ఆంధ్రప్రదేశ్‌లో గత కొన్నేళ్లుగా మావోయిస్టు చలనం గణనీయంగా తగ్గి, రాష్ట్రం ప్రశాంత వాతావరణాన్ని ఆస్వాదిస్తుండగా, ఈరోజు ఒక్కసారిగా జరిగిన పరిణామాలు భద్రతా వ్యవస్థను కదిలించేశాయి. మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్‌లో అగ్ర మావో నేత హిడ్మా హతమవడం, అటు విజయవాడ, కాకినాడల్లో భారీ సంఖ్యలో మావోయిస్టులు అరెస్టుకావడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. హిడ్మా మరణం దండకారణ్యంలో మావోయిస్టు శక్తికి భారీ దెబ్బగా మారగా, పట్టుబడిన మావోలు రాష్ట్రంలో మళ్లీ తలెత్తుతున్న గూఢ చలనాలపై ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా పెనమలూరులో అద్దెకు తీసుకున్న భవనంలో 10 రోజులుగా ఎవ్వరూ బయటికి రాకపోవడం, ఆ ప్రాంత ప్రజల్లో అనుమానాలు పెంచింది.
Maoist Hidma : వందల మంది మృతికి హిడ్మానే కారణం!
విజయవాడలో జరిగిన ఆక్టోపస్ ప్రత్యేక ఆపరేషన్‌లో 31 మంది మావోయిస్టులను అరెస్టు చేయడం ఒక కీలక పరిణామం. కూలీల పేరిట పెనమలూరులో భవనం అద్దెకు తీసుకుని, దాన్ని షెల్టర్ జోన్‌గా మార్చుకుని మావోయిస్టులు సమావేశాలు, వ్యూహా రూపకల్పనలు నిర్వహించినట్లు అధికారులు గుర్తించారు. విజయవాడ ఆటోనగర్‌లో ఏర్పాటు చేసిన గూఢ డంప్‌యార్డ్ నుండి ఏకే-47 రైఫిల్, పెద్ద సంఖ్యలో డిటోనేటర్లు, పేలుడు పదార్థాలు స్వాధీనం కావడం మావోయిస్టులు పెద్ద స్థాయి ఆపరేషన్లకు సిద్ధమవుతున్నారని సూచిస్తోంది. ఈ పట్టుబడినవారిలో 12 మంది మహిళలు, మొత్తం 9 మంది సెంట్రల్ కమిటీ సభ్యులు ఉండటం ఆర్గనైజేషన్ కీలకస్తులు నగరాల్లో తిరుగుతున్నారనే సంకేతం.
కాకినాడ–విజయవాడ అరెస్టులు, అల్లూరి జిల్లాలో హిడ్మా హతమవడం ఈ రెండూ ఒకేసారి జరగడంతో, మావోయిస్టులు బ్యాచులుగా అడవులను విడిచి సమీప పట్టణాల్లో దాక్కుంటున్నారా? లేక ప్రభుత్వంతో చర్చలు ప్రారంభించే ప్రయత్నంలో ఉన్నారా? అనే అనుమానాలు భద్రతా సంస్థల్లో చర్చనీయాంశాలయ్యాయి. ఒకవైపు ఎన్కౌంటర్ ఒత్తిడి, మరోవైపు అంతర్గత విభేదాలు కారణంగా మావోయిస్టు నేతలు తీర ప్రాంతాలకు చేరుకున్నారా? అనే కోణాన్ని కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. ఏదేమైనా, ఈ అరెస్టులు మావోయిస్టుల భవిష్యత్ వ్యూహం ఏ దిశలో సాగుతుందన్న దానిపై స్పష్టత ఇవ్వగల కీలక మలుపుగా మారనున్నాయి.
