఓ వ్య‌క్తికి అరుదైన వ‌జ్రం దొర‌క‌డంతో గుడిమెట్ల గ్రామానికి వ‌జ్రాల వేట కోసం వ‌చ్చే వారిని సంఖ్య మ‌రింత పెరిగింది.